mt_logo

మంత్రి కేటీఆర్ చొరవతో ‘పీజీ స్వీపర్’ రజనికి ఉద్యోగం

గత్యంతరం లేని పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నఎమ్మెస్సీ చదివిన రజనికి అర్హతకు తగిన ఉద్యోగం ఇవ్వాలని మంత్రి కేటీఆర్ మున్సిపల్‌ శాఖను ఆదేశించారు. ఆదేశాలు అందగానే ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ ఎంటమాలజిస్ట్‌గా నియమిస్తూ సోమవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఇందుకుగాను రజని ప్రగతిభవన్‌లో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

వరంగల్ కు చెందిన రజని ఎమ్మెస్సీ ఫస్ట్ క్లాసులో పాసై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ అర్హత సాధించింది. తర్వాత కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు చెందిన ఓ లాయర్ తో వివాహం చేశారు. ఇద్దరు పిల్లలు పుట్టి సంతోషంగా గడుపుతున్న తరుణంలో భర్తకు గుండెజబ్బు రావడం.. ఏకంగా మూడుసార్లు స్టెంట్లు వేయాల్సి రావడంతో కుటుంబ భారం మొత్తం రజనిపై పడింది. అప్పుడే కరోనా లాక్ డౌన్ కూడా రావడంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఉద్యోగ ప్రయత్నాలు చేసినా అవేవి కలిసిరాలేదు. కొన్నిసార్లు వారసంతల్లో కూరగాయలు కూడా అమ్మింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నెలకు పదివేల జీతానికి జీహెచ్‌ఎంసీలో స్వీపర్ ఉద్యోగంలో చేరింది. రజని దీనగాథను మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఆమె నిస్సహాయ స్థితికి చలించి వెంటనే తన విద్యార్హతలకు అనుగుణంగా జీహెచ్‌ఎంసీలో అసిస్టెంట్ ఎంటమాలజిస్టుగా ఉద్యోగం ఇప్పించారు. ప్రగతిభవన్ లో కేటీఆర్ ను కలిసి తనకు ఉద్యోగం ఇచ్చి తన కుటుంబాన్ని ఆదుకున్న మంత్రి కేటీఆర్ గారికి, అన్నివేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ కన్నీటిపర్యంతం అయింది. రజనితో మాట్లాడిన అనంతరం ” రోజంతా తీరిక లేకుండా గడుపుతున్న తనకు ఇవి అత్యుత్తమ క్షణాలు” అని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. అలాగే నగరంలోని మరికొంత మంది దాతలు కూడా ఇతర తోడ్పాటు అందిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *