mt_logo

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులను ఏసీబీ కోర్ట్ కస్టడీకి అనుమతించగా, హైదరాబాద్‌ చంచల్‌గూడ జైలులో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మొదట గురువారం ఉదయం చంచల్‌గూడ జైలుకు చేరుకున్న మొయినాబాద్‌ పోలీసులు.. నిందితులు నందకుమార్‌, రామచంద్రభారతి, సింహయాజి స్వామీలను తమ కస్టడీలోకి తీసుకున్నారు. తర్వాత వారిని రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. ఈ బృందం నిందితుల నుండి లభ్యమైన నకిలీ ఆధార్, పాన్‌కార్డులు, వంద కోట్లపై ఆరాతీయనున్నారు. 

ఎమ్మెల్యేల ఎర కేసును తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ స్థానిక కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పిటిషన్లు వేసి సీబీఐకి అప్పగించాలని కోరుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం.. ఈ కుట్రను పూర్తిగా బద్దలు కొట్టేందుకు సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వాలను పడగొట్టాలనే లక్ష్యంతో బీజేపీ తరపున రాయబారులుగా వచ్చిన ముగ్గురు బ్రోకర్లను హైదరాబాద్‌ పోలీసులు సాక్ష్యాధారాలతో పట్టుకోవడం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 

ఎమ్మెల్యేలకు ఎర కేసు అత్యంత సున్నితమైనది కావడం, సంచలనాత్మకంగా మారడంతో ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉండటుందని, అనుభవజ్ఞులైన అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డీజీపీ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొన్న సర్కారు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేసింది. ఆయనతోపాటు నేరాల దర్యాప్తులో అపార అనుభవం, నూతన సాంకేతికతను ఉపయోగించుకోవడంలో నైపుణ్యం ఉన్న ఉన్నతాధికారులను ఈ బృందంలో సభ్యులుగా నియమించింది. నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్‌ డీసీపీ కల్మేశ్వర్‌ సింగన్వర్‌, శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాధర్‌, మొయినాబాద్‌ ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డి ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *