mt_logo

వివాదాస్పద పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు లోక్ సభ ఆమోదం

వివాదాస్పద పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేసినా మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదించబడింది. ఏకపక్షంగా బిల్లును ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమని, స్టాప్ పోలవరం, జై తెలంగాణ అంటూ టీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలుపగా వారికి మద్దతుగా ఒడిశా, ఛత్తీస్ గడ్ ఎంపీలు ఆందోళనకు దిగారు.

బిల్లు ఆమోదంతో తెలంగాణకు చెందిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు, కొన్ని గ్రామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం అయ్యాయి. 3,267 హెక్టార్ల అటవీ ప్రాంతం, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు, చింతూరు, కూనవరం, పీలేరుపాడు, వీఆర్ పురంలోని 211 గ్రామాలు ఆంధ్రాలో విలీనం కానున్నాయి. భద్రాచలం పట్టణం మినహా ఇతర ప్రాంతాలు ఏపీలో కలవనున్నాయి. 34వేల కుటుంబాల్లోని 1,67,796 మంది గిరిజనులు ముంపుకు గురికానున్నారు.

ఇదిలాఉండగా పోలవరం ఆర్డినెన్స్ బిల్లును లోక్ సభలో ఆమోదించడాన్ని నిరసిస్తూ అఖిల పక్షం రేపు ఖమ్మం జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. గిరిజనులకు తీవ్ర అన్యాయం చేశారని న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా ప్రజలకు బీజేపీ ద్రోహం చేసిందని, వనరులు కాజేసేందుకే ముంపు మండలాలను ఆంధ్రాలో కలుపుకున్నారని, దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

పోలవరం ఆర్డినెన్స్ విషయంలో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నడుస్తున్నది మోడీ సర్కారా? లేక చంద్రబాబు సర్కారా? అని అనుమానం కలుగుతోందని విమర్శించారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పోలవరం ఆర్డినెన్స్ బిల్లును లోక్ సభ ఆమోదించాడాన్ని నిరసిస్తూ దీనిపై న్యాయపోరాటం చేస్తామని, కేంద్రం తీరు అప్రజాస్వామికమని తప్పుపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *