తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంత విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ క్రింద బోధనారుసుములు, ఉపకార వేతనాలు చెల్లిస్తామని తీసుకున్న నిర్ణయం హర్షించదగినది. ప్రభుత్వపరంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్షం ఏర్పాటు చేసి తీసుకున్న నిర్ణయం ప్రాంతీయ విద్యార్థులకే ప్రయోజనాలు అనే సందేశాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఏర్పడినప్పటికీ ఉన్నత విద్యకు సంబంధించి ఉమ్మడి విధానమే పదేళ్లు కొనసాగుతుంది. తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేనప్పటికీ ఈ విధానమే కొనసాగాలని కేంద్ర ప్రభుత్వ విభజన బిల్లులో ఈ అంశాన్ని పొందుపరిచింది. ఆచరణలో ఉమ్మడి విద్యా విధానంలో సమస్యలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలిసివచ్చింది. ఉమ్మడి విధానంలో అడ్మిషన్లకు సంబంధించి ఇప్పటి వరకు స్థానికేతర విద్యార్థులకు 15శాతం కోటా ఉన్నది. ఇది రాష్ట్ర విభజన తర్వాత కూడా కొనసాగుతుంది. దీనిలో మతలబు ఏమిటంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో 15శాతం కోటాకు తీవ్ర పోటీ ఉంటుంది.
కానీ సీమాంధ్రకు చెందిన ఏ ప్రాంతానికీ తెలంగాణ విద్యార్థులు ఆ శాతం నిండరు. అలాంటప్పుడు తెలంగాణ ప్రభుత్వం స్థానికేతరుల వ్యయాన్ని కూడా భరించాల్సి వస్తుంది. ఒకసారి రాష్ట్రం విడిపోయిన తర్వాత అది సాధ్యమేనా? కాదు. అందుకే కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్ కేవలం ఇక్కడి పిల్లలకే అని నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. ఈ నిర్ణయం కూడా ఏకపక్షంగా తీసుకోకుండా, అఖిలపక్షంలో సమస్యను ప్రాంతీయ న్యాయం కోణంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ సమస్యకు మూలాలు ఇంకా తీవ్రమైనవి. తెలంగాణ ఉద్యమం రాజుకున్న నేపథ్యాన్ని పరిశీలించినప్పుడు ఇవి ఇంకా తేటతెల్లంగా కనబడతాయి.
విద్యార్థులకు ఇచ్చే బోధన రుసుములు, ఉపకార వేతనాల భారం కేవలం ఆంధ్ర విద్యార్థులకు అంటే స్థానికేతరులకు చెల్లించేది 1300 కోట్ల రూపాయలుగా ఉన్నది. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు స్థానికేతర ప్రభుత్వ కోటా కింద 39794 మంది చదువుకుంటున్నారు. తాజా ప్రవేశాలకు ముందు సీనియర్ విద్యార్థులకు చెల్లించాల్సినవే 1200 కోట్లుగా తేలింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇక్కడ 1300 కోట్లు మిగులుగా ఉంటుంది. దీన్ని మరి 60వేలమందికి చెల్లించవచ్చునన్నది అంచనా. ఈ లెక్క ఇక్కడి ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి వేరే విధంగా కూడా ఆలోచించవలసి ఉన్నది.
హైదరాబాద్‌లోని ప్రధాన యూనివర్సిటీలలో సూక్ష్మస్థాయిలో పరిశీలించినప్పుడు, ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల, జేఎన్‌టీయూలలో స్థానికత పేరిట కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు నిండారు. స్థానికత నాలుగేళ్లకే పరిమితం చేసిన అనంతరం ఇక్కడికి విద్యార్థుల వలసలు విపరీతంగా పెరిగాయి. హైదరాబాద్ మౌలిక వసతులు, ఉపాధి లభ్యత, విశ్వవిద్యాలయాల ప్రమాణాల కారణంగా ఇక్కడ చేరడానికే తీవ్రమైన పోటీ ఉంటుంది. విద్యలో ఎన్నడో ముందంజ వేసిన ప్రాంతం విద్యార్థులతో తెలంగాణ విద్యార్థులు పోటీపడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక కొలువులను కొల్లగొట్టడంలోనే మొత్తం ఈక్రమం ప్రారంభమయింది.
వెల్లోడి పాలన సమయం నుంచి ఇప్పటి దాకా స్థానికుల ఉద్యోగాలలో ప్రాంతేతరులు నిండడం వల్లనే ముల్కీ నినాదం, స్థానికులకే ఉద్యోగాలు అనే ఉద్యమాలు వచ్చాయి. ఒకసారి ఉద్యోగాల్లోనే స్థానికీయత లేకుండా ప్రాంతేతరులు నిండడం ఒక దోపిడీ అయితే, ఈ ఉద్యోగస్తులు ఇక్కడ స్థిరపడి, వారి పిల్లలు ఇక్కడ స్థానికులు కావడంతో అది మరింత విస్తృతమయింది.
హైదరాబాద్ రాజధాని నగరం కనుక ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారన్నది పాక్షిక సత్యమే. ఒకప్పుడు వలసలు ఉధృతమైనప్పటికీ తొలి తెలంగాణ ఉద్యమం ప్రజ్వరిల్లినప్పుడు వలసల ఉధృతి తగ్గింది. హైదరాబాద్‌లో భద్రత లేదనుకొని వెళ్లిపోయేందుకు సిద్ధమైన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. కానీ ఎన్టీఆర్ 1982 తర్వాత రాజ్యమేలినప్పుడు సీమాంధ్రులకు తెలుగుజాతి పేరిట ఒక భరోసా దొరికింది. అప్పటి నుంచి ఉద్యోగాల అనంతరం చదువులు, విద్యాసంస్థలను మూలవాసులు, తెలంగాణలోనే పుట్టిన విద్యార్థులకన్నా, ప్రాంతేతర విద్యార్థులు స్థానిక సర్టిఫికెట్లతో నిండడం ప్రారంభమయింది. పైకి ఈ సమస్య కనిపించదు కానీ పేరుకు హైదరాబాద్‌లో ఉన్న యూనివర్సిటీలే అయినా ఆ సంస్థల్లో చదివే పిల్లల జన్మస్థలాలు, పుట్టుక, ఏ ప్రాంతం వారు అనే లెక్కలు తీస్తే దిగ్భ్రాంతికర సత్యాలు వెలికివస్తాయి.
ఈ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పటికీ ఉమ్మడి ప్రాతిపదిక ఎంత మాత్రం సబబు కాదని ఆచరణాత్మకం కాదని, ఉమ్మడి అంటే ఏ కారణం కోసమైతే తెలంగాణ ఉద్యమం వచ్చిందో? ఆ కారణాలకు పరిష్కారాలు దొరికినట్టు కాదని స్పష్టమవుతున్నది. సరే! అసలు మూల సమస్య ఎట్లా ఉన్నప్పటికీ, తక్షణమే ముందుకు వచ్చిన ఫీజురీయింబర్స్‌మెంట్‌లో తెలంగాణ పిల్లలకు మాత్రమే చెల్లిస్తామన్న నిర్ణయం అన్నా ప్రాంతీయ న్యాయం చేస్తున్నది. ఇది తెలంగాణ ఏర్పడినందువల్ల కలిగిన సావకాశం. స్థానికత అనేది ఒక కీలకాంశంగా ఉండే ఉద్యోగుల సమస్య, విద్యార్థుల సమస్యను తెలంగాణ స్పృహతో పరిష్కరించుకోవలసిందే. కటువుగా ఉన్నా ప్రాంతీయ ప్రయోజనాలు మిన్నగా ఈ నిర్ణయాలుంటేనే తెలంగాణ కల సాకారం అయినట్టు. ఆచరణలో తెలంగాణ ప్రజలకే తెలంగాణ ఫలాలు దక్కినట్టుగా భావించాలి.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..