పరిహారం చూపించి పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలను నిలువునా ముంచాలనుకోవడం మానవత్వం, ప్రజాస్వామ్యం అనిపించుకోదని, ముంపు గ్రామాలను ఆంధ్రలో కలపడానికి అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారని టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేకే, ఈటెల రాజేందర్, మాజీ ఐఏఎస్ అధికారి రామచంద్రుడు, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ ముంపు మండలాలను ఆంధ్రలో కలపడం టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందని, ఖచ్చితంగా ఆ ఏడు మండలాలు తెలంగాణలోనే ఉంటాయని స్పష్టం చేశారు.
బిల్లులో పేర్కొన్న గ్రామాలనే కాకుండా కొత్త గ్రామాలను కూడా కలిపే కుట్ర చేస్తున్నారని, కేంద్రం ఇష్టం వచ్చినట్లుగా బిల్లు తయారు చేసిందని విమర్శించారు. అధికారులు ఈ విషయంలో ఓపికతో ఉండాలని, ఆర్డినెన్స్ తెస్తే రాజ్యాంగ సవరణ చేసినట్లు కాదని పేర్కొన్నారు. మరో నేత సీతారాం నాయక్ మాట్లాడుతూ మొత్తం భద్రాచలాన్ని ఆంధ్రప్రదేశ్ లో కలిపే కుట్ర చేస్తున్నారని, గిరిజనులను ముంచుతూ కట్టే ప్రాజెక్టు వద్దని, పోలవరం డిజైన్ మార్చితే నష్టం కొంతవరకు తగ్గించవచ్చని సూచించారు.