By: జైని మల్లయ్యగుప్త
స్వాతంత్య్ర సమరయోధుడు
పవన్ జనసేనను తెలంగాణ ఆకాంక్షలమీద దాడిగానే చూడాలి. పోరాటాలకు, త్యాగాలకు తరతరాలుగా చిరునామాగా నిలిచిన తెలంగాణ యువతను సినిమా వెర్రిమాలోకంలో ముంచడానికి మొదటినుంచీ ఓ కుట్ర జరుగుతున్నది. ఇప్పుడు అది నగ్నంగా తెరమీదికొచ్చింది.
ఈ మధ్యన పవన్ కళ్యాణ్ తన పార్టీ ప్రకటనను టీవీల్లో చూసిన తర్వాత మొదటి సారి తీవ్ర నిరాశా నిస్పృహలు ఆవహించాయి. అనేకత్యాగాలు చేసిన గడ్డమీద ఒట్టి అల్లరిమూక దన్నుతో ఓ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడం, దాన్ని పెద్ద ఘనకార్యంగా మన మీడియా ప్రసారం చేయడం చూసిన తర్వాత ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. ప్రజాస్వామ్యం గతిని చూసి భయమేసింది. ఆయన సినిమా హీరోగా ఎలాంటి సినిమాలు చేశాడో, అందులో ఎలాంటి నటనాకౌశలాన్ని ప్రదర్శించాడో నాకు తెలియదు. ఎందుకంటే.. ఆయన సినిమాలు చూసే అ(దుర)దృష్టం రాలేదు. ఎందుకంటే..ఆయన సినిమాలు ఓ సామాజిక సమస్యతోనో, ఒక సందేశాత్మక చిత్రంగా తీసినట్లుగానో నాకైతే తెలియదు.
ఎన్నడూ ఏ సామాజిక సమస్య పట్టని వాడు రాత్రికి రాత్రి పార్టీ పెడుతానని తెరమీదికి వచ్చి తై తక్కలాడటం చూశాక.. జుగుప్స కలిగింది. ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ పెట్టడమే ఒక వింత అయితే.. అందులో ఆయన విన్యాసాలు ఇంకా విచిత్రం. ఇక ప్రజల సమస్యలు, జీవితాలు పునాదిగా ఉండాల్సిన ఆయన ఉపన్యాసం ఆయన బాల్యం గురించిన పిట్ట కథ ఒకటి చెప్పుకున్నాడు. ఆయన తండ్రి ఆ కాలంలోనే హెడ్ కానిస్టేబులో, ఎస్‌ఐ అయితే.. పవన్ గారు వారం రోజులు అన్నంలేక ఉపవాసమున్నాడట! అబద్ధం చెప్పినా అతికేటట్లు ఉండాలి కదా! ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఏదైనా చెప్పుకునే హక్కు ఉన్నదన్నది ఇందుకే నా..? అనిపించింది. అయితే.. మనకు పవన్ ఓ సాధారణ వ్యక్తిగా జీవిస్తే.. ఆయన వ్యక్తిగత విషయాలు ఎవరికీ అవసరం లేదు. పట్టించుకోరు కూడా. కానీ ఆయన సమాజంతో సంబంధం ఉండే రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత, ప్రజల జీవితాలను ప్రభావితం చేసే రాజకీయాలను నడుపడానికి నిశ్చయించుకున్న తర్వాత ఆయనను సాధారణ వ్యక్తిగా సమాజం చూడదు. చూడకూడదు. తప్పకుండా ఆయన వ్యక్తి త్వం గురించీ, వ్యక్తిగతం గురించీ పట్టించుకుంటుంది. వ్యక్తిగత జీవితం మొదలు జీవితాచరణనంతా చూస్తుంది. ప్రశ్నిస్తుంది. దీన్ని ఆయన సహించడట! వ్యక్తిగత జీవితంలో ఎంత అరాచకంగా ఉన్నా.., ఆయన ప్రజలకు నీతి బోధలు చేస్తూ ఉంటే.. మనమంతా వినాలన్నమాట! అలా వినక పోతే.. బాగుండదని, తాటా తీస్తానని ఓ బెదిరింపు కూడా చేశాడు! ఇక్కడ నా బోటి వాళ్లకు అర్థం కాని విషయమేమంటే.. ఏ సామాజిక ఆచరణ, నీతి, నిజాయితీ, త్యాగనిరతిలేని వారంతా వచ్చి మనకు ప్రబోధకులుగా చెలామణి కావడానికి ప్రయత్నిస్తుంటే.. మనం చేష్టలుడిగి చూస్తుండవలసిందేనా? ఇలాంటి వారికి ఈ ధైర్యం ఎలా వచ్చింది? దీన్ని నేను మాత్రం సామాజిక పతనంగానే భావిస్తున్నాను. ఏ విలువలు లేని వాడు నీతి బోధలు చేయడానికి అర్హుడెలా అవుతాడో నాకు బోధపడటం లేదు. మా తరంలో అయితే.. నీతి, నిజాయితీ, సచ్ఛీలతలే పెట్టుబడిగా ప్రజా జీవనంలోకి అర్హతగా ఉండేవి. జీవితంలో ఏ చిన్న మచ్చ ఉన్నా ప్రజా జీవితానికి అనర్హతగా భావించే వాళ్లం. అలా అందరం నీతికి, నిజాయితీకి, త్యాగనిరతికి కట్టుబడి ఉంటేనే ప్రజలు ఆదరించారు. మా తరం అంతా ఓ ఆశయాలకోసం పనిచేసిన తరం. నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని ఓడించడం కోసం సాయుధ పోరాటానికి సమరశంఖమూదిన భువనగిరి గడ్డమీద నుంచి మేం అనేక నూతన సంప్రదాయాలను, విలువలను పాదుకొల్పాం. సాంఘిక సంస్కరణలను అమలు చేస్తూ… ఆ సంస్కరణలు మా జీవితాల నుంచే ఆచరణలో పెట్టేవాళ్లం. ఈ నేపథ్యంలోంచే సీపీఐ నేత భిక్షం.. ధర్మభిక్షం అయ్యిండు. సుందరయ్య మొదలు భీంరెడ్డి నర్సింహారెడ్డి దాకా ఎందరో ఆదర్శమూర్తులుగా అందరి మన్ననలు పొందారు. ఆరుట్ల దంపతులు ఆదర్శ దంపతులుగా, పోరాట వీరులుగా నిలిచారు.
చాలా రోజుల క్రితం స్వాతంత్య్ర సమరయోధుడైన ఓ మిత్రుడు మనం పోరాటం చేసిందీ, త్యాగాలు చేసిందీ ఇందుకోసమేనా.. ఇది చూడటానికే జీవించి ఉన్నామా? అని నిర్వేదంగా అన్నాడు. నిజంగా నాకు పవన్ కళ్యాణ్ పార్టీ ప్రకటన, వీరంగం చూసిన తర్వాత నిరాష ఆవహించింది. కళ్లముందు ఎంత హీనంగా, దుర్మార్గంగా ఎవరు ప్రవర్తించినా నిలువరించక పోవడానికి ప్రజాస్వామ్యం అని సరిపెట్టుకోవడం, చేష్టలుడిగి చూస్తూ ఉండటం ఇప్పటి దౌర్భాగ్యమే. అదే తెలంగాణ సాయుధ పోరాట కాలంలో నైతే.. జీవితాలకు సంబంధం లేకుండా ప్రజా జీవితాలను కాలుష్యం చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే.. గుత్పల సంఘం అలాంటి వారిని ఊరుపొలిమేర దాకా తరిమేది. మంచి కోసమే హక్కులు ఉంటాయి.., కానీ.. ప్రజావ్యతిరేక చర్యలకూ, దుర్మార్గాలకూ హక్కులుండవు, చోటుండదు. ఇక్కడనే మరో మాట కూడా చెప్పాలి. ఇటీవలి కాలంలో.. అక్రమార్జన పరులూ, దోపిడీ దాగా కోరులూ నిర్భయంగా రాజకీయ రంగు పులుముకుని ప్రజలముందుకు వస్తున్నారు. వారికి ప్రజలు జేజేలు పలుకుతున్నట్లు మీడియాలో చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఎవరి టీవీ (బాకా) వారికున్నా.. మందిని ఏవిధంగా పోగు చేసినా.. వేలాది మంది వారి మీటింగుల్లో ఉంటున్నారంటే.. ఎక్కడనో లోపమున్నది. నేటి ప్రజాస్వామ్యం అవినీతి పరులకు, అక్రమార్కులకు అండగా ఉంటున్నది తప్పా, న్యాయం కోసం పోరాడుతున్న వారి పక్షాన ఉన్నట్లు కనిపించటం లేదు. దీనికి ఎన్నైనా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అందుకే నేమో.. ఆ మధ్యన ఒక మేధావి ఇప్పుడున్నది ధనస్వామ్యమే తప్ప ప్రజాస్వామ్యం కాదన్నాడు. అలా చూస్తే ఇప్పుడునడుస్తున్న అరాచకీయమేనన్నది అర్థమవుతూనే ఉన్నది.
పవన్ తన రాజకీయ పార్టీ ప్రకటనలో చేసిన విన్యాసాలు, వీరంగం అటుంచితే.. అంతకన్నా ప్రమాదమేమంటే.. దశాబ్దకాలం పాటు ప్రజల ఆకాంక్షల కోసం ఎన్నో బలిదానాలు చేసిన తెలంగాణ నేల మీద పవన్ కళ్యాణ్ కాలుమోపుతున్నాడు. తాను తెలంగాణ వాణ్నేనని చెప్పుకొస్తున్నాడు. దానికి ఆయనకున్న అర్హతగా ఆంధ్రాయాసలో జం జమ్మల్ మర్రీ పాట అందుకున్నాడు. తెలంగాణ ఉద్యమానికి మొదటినుంచీ దన్నుగా ఉన్న విద్యార్థి యువకులను పక్కదారి పట్టించడం కోసం పవన్ దొడ్డి దారిన దూసుకొస్తున్నాడు. పల్లెనుంచి పట్నం దాకా ఉద్యమానికి ఊపిరి పోసిన యువతను ఎన్నికల సమయంలో తెలంగాణ చెంతన ఉండకుండా చేయడానికి పథకం పన్నాడు. కాబట్టి పవన్ జనసేనను తెలంగాణ ఆకాంక్షలమీద దాడిగానే చూడాలి. పోరాటాలకు, త్యాగాలకు తరతరాలుగా చిరునామాగా నిలిచిన తెలంగాణ యువతను సినిమా వెర్రిమాలోకంలో ముంచడానికి మొదటినుంచీ ఓ కుట్ర జరుగుతున్నది. ఇప్పుడు అది నగ్నంగా తెరమీదికొచ్చింది. తెలంగాణ ప్రాంతమే లక్ష్యంగా పవన్ మాఫియా మూక (జనసేన) కదులుతున్నది. దీన్ని తెలంగాణ విద్యార్థి లోకం, యువత తిప్పికొట్టాలి. తెలంగాణపై జరుగుతున్న బహుముఖ దాడిని ఓడించాలి. తెలంగాణ పోరాట చైతన్యాన్ని చాటాలి.