mt_logo

పీపీఏ రద్దుపై ఆంధ్రా సర్కార్ వైఖరి ఎండగట్టాలి – కేసీఆర్

పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ వ్యవహారాన్ని తిప్పికొట్టాలని, తెలంగాణ వాటా రాబట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రాంతానికి కరెంటు రాకుండా చేసి రైతులను ముంచాలని చూస్తున్న ఏపీ జెన్కో చేస్తున్న కుట్రలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేయాలని, పీపీఏల వివాదానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రప్రభుత్వానికి అందించాలని అధికారులకు సూచించారు.

శుక్రవారం పీపీఏ వివాదం, విద్యుత్ కొరతకు సంబంధించి సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ జెన్కో సీఎండీ డీ ప్రభాకరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు అంశాలకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ చందాను మరికొన్ని రోజులపాటు అక్కడే ఉండాలని సూచించారు. విద్యుత్ కొరత అధిగమించేందుకు జెన్కో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా అన్ని మౌలికవసతులు కల్పించుకోవాలని, ఏ రాష్ట్రంలో మిగులు విద్యుత్ వున్నా కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

మిగులు విద్యుత్ ఉన్న రెండు మూడు రాష్ట్రాలను గుర్తించినట్లుగా జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు చెప్పగానే ఆయా రాష్ట్రాలనుండి విద్యుత్ కొనుగోలు ఏర్పాట్లకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *