టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్తులపై విచారణకు తాము సిద్ధమని, కేసీఆర్ సొంతగ్రామం చింతమడకలోని కేసీఆర్ ఇల్లు బడిగా మారిందని, పొన్నాల సొంతగ్రామం ఖిలాషాపురంలోని ఆయన ఇల్లు గడీగా మారిందని, బహిరంగవిచారణకు తాను సవాల్ విసిరితే పొన్నాల నుంచి స్పందన లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పదేళ్ళు అధికారంలో ఉండి ఎందుకు విచారణ చేపట్టలేదు? ఆ విచారణేదో ఇప్పుడు జరిపించండి. కేంద్రంలో మీకు అధికారం ఉంది. రాష్ట్రంలో గవర్నర్ ఉన్నారు. మేము కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోం. కేసీఆర్ లో అవినీతి ఇప్పుడే కనిపించిందా? ఆయన వస్తే దొరలపాలన వస్తుందనేవాళ్ళు మమ్మల్నెందుకు విలీనం, పొత్తు గురించి అడిగారు? విలీనం, పొత్తు కుదరకపోతే మేము అవినీతిపరులమా? ఇదేనా మీ నీతి?’ అని హరీష్ రావు ప్రశ్నించారు.
కేసీఆర్ ఉద్యమంలో లేరంటున్నారు. అసలు కాంగ్రెస్ నాయకులకు ఉద్యమం అంటే అర్థం తెలుసా? ఉద్యమం చేసిందెవరో, అమెరికా పారిపోయిందెవరో ప్రజలకు తెలుసని, కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని చెప్తూ పార్లమెంటులోనే రాజీనామా చేసిన వ్యక్తి కేసీఆర్ అని, పార్లమెంటుకు వెళ్లకపోయినా కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఉన్నారని పేర్కొన్నారు. సకలజనుల సమ్మెలో కేసులు పెట్టించింది కాంగ్రెస్ నేతలేనని, మిలియన్ మార్చ్ కు అనుమతి కూడా ఇవ్వలేదని, విద్యార్థులను అరెస్టు చేసి జైళ్లలో పెట్టించారని మండిపడ్డారు. కేసీఆర్ 11రోజులు దీక్ష చేసి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి తెలంగాణ ప్రకటన సాధించారని, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ద్రోహం చేస్తూ 23న మరో ప్రకటన చేసిందని గుర్తుచేశారు. పిల్లలు చనిపోతున్నారని కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీ చస్తుందనే భయంతోనే ఎన్నికలముందు తెలంగాణ ఇవ్వాల్సి వచ్చిందన్నారు.
తెలంగాణలో టీడీపీకి అడ్రస్ లేదని, ఇక్కడ 10స్థానాల్లో అయినా డిపాజిట్లు వస్తాయని చూపించగలరా? అని ప్రశ్నించారు. సీమాంధ్రలో ఆలీబాబా 40దొంగలని వైఎస్ కాబినెట్ ను విమర్శించిన చంద్రబాబు అందులోని 20 మంది దొంగలను టీడీపీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. ఎర్రగడ్డ ఆస్పత్రిలో చంద్రబాబు కోసం స్పెషల్ రూమ్ ఏర్పాటు చేస్తామని, అయినా తెలంగాణలో చంద్రబాబుకేం పని అని, తెలంగాణలో టీడీపీకి నాయకులు లేరా? అని అన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ సమావేశంలో శంషాబాద్, ఎల్బీ నగర్ కు చెందిన పలువురు నేతలు హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.