mt_logo

జలసౌధలో ఘనంగా తెలంగాణ ఇంజినీర్స్ డే వేడుకలు

ఇంజినీర్స్ డే సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజినీర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రఖ్యాత ఇంజినీర్ నవాబ్ అలీ జంగ్ పుట్టినరోజును ఇంజినీర్స్ డేగా జరుపుకోవడం మన సాంప్రదాయమని, తెలంగాణను బంగారుబాటలో నడిపించడానికి కృషి చేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన నవాబ్ అలీ లాంటి ఇంజినీర్లు ఆనాడు హైదరాబాద్ నగరాన్ని నిర్మించారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ఇంజినీర్లు బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ఇంజినీర్స్ డే వేడుకలను ఎర్రమంజిల్ లోని జలసౌధలో ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీష్ రావు నవాబ్ అలీ జంగ్ బహదూర్ 132వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. నవాబ్ అలీ జంగ్ హైదరాబాద్ లో ఎన్నో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, నిజాంసాగర్, వైరా, డిండి, కడెం, పోచంపాడు, పోచారం ప్రాజెక్టు, నాగార్జునసాగర్ తదితర ప్రాజెక్టులకు, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనం, ఉస్మానియా ఆస్పత్రి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, జూబ్లీహాల్ ల రూపకర్త.

ఇకనుంచి ప్రతీ సంవత్సరం జూలై 11న తెలంగాణ ఇంజిజీర్స్ డే గా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధిలో ఇంజినీర్స్ అంతా కలిసి రావాలని, దేశంలో ఏ రాష్ట్రంలో నిర్వహించని విధంగా మన ప్రభుత్వం మొదటిసారి ఇంజినీర్స్ డేను నిర్వహిస్తుందని అన్నారు. నవాబ్ జంగ్ వందేళ్ళ క్రితమే ఎంతో ముందుచూపుతో ప్రాజెక్టులను నిర్మించారని, ఆయన తెలంగాణకు చేసిన మేలు మరవలేనిదని కొనియాడారు.

తెలంగాణ ఇంజినీర్లు తెలంగాణాలోనే ఉంటారని, అర్హతలను బట్టి ఇంజినీర్లందరికీ ప్రమోషన్లు వచ్చేలా చూస్తామని, మన ప్రాజెక్టుల శిలాఫలకాలపై ఇంజినీర్ల పేర్లు పెడతామని, ఇంజినీర్ల భవనానికి 500 గజాల స్థలంతో పాటు 50లక్షల నిధులు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావును మంత్రి హరీష్ రావు సన్మానించగా, హరీష్ రావును ఇంజినీర్లు సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *