mt_logo

ఘన చరిత్రను కాపాడుకుందాం

హైదరాబాద్ నగరం నడిబొడ్డున చరిత్రాత్మకమైన నౌబత్ పహాడ్ మీద బిర్లా మందిర్ పక్కనే, బిర్లా సైన్స్ మ్యూజియం పైభాగాన రాకాసి బల్లిని నిలబెట్టిన డైనోజారియం ఉన్నది. కానీ సీమాంధ్ర పాలకులు దీనికి అంతగా ప్రచారం ఇవ్వలేదు. ఆదిలాబాద్ జిల్లాలోని యామన్‌పల్లిలో దొరికిన ప్రపంచంలోనే అరుదైన రాకాసి బల్లి శిలాజమిది. కోట్లాది ఏండ్ల కిందట జురాసిక్ యుగంలోని మొదటి తరం రాకాసి బల్లులు నివసించిన ప్రాంతం తెలంగాణ. ఈ కాలపు రాకాసి బల్లి శిలాజం ప్రపంచంలో ఇదొక్కటే. తెలంగాణ ఒడిలో గోదావరి ఒడ్డున ఆటాడుకున్న రాకాసి బల్లి పిల్లల అస్థిపంజరాలు కూడా దొరికినయి. ఇదొక్కటే కాదు, చరిత్ర పూర్వ యుగం నుంచి- రాతి యుగమైనా, రాత యుగమైనా- అనేకానేక ఘట్టాలకు, మానవ నాగరికతా దశలకు ఆటపట్టు తెలంగాణ గడ్డ. విన్నకొద్దీ రోమాలు నిక్కబొడుచుకునే తెలంగాణ పురాతత్వ సంపదకు, ఘన చరిత్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వలస పాలకుల కుట్ర.

పురాతత్వ తవ్వకాలు సాగించడం, మన వారసత్వ సంపదను పరిరక్షించడంలో, సాంస్కతిక రంగ ప్రాధాన్యాన్ని గుర్తించడంలో, కళాఖండాలను సేకరించి భద్రపర్చడంలో నిజాం కాలంలో జరిగిన కృషి 1956 తరువాత వలస పాలనలో సాగలేదనే విమర్శ ఉన్నది. ఉదాహరణకు అజంతా ఎల్లోరా గుహలను పరిరక్షించడంలోనే కాదు, వాటి ప్రతిరూపాలను రూపొందించి ప్రపంచానికి అందించడంలో జరిగిన కృషి ప్రశంసనీయమైనది. ఉద్ధండుల చేత వాటిని బొమ్మలను వేయించడం, ఫోటోలను తీయించడం, పుస్తకాలుగా ముద్రించడం సాధారణ విషయం కాదు. కానీ వాటి ఒరిజినల్స్ ఏమైపోయాయనేది ఇప్పుడు మిగిలిన ప్రశ్న. తెలంగాణకు వారసత్వ సంపద అంతా భద్రంగా ఉన్నదా? వాటిలో ఎన్ని దొంగతనానికి గురయ్యాయి? ఎవరైనా అమ్ముకున్నారా అనే సందేహాలు ఎంతో కాలంగా వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో అనేక పంచలోహ విగ్రహాలు దిక్కూదివాణం లేకుండా పడి ఉన్నాయని అంటున్నారు. మల్లినాథ సూరి నివాసం నుంచి వందలాది తాళపత్ర గ్రంథాలను అధికారులు తీసుకుపోయారని, వాటిని ఎక్కడ పెట్టారో తెలువడం లేదని తెలంగాణ సాహితీవేత్తలు ఆరోపిస్తున్నారు. ఇట్లా తరచి చూస్తే అనేక విషయాలు బయట పడతాయి. పురాతత్వ సంపదను కాపాడడానికి కృషి చేసిన నిజాం హైదరాబాద్ స్టేట్ మ్యూజియంకు తన పేరు పెట్టుకోలేదు. కానీ సీమాంధ్ర సర్కారు దీనికి వైఎస్‌ఆర్ స్టేట్ మ్యూజియం అని పేరు మార్చడం వలస ఆధిపత్యానికి నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం కొనసాగి ఉంటే మన ఘనమైన చరిత్రను భద్ర పరుచుకునే ఏర్పాట్లు సాగేవి. యూరప్‌తో సహా ప్రపంచమంతటా ఆధునిక సమాజాలు తమ జాతి చారిత్రక అవశేషాలను ఎంతో శ్రద్ధ వహించి పదిలపరచుకున్నాయి.

కాలం గడిచే కొద్దీ శిథిలమయ్యే, కనుమరుగయ్యే అపురూపమైన సంపదను కాపాడుకోవడంలో దశాబ్దాల పాటు నిర్లక్ష్యం చేయడం విషాదకరం.

ఇంతకాలం తెలంగాణ పురావస్తు సంపదకు జరిగిన అన్యాయం ఒక ఎత్తయితే, రాష్ట్ర విభజన సందర్భంగా జరగబోయే నష్టం మరో ఎత్తని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు. పురాతత్వ విశేషాలను పరిరక్షించుకోవాలంటే, తక్షణం చేయవలసింది సీమాంధ్ర పెద్దలు తెలంగాణకు చెందిన గ్రంథాలను, ఇతర సంపదను తరలించుకుపోకుండా అడ్డుపడడమేనని అంటున్నారు. పురాతత్వ అవశేషాలు, రాత ప్రతులు తెలంగాణలో లభించిన వాటిని ఇక్కడే భద్రపరచాలె. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ స్టేట్‌కు చెందిన సంపదను ఇక్కడే కొనసాగించాలె. కానీ జిల్లాల వారి విభజన వంటి ప్రాతిపదికలతో ఇక్కడి సంపదను తరలించుకుపోయే కుట్రలు సాగుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఉదాహరణకు తార్నాకలోని పురావస్తు భాండాగారం చాలా పెద్దది. దేశంలో దీనికొక విశిష్ట స్థానం ఉన్నది. దీనిలో ఉప్పేసి పొత్తు కూడుతామని అంటే ఒప్పుకోకూడదు.

తెలంగాణకు చెందిన కళాఖండాలను తరలించడానికి ఒక సీమాంధ్ర అధికారి మౌఖిక ఆదేశాలు జారీ చేశారని, దీనికి కింది అధికారి నిరాకరించారని కొద్ది కాలం కిందట చెప్పుకున్నారు. గుంటూరు జిల్లా అమరావతిలో కాల చక్ర కార్యక్రమం సందర్భంగా ఇక్కడి నుంచి విలువైన కళాఖండాలు తీసుకుపోయి అక్కడ పెట్టారని, మళ్ళీ ఇక్కడకు పంపించలేదని ఆరోపణలు ఉన్నాయి. నిజాం కాలంలో 1932లో బస్సు రవాణా వ్యవస్థ ప్రారంభమైంది. అవి తెలంగాణలో తిరుగాడేవి. ఆనాడు మొదటగా తెప్పించిన బస్సులలో రెండు ఇంకా మిగిలి ఉన్నాయి. వాటిలో ఒక బస్సును విజయవాడకు తరలించి అక్కడ సెంట్రల్ బస్ స్టేషన్ ముందు పెట్టుకున్నారు. దానిని తిరిగి తెప్పించాలని తెలంగాణ వారు ఎంత కోరినా పట్టించుకోవడం లేదు.

ఈ విలువైన సంపదను కాపాడుకోవడానికి తెలంగాణవాదులు ఉద్యమ స్ఫూర్తితో వ్యవహరించాలె. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే మొత్తం పురాతత్వ సంపదకు సంబంధించి మనం కోల్పోయినది ఎంత, పరిరక్షించుకోవలసింది ఏమిటి, తవ్వి తీయవలసినది ఎట్లా అనే అంచనాకు రావాలె. చరిత్ర పరిశోధన, పరిరక్షణకు సమగ్ర వ్యూహం రూపొందించుకోవాలె.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *