– తన్నీరు హరీష్‌రావు (టిఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత)
మొత్తంగా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పంపిణీ, కొనుగోళ్ల విధానంలో అనేక తప్పులు చేయబట్టే ఇవాళ విద్యుత్ సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయన్నది సుస్పష్టం. ప్రభుత్వం చేసిన ఉద్దేశపూర్వక తప్పుల వల్లే ఈ కష్టం వచ్చింది… తమిళనాడు, కేరళ, కర్ణాటకలతో పోలిస్తే బొగ్గు, నీళ్లు, గ్యాస్ మనకే ఎక్కువ ఉన్నాయి. కరెంట్ చార్జీలు మాత్రం వాళ్లకు తక్కువ ఉన్నాయి. నిజాయితీ, పారదర్శకత లేకపోవడమే ఇందుకు కారణం కాదా? ఎంతకాలం ఇలా సామాన్య జనాన్ని శిక్షిస్తారు?
‘గత ఐదేళ్లలో విద్యుత్ చార్జీలు పెంచలేదు. మరో ఐదేళ్లు పెంచబోము’ అని 2009 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాతి ఏడాది నుంచే విద్యుత్ చార్జీల బాదుడు మొదలుపెట్టింది. రోశయ్య ప్రారంభించిన ఈ విద్యుత్ చార్జీల పెంపు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర చరిత్రలోనే (బహుశా దేశ చరిత్రలో కూడా) ఎన్నడూ లేనంతగా 41 శాతం విద్యుత్ చార్జీలు పెంచడానికి తెగబడ్డారు. ఇప్పటికే వేసిన సర్ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీలు 7000 కోట్లు చాలవన్నట్లు మళ్లీ గృహ విద్యుత్ వినియోగదారుల నెత్తిన రూ.12,723 కోట్ల భారాన్ని మోపేందుకు ప్రభుత్వం సిద్ధమయింది.
నష్టాల్లో ఉన్న పంపిణీ సంస్థ (డిస్కమ్)లను కాపాడాలంటే ఇది తప్పదని ప్రభుత్వం మొండికి దిగుతోంది. వాస్తవానికి ఇప్పుడు చార్జీల రూపంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఈ శిక్ష, ప్రభుత్వ తప్పిదాల ఫలితమే. గత పన్నెండేళ్లలో రాష్ట్రంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ విషయంలో వీరు వరుసగా చేసిన పాపాల ఫలితం ఇప్పుడు ప్రజలు అనుభవించాల్సి వచ్చింది. కేవలం గృహ విద్యుత్ వినియోగదారులకే కాకుండా చిన్న తరహా పరిశ్రమలపై రూ.607 కోట్లు, పెద్ద పరిశ్రమలకు రూ.4,728 కోట్ల భారం పడుతుంది. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విద్యుత్ విధానం వల్ల ఈ మూడున్నరేళ్లలో ఇప్పటికే మూడున్నర లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారు. ఇప్పుడు మళ్లీ చార్జీలు పెంచితే పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుంది. చిన్న గ్రామపంచాయతీలు జనానికి కనీసం మంచినీళ్లు కూడా తాపివ్వలేవు.
ప్రస్తుతం రాష్ట్రంలోని డిస్కమ్‌లన్నీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. వేల కోట్ల లోటు బడ్జెట్‌తో నడుస్తున్నాయి. ప్రభుత్వమే డిస్కమ్‌లకు రూ.12 వేల కోట్లు బకాయి పడింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సంస్థలు నడవాలంటే రూ.49 వేల కోట్లు కావాలి. ఈ డబ్బులన్నీ ప్రజలు ప్రస్తుతం చెల్లిస్తున్న చార్జీలు, ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల ద్వారానే రావాలి. ఇచ్చే విద్యుత్ కోసం పెట్టే ఖర్చు, ప్రజల నుంచి వచ్చే చార్జీలతో సరిపోవాలని యూపీఏ ప్రభుత్వం కూడా తన విద్యుత్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గ నిర్దేశం చేసింది. ప్రతి ఏటా రేట్లు సవరించాలని కూడా సూచించింది. ఇక మన ముఖ్యముంత్రి కిరణ్ ఎంత కావాలంటే అంత అడగండని డిస్కమ్‌లకు, ఎంత కావాలంటే అంత పెంచుకోమని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే స్వయంగా జనం నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేయమనడంతో డిస్కమ్‌లు కూడా బరితెగించాయి. విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించిన బడ్జెట్ లోటును పూడ్చడానికి 41 శాతం చార్జీలు పెంచాలని రెగ్యులేటరీ కమిషన్‌ను డిస్కమ్‌లు కోరాయి. ఫలితంగా ప్రజల నెత్తిన పడడానికి రూ.12,723 కోట్ల గుదిబండ వేలాడుతోంది.
అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచి, సంస్కరణల పేరిట చార్జీలు పెంచేందుకే అన్నట్లు ఓ రెగ్యులేటరీ కమిషన్‌ను పుట్టించిన చంద్రబాబునాయుడు పాలననుంచే విద్యుత్ విధానం తప్పుదారి పట్టింది. విద్యుత్ సంస్థను మూడు ముక్కలు చేసి, రెగ్యులేటరీ కమిషన్‌కు సర్వ హక్కులు ధారవోసి, ధరలు విపరీతంగా పెరగడానికి కారణమయ్యాయి చంద్రబాబు విద్యుత్ విధానాలు. ప్రజలకు విద్యుత్ సరఫరా చేయాలనే ప్రాథమిక బాధ్యత నుంచి విద్యుత్ సంస్థలు చంద్రబాబు హయాంలోనే తప్పుకున్నాయి. పూర్తిస్థాయి వ్యాపార సంస్థలుగా మారిపోయాయి. లాభనష్టాల లెక్కలే తప్ప ప్రజల జీవనప్రమాణాలతో సంబంధం లేకుండా విద్యుత్ విధానం అమలయింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్‌లు కూడా ఇదే విధానం మరిచిపోకూడని విషయం. ఉత్పత్తికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మొత్తం విద్యుత్‌రంగాన్నే సర్వనాశనం చేసింది. ప్రతి ఏటా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచకపోవడమే ప్రధాన తప్పిదం. విద్యుత్ కావాల్సినప్పుడల్లా ప్రైవేటు కంపెనీల నుంచి, పొరుగురాష్ట్రాల నుంచి బహిరంగ మార్కెట్ నుంచి ఎక్కువ ధర చెల్లించి కరెంటు కొంటున్నారు. అంతే తప్ప రాష్ట్రంలోని వనరులను వాడుకోవాలనే సోయి లేదు.
వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో అపారమైన బొగ్గు నిక్షేపాలున్నాయి. అక్కడే విద్యుత్ ఉత్పత్తి పెంచే ప్రయత్నం లేదు. కొత్తగూడెం, రామగుండం, భూపాలపల్లిలో అదనంగా మరో 1600 మెగావాట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. కరీంగనర్ జిల్లా నేదుమూరులో కూడా 1600 మెగావాట్ల విద్యుత్ తయారుచేయవచ్చు. కానీ కడపలో బొగ్గుతో విద్యుత్ తయారుచేసే పరిశ్రమ నెలకొల్పారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో యూనిట్ ఉత్పత్తికి రూ.2.40 ఖర్చయితే, కడపలో విద్యుత్ ఉత్పత్తికి నాలుగు రూపాయలు ఖర్చవుతోంది. ఒక్క బొగ్గు పెళ్ళ కూడా దొరకని కడపకు వేలకోట్లు రవాణా చార్జీలు భరించి తెలంగాణ నుంచి బొగ్గు పంపుతున్నారు. విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్న తెలంగాణ ప్రాంతానికి కడప నుంచి విద్యుత్ తీసుకువస్తున్నారు. బొగ్గు రవాణాకు అయ్యే ఖర్చుతో పాటు ఆ ప్రాంతం నుంచి తెలంగాణకు విద్యుత్ తీసుకురావడానికి అయ్యే 18 శాతం డిస్ట్రిబ్యూషన్ లాస్ మరో నష్టం. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ వినియోగం 62 శాతం అయితే, ఉత్పత్తి 32 శాతమే. ఇక్కడే పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే రవాణాచార్జీలు, డిస్ట్రిబ్యూషన్ లాస్ ఉంటాయా? కేవలం కడప ప్రాంత నాయకుల స్వార్థంకోసం అక్కడ ఉపాధి అవకాశాలు పెంచడం కోసమే విద్యుత్ సంస్థలు ఈ నష్టాన్ని భరిస్తున్నాయి. ఇప్పుడా భారాన్ని ప్రజల నెత్తిన వేస్తున్నాయి.
బొగ్గు కొనుగోలుకు సంబంధించి కూడా అడ్డగోలు విధానం అమల్లో ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.3200లకు టన్ను బొగ్గు దొరుకుతుంది. కానీ మన విద్యుత్ సంస్థలు రూ.5200 లకు టన్ను చొప్పున బొగ్గు కొంటున్నాయి. ఒక్కో టన్నుకు రెండు వేలు ఎక్కువ పెడుతున్నారు. బొగ్గు కొనుగోలుకు సంబంధించి ఐదు కంపెనీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆ కంపెనీలన్నీ ప్రభుత్వం నడిపే పెద్దలు, రాజకీయ నాయకుల నీడలో ఉన్నాయి. కాబట్టి వాటికి లాభం చేకూర్చడానికి మాత్రమే ఎక్కువ ధర చెల్లించి బొగ్గు కొంటున్నాయి. ఇప్పటికీ టన్నుకు రూ.3200 చొప్పున బొగ్గుసరఫరా చేయ డానికి చాలామంది సిద్ధంగాఉన్నారు. విద్యుత్‌సంస్థలు ఎక్కువ ధర చెల్లించడం మాని ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవడానికి సిద్ధమేనా?
రాష్ట్రంలో థర్మల్, హైడల్ మాత్రమే కాకుండా గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో అవి నడుస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో నడిచే గ్యాస్ కంపెనీలకు యూనిట్‌కు రూ.2.80 చొప్పున చెల్లిస్తోంది విద్యుత్ శాఖ. కానీ ల్యాంకో, జీఎంఆర్ లాంటి ప్రైవేటు కంపెనీలకు మాత్రం యూనిట్‌కు రూ. 5.80 చెల్లిస్తోంది. అంటే ఒక్కో యూనిట్‌కు ప్రభుత్వం మూడు రూపాయలు అదనంగా చెల్లిస్తోంది. 2009 నుంచి 2012 చివరి వరకు ల్యాంకో, జీఎంఆర్‌లకు అదనంగా చెల్లించింది అక్షరాలా రూ.3215 కోట్లు. ఇందులో ల్యాంకోకు ఇచ్చిందే రెండువేల కోట్లు. ప్రభుత్వ భూమిలో, ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీతో, ప్రభుత్వం తెచ్చిన గ్యాస్‌తో నడుస్తున్న ప్రైవేటు గ్యాస్ కంపెనీలు ప్ర భుత్వానికి అధికధరకు విద్యుత్ అమ్ముకుంటున్నాయి. కానీ ప్రభుత్వరంగంలో నడిచే నేదుమూరు లాంటి గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు మాత్రం గ్యాస్ అందించడానికి ప్రయత్నాలు జరగవు.
మొత్తంగా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, కొనుగోళ్ల విధానంలో అనేక తప్పులు చేయబట్టే ఇవాళ విద్యుత్ సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయన్నది సుస్పష్టం. ప్రభుత్వం చేసిన ఉద్దేశపూర్వక తప్పుల వల్లే ఈ కష్టం వచ్చింది. కానీ చార్జీల పెంపు రూపంలో ప్రజలు శిక్ష అనుభవించాల్సి వస్తోంది. విద్యుత్ పంపిణీ, సరఫరా, చార్జీల లాంటి విషయాలన్నీ ప్రభుత్వం పట్టించుకోదు అని అధికారంలో ఉండే వారు చెప్పే మాట. వాస్తవానికి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వేసేది రాష్ట్ర ప్రభుత్వమే. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే అది నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వం మాత్రం రెగ్యులేటరీ కమిషన్‌దే సర్వాధికారమన్నట్లు నటిస్తోంది. అది చెప్పినట్లు వినక తప్పదని వాదిస్తోంది. కమిషన్ చెప్పినట్లు ప్రభుత్వం వినాలా? ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కమిషన్ నడుచుకోవాలా? కుక్క తోకను ఆడిస్తోందా? తోకే కుక్కను ఆడిస్తోందా?
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు చూస్తే ఈ రాష్ట్రంలో ఇక పేదవాడికి కరెంటు వాడుకునే అవకాశం లేనట్లే. కేవలం టీవీ పెట్టుకుని, ఫ్యాను, లైట్లు వేసుకుంటే చాలు ఏడొందలకు పైగా బిల్లు వస్తుంది. ఒక టీవీ పదిగంటలు పెట్టుకుంటే రోజుకు రెండు యూనిట్ల చొప్పున నెలకు 60 యూనిట్లు ఖర్చవుతాయి. రెండు ఫ్యాన్లు పదిగంటల చొప్పున తిరిగితే రోజుకు 12 యూనిట్ల చొప్పున నెలకు 36 యూనిట్లు అవుతుంది. ఒక్క లైటు ఐదు గంటల చొప్పున వెలిగితే రోజుకు పావు యూనిట్. నాలుగు లైట్లుంటే ఒక యూనిట్. అంటే బుగ్గ వెలిగితే నెలకు 30 యూనిట్లు. మొత్తం కలిస్తే 126 యూనిట్లు. సెల్‌ఫోన్ చార్జింగు, బెడ్‌లైటు, దేవుడి దగ్గర ఓ జీరో బల్బు పెట్టుకుంటే మరో నాలుగు యూనిట్లు అవుతాయి. పెంచనున్న చార్జీల ప్రకారం వంద యూనిట్లు దాటితే ఒక్కో యూనిట్‌కు రూ. 5.65 చార్జీ పడుతుంది. 130 యూనిట్లకు రూ.734 బిల్లు ఇంటికి చేరుతుంది. ఇక మధ్య తరగతి వారు వాడుకునే ఫ్రిజ్, నీళ్ల మోటారు, ఇస్త్రీ పెట్టె, వాటర్ హీటర్ ఉంటే నెలకు 300 యూనిట్లు దాటుతుంది. అప్పుడు యూనిట్ రూ.7.25 పడుతుంది.
301 యూనిట్లు కాల్చినా బిల్లు రెండువేలు దాటుతుంది. మన రాష్ట్రంలో ఉపాధిహామీకిచ్చే కూలీనే సగటు కూలీగా తీసుకుంటే రోజుకు రూ.125. అంటే నెలకు రూ.3600. అందులో రూ.750 వరకు కరెంటు బిల్లే కడితే గ్యాస్, బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనె, పిల్లల చదువు, వైద్యం, బట్టలు, రవాణా చార్జీలు, సబ్బులు, పండుగలు, ప్రభోజనాలు, పెండ్లిండ్లు, చావులు ఎట్ల ఎల్లాలె? నలుగురు సభ్యులున్న కుటుంబం రూ.2850తో నెలంతా బతకగలదా? విద్యుత్ చార్జీల వసూలుకు సంబంధించి దేశంలో టెలిస్కోపిక్, నాన్ టెలిస్కోపిక్ విధానాలు అమల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో నాన్ టెలిస్కోపిక్ విధానం అమల్లో ఉంది. ఇది ఒక్క రూపాయి వడ్డీ ప్రకటించి, కనిపించకుండా నాలుగైదు రూపాయల వడ్డీ గుంజే వడ్డీ వ్యాపారుల మాదిరి గందరగోళమే. మన రాష్ట్రంలో కూడా ఇంతకు ముందు టెలిస్కోపిక్ విధానం అమల్లో ఉంది. దానిప్రకారం బిల్లును స్లాబ్‌ల వారీగా లెక్కిస్తారు.
100 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.2.60 మాత్రమే పడుతుంది. ఒకవేళ వంద యూనిట్లుదాటినా పరిమితికి మించి ఎంత ఎక్కువ కాలిస్తే దానికి మాత్రమే తర్వాత శ్లాబ్ రేటు వర్తిస్తుంది. 100-300 వరకు రూ.5.25 చార్జీ వసూలు చేస్తారు. అంటే 150 యూనిట్లు కాల్చితే వంద యూనిట్ల వరకు రూ.2.60 చొప్పున రూ.260, ఆ పై 50 యూనిట్లకు రూ.5.25 చొప్పున రూ.262 చెల్లించాలి. అంటే మొత్తం బిల్లు రూ.522. కానీ నాన్ టెలిస్కోపిక్ విధానం అలా కాదు. వంద యూనిట్లు దాటితే చాలు మొత్తం వాడిన యూనిట్లన్నింటికీ చివరి శ్లాబ్ రేటు ప్రకారం బిల్లు చెల్లించాలి. అంటే టెలిస్కోపిక్ విధానంలో రూ.522 బిల్లు వస్తే అంతే కరెంటు వాడినందుకు నాన్ టెలిస్కోపిక్ విధానంలో రూ.787 బిల్లు వస్తుంది. అంటే నెలకు రూ.262 మనకు తెలియకుండానే జేబుకు చిల్లు పడుతుంది.
విద్యుత్ సంస్థలను నడపడంలో ప్రభుత్వానికి నిజాయితీ లోపించింది. చార్జీల వడ్డనలో మానవత్వం కరువయింది. ఎంతసేపూ ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు దోచిపెట్టాలనే యావ తప్ప, ప్రభుత్వరంగ సంస్థల్ని బలోపేతం చేసి తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అయ్యే ప్రత్యామ్నాయాలను పట్టించుకోవట్లేదు. థర్మల్, గ్యాస్, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, కొనుగోళ్లకు సంబంధించి నీతి నిజాయితీలతో శాస్త్రీయంగా వ్యవహరిస్తే ఇప్పుడు ప్రజలపై భారం వేయాల్సిన అవసరం రాదు. ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం తోచకపోతే అఖిలపక్ష సమావేశం నిర్వహించి సలహాలు తీసుకోవాలి. నిపుణులతో సమీక్షించి చర్యలు చేపట్టాలి.
పొరుగు రాష్ట్రాల కెళ్ళి తెలుసుకోవాలి. తమిళనాడు, కేరళ, కర్ణాటకలతోపోలిస్తే బొగ్గు, నీళ్లు, గ్యాస్ మనకే ఎక్కువున్నాయి. కానీ కరెంట్ చార్జీలు మాత్రం వాళ్లకు తక్కువున్నాయి. నిజాయితీ, పారదర్శకత లేకపోవడమే ఇం దుకు కారణం కాదా? ఎంత హింసించినా ప్రజలు తిరగబడరు. తిరగబడ్డా కాల్చిపారేయొచ్చు అనే అమానవీయ కోణం ప్రభుత్వానిది కాదా? ఎంతకాలం ఇలా సామాన్యజనాన్ని శిక్షిస్తారు? తప్పుచేసేది పాలకులు, పాపఫలం ప్రజలకా? ఇదేం న్యాయం? ప్రజల సహనాన్ని పరీక్షించకండి. విద్యుత్ చార్జీల పెంపు యోచన మానుకోండి.
(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)