mt_logo

ప్రతి పేదవాడికీ ఆరోగ్యం – కేటీఆర్

మూడురోజులపాటు జరగనున్న ఇండో గ్లోబల్ హెల్త్ కేర్ సదస్సును శుక్రవారం హోటల్ తాజ్ కృష్ణాలో ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు. వాస్తవానికి సీఎం కేసీఆర్ ఈ సమావేశాన్ని ప్రారంభించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోవడంతో, ఐటీ మంత్రి కేటీఆర్ సమావేశం ప్రారంభించారు. సీఎం పంపిన ప్రసంగాన్ని కేటీఆర్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఆరోగ్యం ధనవంతులకు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ప్రతి పేదవాడికీ అందేలా చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, హైదరాబాద్ నగరాన్ని హెల్త్ క్యాపిటల్ గా తీర్చిదిద్దుతామని అన్నారు.

ప్రైవేట్ రంగంలోని కార్పొరేట్ వైద్యానికి సహకారం అందిస్తూనే ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేయనుందని, ప్రతీ జిల్లాలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బీబీ నగర్ నిమ్స్ ఆస్పత్రిని ఎయిమ్స్ స్థాయిలో తీర్చిదిద్దుతామని, హైదరాబాద్ లో తప్ప తెలంగాణ మిగతా జిల్లాల్లో మెరుగైన ఆస్పత్రులు లేవని, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం తదితర ఏజెన్సీ జిల్లాల్లో వైద్యం అందక రోగులు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి రావాల్సి వస్తుందని విచారం వ్యక్తం చేశారు.

బీబీ నగర్ నిమ్స్ ను తొమ్మిది నెలలలోపు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని, తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యరంగానికి కేటాయించిన బడ్జెట్ ను రెట్టింపు చేస్తామని, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక తెలంగాణ ఇంక్రిమెంట్ తో పాటు హెల్త్ కార్డులతో ఉచిత వైద్యాన్ని అందించనున్నదని కేటీఆర్ హామీ ఇచ్చారు. వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.

వైద్యరంగంలో విశిష్ట సేవలందించిన పలువురు వైద్యరంగ నిపుణులకు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులను కేటీఆర్ అందజేశారు. వారిలో దేశంలో ప్రఖ్యాతిగాంచిన కాకర్ల సుబ్బారావు, హబీబ్ ఘటాలా, కేవీ కృష్ణారావు తదితరులతో పాటు అమెరికా తదితర దేశాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, పద్నాలుగు సంవత్సరాలపాటు అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌దేనని, దేశ స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మాగాంధీ పోషించిన పాత్రను తెలంగాణ సాధనలో కేసీఆర్ పోషించారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *