తెలంగాణ టీడీపీ ఎంపీలే అసలైన తెలంగాణ ద్రోహులని పొన్నం ప్రభాకర్ వారిపై మండిపడ్డారు. లోక్ సభలో వారు ప్రవర్తించిన తీరును చూస్తే వారి నిజస్వరూపం బయటపడుతుందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు చంద్రబాబు, ఇతర టీటీడీపీ సభ్యుల వైఖరిని గమనించాలని స్పష్టం చేశారు. లోక్ పాల్ బిల్లును సమైక్యవాదం ముసుగులో అడ్డుకోవడానికి వారు చేసిన ప్రయత్నాలను పొన్నం ఎండగట్టారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు టీ ఎంపీలు పాల్గొని మాట్లాడారు.
సీమాంధ్ర నేతలు ఎన్ని కుట్రలు చేసి తెలంగాణకు అడ్డుపడినా 2014లో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేస్తుందని పొన్నం వ్యాఖ్యానించారు. బలహీనుడిని అణచివేసి పరిపాలించడమే బలవంతుడి ప్రజాస్వామ్య పరిరక్షణా? అని సీమాంధ్ర ఎంపీలను ప్రశ్నించారు. మీతో కలిసుండలేమని తెలంగాణా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనిపించట్లేదా? సమైక్యవాదం ముసుగులో తెలంగాణను అడ్డుకోవడం ప్రజాస్వామ్య పరిరక్షణా? అని అన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రోజూ ఒకరినొకరు తిట్టుకుంటున్న టీడీపీ, వైఎస్సార్సీపీ సభ్యులు తెలంగాణను అడ్డుకోవడానికి మాత్రం ఒక్కరవుతున్నారన్నారు.
కేంద్ర మంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ చంద్రబాబు తెలంగాణను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నాడని, టీడీపీని తెలంగాణ నుండి తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఎంపీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ లోక్ సభలో టీడీపీ ఎంపీల ప్రవర్తన తెలుగుజాతి పరువు గంగలో కలిపినట్లుగా ఉందన్నారు.