యూఎస్ టెక్నాలజీ కంపెనీ పీఐ స్క్వేర్ హైదరాబాద్‌లో గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించింది. ఫార్చూన్ 500 జాబితాలోని చాలా కంపెనీలకు తాము సేవలందిస్తున్నామని ఈ సందర్భంగా పీఐ స్క్వేర్ తెలిపింది. డేటా సైన్స్, ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, యానిమేషన్, వీఎఫ్ఎక్స్, సీజీఐ, ఏఆర్, వీఆర్ వంటి టెక్నాలజీలపై ఫోకస్ పెడుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్‌ను తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రారంభించారు.
మాదాపుర్ హైటెక్‌సిటీ వద్ద ఏర్పాటయిన ఈ సెంటర్లో ప్రస్తుతం 300 మంది ఉద్యోగులుంటారని, రాబోయే రెండేళ్లలో ఈ సంఖ్యను 1,000 కి పెంచుతామని పీఐ స్క్వేర్ తెలిపింది. సెంటర్లో హార్న్‌బిల్ స్టూడియో పేరిట యానిమేషన్ స్టూడియో కూడా ఉంటుందని పేర్కొంది. హైదరాబాద్‌లో గ్లోబల్ డెలివరీ సెంటర్ పెట్టడానికి అనేక విదేశీ కంపెనీలు ఉత్సాహం చూపిస్తున్నాయని జయేష్ రంజన్ చెప్పారు. యానిమేషన్ ఇండస్ట్రీ ఎదుగుదలకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని పేర్కొన్నారు. మెటావర్స్ వంటి కొత్త టెక్నాలజీలలో యానిమేషన్, వీఎఫ్ఎక్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయని కంపెనీ సీఈఓ శ్రీనివాస్ రాజు చెప్పారు.