mt_logo

పొంచిఉన్న వలసాధిపత్యం

By శ్రీధర్ రావు దేశ్‌పాండే
(వ్యాసకర్త: సాగునీటి మంత్రి ఓఎస్డీ)

భూ సేకరణ చట్టం ప్రకారం చెయ్యమంటారు, చట్టం ప్రకారం చేస్తే అటవీ, పర్యావరణ అనుమతుల్లేకుండా ప్రాజెక్టు పనులు ఎట్లా మొదలుపెడుతారని వాదిస్తా రు, అనుమతులన్నీ సాధిస్తే వచ్చిన అనుమతులు రద్దు చెయ్యమని కోర్టుకెక్కుతారు, కాళేశ్వరంలో భారీ ఇంజినీరింగ్ తప్పిదం జరిగిందంటారు. ఏదేమైనా సాగునీటి రంగంలో ఈ అభివృద్ధి క్రమాన్ని ఆపేయ్యాలన్నదే వీరి లక్ష్యంగా భావించవలసి వస్తున్నది.

తెలంగాణ ప్రజలు ఈ నాలుగేండ్లలో ఆంధ్రా వలసవాద పార్టీలను పొలిమేరలు దాటించినారు. కానీ వారి దళారీవర్గాలు బలహీనపడినాయే తప్ప పూర్తిగా అంతం కాలేదు. వలసాధిపత్యం అదనుకోసం వేచిచూస్తున్నది. తెలంగాణలో అధికారం కోసం అర్రులు చాస్తున్న వర్గాలు, పార్టీలతో ఎన్నికల పొత్తుల రూపంలో తెలంగాణలో చొరబడటానికి ప్రయత్నాలు ముమ్మరం అయినాయి. తెలంగాణ ప్రజానీకం ఈ ఎన్నికల సందర్భంగా అప్రమత్తంగా ఉండకపోతే పొలిమేరలు దాటిన వలసవాదం తిరిగి తెలంగాణలో చొరబడుతుంది. బలహీనపడిన వలసవాద పార్టీల దళారీ వర్గాలు బలం పుంజుకుంటాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టులను ఆపివేయించమని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి, కృష్ణాబోర్డు, గోదావరి బోర్డుకు లెక్కలేనన్ని లేఖలు రాశారు. రాస్తూనే ఉన్నారు. చంద్రబాబు స్వయంగా ప్రధానికి, కేంద్ర జలవనరుల మంత్రికి అరడజను లేఖలు రాశాడు. ముఖ్య కార్యదర్శి స్థాయిలో రాసినవి అనేకం. పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు కొత్త ప్రాజెక్టులని, విభజన చట్టం ప్రకారం ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు పొందకుండానే చేపట్టిన ఈ ప్రాజెక్టుల పనులు జరుగకుండా చూడాలని కోరారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, ముదిగొండ కరువు మండలాల్లో 60 వేల ఎకరాలకు సాగునీరు అందించే భక్త రామదాసు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే నిర్మించిందని ఆరోపించింది.

రాజోలిబండ డైవర్షన్ స్కీం చివరి భూములకు గత ముప్ఫై ఏండ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా నీరందలేదు. నిర్దేశిత 87,500 ఎకరాల ఆయకట్టులో ఏనాడు 30 వేల ఎకరాలకు మించి నీరందలేదు. ప్రాజెక్టుకు కేటాయించిన 15.90 టీఎంసీల్లో సగటున 6 టీఎంసీలకు మించి నీటి సరఫరా జరుగలేదు. రాజోలిబండ పథకం చివరి భూములకు నీరందించడానికి, తుంగభద్ర జలాల్లో మన వాటా 15.90 టీఎంసీల నీటిని సంపూర్ణంగా వినియోగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకాన్ని అమలు చేయడానికి సంకల్పించింది. ఈ ప్రాజెక్టు వల్ల కేసీ కెనాల్ ప్రయోజనాలు దెబ్బతింటాయని, ప్రాజెక్టు పనులను ఆపివేయించడానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి గత ప్రభుత్వం కేటాయించి నీరు 25 టీఎంసీలు. ఇవి సరిపోవని భావించి తెలంగాణ ప్రభుత్వం నీటి కేటాయింపులను 40 టీఎంసీలకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ పెంపును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది ఆంధ్ర ప్రభుత్వం. ఆంధ్ర లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్‌చే కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై ప్రశ్న అడిగించడం ఒక పరాకాష్టగా భావించాలి. కృష్ణాబోర్డు పరిధిని వెంటనే నోటిఫై చేయాలని కేంద్రాన్ని ఒత్తిడి చేసింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా ప్రాజెక్టులవారీగా జరిపిన తర్వాతనే కృష్ణాబోర్డు పరిధిని నోటిఫై చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని అక్రమంగా తరలించుకుపోయిన వైనాన్ని సాక్షాధారాలతో తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు నివేదించింది. తక్షణమే టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చెయ్యాలని కోరింది.

ఆ పరికరాలను ఏర్పాటుచేసిన తర్వాత పోతిరెడ్డిపాడు నీటి చౌర్యం కట్టడి అయ్యింది. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్‌కు 80 టీఎంసీల నీటిని తరలించే వెసులుబాటు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నది. అయితే ప్రాజెక్టు మంజూరైన రోజు నుంచే ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకు కృష్ణా బేసిన్‌లో 35 టీఎంసీల నీటిని వినియోగించటానికి హక్కు ఏర్పడుతుంది. అట్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాగార్జునసాగర్ ఎగువన 45 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. రాష్ట్ర విభజన తర్వాత నాగార్జున సాగర్ ఎగువన ఉన్నది తెలంగాణ రాష్ట్రమే కనుక ఈ 45 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే, ఈ అంశాన్ని పరిశీలించటానికి కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ మాజీ చైర్మన్ బజాజ్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీని పని చెయ్యకుండా చేసింది. ఆంధ్ర ప్రభుత్వం చేసిన కిరికిరి వల్ల ఆఖరికి కమిటీ ఎటువంటి నివేదిక సమర్పించకుండానే అంతమయ్యింది. కృష్ణా బేసిన్లో 45 టీఎంసీల నీటిని వాడుకునే అంశంలో తెలంగాణ పోరాటం కొనసాగుతూనే ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులను నిర్మిస్తున్నదని ఆరోపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా పట్టిసీమ, పురుషోత్తపట్నం, ముచుమర్రి, మున్నేరు, శివభాశ్యం, గుండ్రేవుల, గాజులదిన్నె తదితర ఎత్తిపోతల పథకాలను ప్రారంభించలేదా? వీటిలో పట్టిసీమ, ముచుమర్రి ఎత్తిపోతల పథకాలు పూర్తయినాయి కూడా. గతేడాది పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 100 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసి ప్రకాశం బ్యారేజీకి తరలించిన సంగతిని ఆంధ్ర ప్రభుత్వమే లెక్కలు చెప్పింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఇన్ని ప్రాజెక్టులను నిర్మిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులను మాత్రం ఆపమని కేంద్ర ప్రభుత్వానికి, కృష్ణా, గోదావరి బోర్డులకు శికాయతులు చేస్తున్నది ఆంధ్ర ప్రభుత్వం.

ఇది వలసాధిపత్యానికి ప్రభలమైన సూచిక. నిజానికి గోదావరి కృష్ణా నదులపై తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను ప్రారంభించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టులనే అమలుచేస్తున్నది. ఈ సంగతిని 2016 సెప్టెంబర్ 19న ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, సాగునీటి మంత్రి హరీశ్‌రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి సాక్షాధారాలతో వివరించారు. ఇవి అపెక్స్ కౌన్సిల్ పరిధిలోకి రావని వాదించారు. ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం వీటిని కొత్త ప్రాజెక్టులని ఆరోపిస్తున్నది. విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ అనుమతి అవసరమంటున్నది. తను మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో జాడ, పత్తా లేని కొత్త ప్రాజెక్టులను అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే బిందాస్‌గా నిర్మిస్తున్నది. ఇక గోదావరి బేసిన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కొత్తది కాదు. ఉమ్మడి ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టునే తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీ ఇంజినీరింగ్ చేసుకొని పనులను కొనసాగిస్తున్నది ప్రభుత్వం. ఈ ఆన్ గోయింగ్ ప్రాజెక్టుకు కూడా అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలట. ఒకవైపు ఏటా 3 వేల టీఎంసీల గోదావరి నీరు సముద్రం పాలవుతున్నది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు తమ కేటాయింపులను సంపూర్ణంగా వాడుకున్న తర్వాత కూడా ఇంకా 2 వేల టీఎంసీలు సముద్రం లో కలిసిపోతాయి. గోదావరిపై కేటాయింపుల వివాదాల్లేవు, ఉమ్మడి ప్రాజెక్టులు లేవు. ఎవరి వాటాను వారు వాడుకునే హక్కు, వెసులుబాటు ఉన్నది. అయినా కూడా తెలంగాణ ప్రాజెక్టులపై శికాయతుల పర్వం కొనసాగుతూనే ఉన్నది. ఉమ్మడి ప్రభుత్వం గోదావరి జలాల్లో 954 టీఎంసీల నీటిని కేటాయించింది.

ఇందులో తెలంగాణ ప్రాజెక్టుల ద్వారా 400 నుంచి 450 టీఎంసీల దాకా వాడుకుంటున్నది. మిగితా నీటిని వాడుకునేందుకు కాళేశ్వరం, సీతారామ, చనాఖా కొరాటా, దేవాదులకు జలాశయాన్ని ఇచ్చే తుపాకులగూడెం తదితర ప్రాజెక్టులను చేపట్టింది. తెలంగాణలో 18 లక్షల ఎకరాలకు సాగునీరు, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ ప్రాజెక్టుల కింద ఉన్న మరో 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, దారిపొడుగునా వందలాది గ్రామాలకు, హైదరాబాద్ నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరందించే బృహత్తర పథకం కాళేశ్వరం ప్రాజెక్టు. ఇది తెలంగాణకు జీవధార కాబోతున్నది. ఇదేవిధంగా కరువుకు, వలసలకు మారుపేరు అయిన మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, ఉమ్మడి రాష్ట్రంలో ఎటువంటి సాగునీటి సౌకర్యం పొందని రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లాలో 30 వేల ఎకరాలకు సాగునీరు, దారిపొడుగునా వెయ్యికిపైగా గ్రామాలకు తాగునీరు అందించే పథకం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. నల్లగొండ జిల్లాలో అత్యధిక ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలైన దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, దారిపొడుగూతా గ్రామాలకు తాగునీరు అందించే పథకం డిండి ఎత్తిపోతల పథకం. ఈ రెండు ప్రాజెక్టులు కృష్ణా బేసిన్‌లో ఉన్న మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు జీవధారగా మారబోతునాయి. ఇలాంటి జీవధారలను తెగ్గొట్టడానికి ఆంధ్ర ప్రభుత్వం పడరాని పాట్లు పడుతున్నది. ఈ ప్రయత్నాలకు తోడుగా అగ్నికి ఆజ్యం పోసినట్టు తెలంగాణ బిడ్డలే హైకోర్టులో, సుప్రీంకోర్టులో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి ఈ ప్రాజెక్టులను ఆపడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మేధావులు అనబడే పెద్దలు కూడా ఆంధ్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రల పట్ల పల్లెత్తు మాట అనకుండా మౌనం వహించడం ఒక ఎత్తయితే ఈ ప్రాజెక్టులపై అనేక దుష్ప్రచారాలను చేయడం మరొక ఎత్తు.

బీసీ రేషియో లేదంటారు. ఎకరా ఖర్చు ఎక్కువంటారు, కరెంట్ ఖర్చు ఎక్కువంటారు, పెద్ద జలాశయాలతో భూకంపాలు వస్తాయని ప్రచారం చేస్తారు, ఇంతపెద్ద జలాశయాలు ఎందుకంటారు, భూసేకరణ చట్టం ప్రకారం చెయ్యమంటారు, చట్టం ప్రకారం చేస్తే అటవీ, పర్యావరణ అనుమతుల్లేకుండా ప్రాజెక్టు పనులు ఎట్లా మొదలుపెడుతారని వాదిస్తారు, అనుమతులన్నీ సాధిస్తే వచ్చిన అనుమతులు రద్దు చెయ్యమని కోర్టుకెక్కుతారు, కాళేశ్వరంలో భారీ ఇంజినీరింగ్ తప్పిదం జరిగిందంటారు. ఏదే మైనా సాగునీటి రంగంలో ఈ అభివృద్ధి క్రమాన్ని ఆపేయ్యాలన్నదే వీరి లక్ష్యంగా భావించవలసి వస్తున్నది. ఒకవైపు ఆంధ్ర ప్రభుత్వ వలసాధిపత్య కుట్రలు, రెండోవైపు అంతర్గత ప్రతీఘాతక శక్తుల కుట్రలు. వీటి పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండక తప్పదు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *