సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన గిరిజన సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరై గిరిజనుల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్ట్ కు గిరిజన సలహామండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, ప్రాజెక్టు నిర్వాసిత గిరిజనులకు పునరావాసం కల్పిస్తామని, ఏ రాష్ట్రం ఇవ్వనంత ప్యాకేజీని గిరిజనులకు అందిస్తామని చెప్పారు.
ఎకరం రూ. లక్ష రూపాయలు ఉంటే, రూ. 4 లక్షల పరిహారం అందుతుందని, ప్రాజెక్టు నిర్వాసితులకు అత్యుత్తమ ప్యాకేజ్ అందజేస్తామని అన్నారు. తండాలు, గూడెంలను పంచాయితీలుగా మార్చాలని నిర్ణయించినట్లు, ఎస్టీ నేతలతో మాట్లాడి పంచాయితీల మార్పుపై విధివిధానాలు రూపొందిస్తామని, గిరిజన ప్రాంతాల్లో అక్షరాస్యత, విద్యాసంస్థల పరిస్థితిపై అధ్యయనం చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.