mt_logo

పాటే ఆయుధం.. ఛలో ధూమ్‌ధామ్

By: అల్లం నారాయణ 

బెంగటిల్లినట్టున్నది. పరిస్థితులేం బాగాలేవు. ఎవరి గొంతు వారే పలుకుతున్న ధ్వని. గొంతు దాటని శబ్ద తరంగాలు. విచ్ఛిన్నమవుతున్న మాటలు. బయట ఉక్కపోత. శీతాకాలంలోనూ చెమటలు పట్టిస్తున్న గర్మి. లోపలేదో ఉడుకుతున్నది. చంద్రబాబు కరీంనగర్‌లో అటు ఇటుగాని మనసుతో సంచరిస్తున్నడు. కిరణ్‌కుమార్‌రెడ్డి వరంగల్‌లో కాకతీయ ఉత్సవాలు నడిపించి వచ్చిండు. బాణం ఆస్పత్రిలో కోలుకుంటున్నది. మళ్లీ ఎప్పుడో దూసుకువచ్చే ప్రమాదం. మళ్లీ ముప్పది ఏడు సంవత్సరాల తర్వాత ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’… మరి మన తెలంగాణ తల్లి. విగ్రహం ముందర వాడిపోయిందా పూలదండ. జయజయహే తెలంగాణ.. జననీ జయకేతనం… ముక్కోటి గొంతుకలు ఒక్కటయిన చేతనం. (అందెస్రి) పాఠశాలల్లో మార్మోగిన పాట మళ్లోసారి.. విను మిత్రమా ఇప్పుడిక పాటే ఆయుధం. లోపల హాలు భద్రంగా ఉంది. లోపల హాలు విద్యుత్ గీతమై ప్రసరిస్తున్నది. హాలులో అలల మీద నడుస్తున్న నావలా.. తెరలు తెరలై పొరలుతున్నది పాట. విమలక్క జైలులో ఉన్నది. ‘ఛలో ధూమ్ ధామ్ తెలంగాణ జాతరొచ్చెరా’. కటకటాలు దాటి ఆవరిస్తున్నది, ఆవహిస్తున్నది. కమ్ముకుంటున్నది పాట. మత్తడి దుంకి అలుగు తన్నుకొని పారినట్టు…ధైర్యంగా ఉన్నది. ఇప్పుడు కొంత సర్దుకున్నది. లోపల మనసు నిండుతున్నది. ధూమ్‌ధామ్ సాగుతున్నది. ధూమ్‌ధామ్ నడుస్తున్నది. అదొక ఉమ్మడి పాట. అదొక కోరస్. అది సబ్బండవర్ణాల బృందగానం. చేతులు కలిపిన అల్లికల ఐక్యతా తాడుమీద ధూలాడుతున్నది ధూమ్‌ధామ్. మితృలారా ఇప్పుడు మందిల కలిసినట్టున్నది. మందితో ఐక్యమైనట్టున్నది. పాట వొంపిన జవజీవం ఒంట్లో ఎక్కించుకుంటున్న కొత్త నెత్తురు. తెలంగాణ నాలుక మీద పాటున్నది. అది మాటపాటై… పల్లెపలుకై… గర్భస్త పిండాలను గంతులేయించి.. ‘ఎప్పుడు అమ్మా నన్ను కంటావు యుద్ధానికి వెళ్తా’ (రసమయి) అని పిలుస్తున్నది. ఆ పాటకు వందనం.. ధూమ్‌ధామ్‌కు వందనం. సమస్త తెలంగాణ కళాకారులకు వందనం. తెలంగాణను వీధుల్లోకి ఉసిగొల్పింది పాట. అరణ్యాలను వెలిగించింది పాట. అమ్మకడుపులో ప్రేమను గానం చేసి ‘రాలకురా.. నువ్వు రాలకురా’ అని యుద్ధరంగం బరిగీసి చూపింది పాట. ఆ పాట తెలంగాణ పురితాడు అయ్యి దండెడగా బిగిసింది. ఒక్కొక్క పోగూ నేసిన సప్తవర్ణాల కలనేత అయ్యింది. ధూమ్ ధామ్‌ను భుజాన మోసిండు రసమయి బాలకిషన్.

తెలంగాణకు ఒక చరిత్ర ఉన్నది. అది విశిష్టమయినది. తెలంగాణకు ఒక సంస్కృతి ఉన్నది. అది సమభావన, సమజీవన మనిషితనపు సంస్కృతి. తెలంగాణకు ఒక ప్రత్యేక భాష ఉన్నది. అది అచ్చ తెలుగుగా వెలిగింది. కానీ తెలంగాణ ఆధిపత్యంలో అల్లాడిపోయింది. చరిత్ర ఆనవాళ్ల కోసం, తన చరిత్రను తాను తవ్వుకోవడం కోసం, తన చరిత్రను తాను ధాత్రి సాక్షిగా దర్శించుకోవడం కోసం అది రాయి విసరాల్సి వచ్చింది. చరిత్ర మరుగునపడింది. భాష వేళాకోళమమయింది. సంస్కృతి వెక్కిరింత అయ్యింది. పల్లె పడావు పడింది. ‘కుమ్మరి వాములు కూలిపోయినవి’ (గోరటి వెంకన్న) రేలాధూలాలాడిన పల్లెలు ఆధిపత్య సంస్కృతిలో ఆగమైపోయినవి. ఊరుమీద నీలిమేఘాలు కమ్మినవి. విషపు వాన. విష సంస్కృతులు మింగిన తెలంగాణ. పరాయి తెలంగాణ. యాస లేదు. భాష లేదు. బాస లేదు. కట్టులేదు. బొట్టు లేదు. బతుకమ్మ లేదు. బోనం ఎత్తదు. పల్లె రాత్రిళ్లు గాలి లో వీచే గానాలు చెయ్యదు. పీరీల గుండంల అలయ్ దుంకదు. ఆధిపత్యం కబళించింది. ప్రపంచీకరణ మారురూపం. కోస్తాంధ్రలో ఎక్కి తొక్కచ్చిన పెట్టుబడులు తెచ్చిన పతన సంస్కృతి. కలర్ టీవీలు కక్కిన విషం. సినిమాలు చిల్లం కల్లం చేసిన వాకిలి తెలంగాణ. భాష రాదు. యాస కుదరదు. వాడుక భాషపొంటి వచ్చింది తెలంగాణకు ఆధిపత్యభాష. రెండున్నర జిల్లాల్లో కాలడ్డంపెట్టి కాలువ మళ్లించుకున్న పంటపొలపు హజం నుంచి దిగుమతయింది భాష. హైదరాబాద్ మీద పడ్డ పాపిష్టి కన్ను. ఉద్యోగం కోసం, నిజాం కొలువుల్లో సేవల కోసం, మద్రాసు ప్రెసిడెన్సీలో సి.పి. బ్రౌన్‌లు సవరించిన భాష. తెలంగాణ భాష ఎక్కడ? మాట్లాడే భాష ఎక్కడ. చరిత్ర, సంస్కృతి, భాష తమ ఆనవాళ్లడిగాయి. నిజమే అస్తిత్వం కావాలి. తెలంగాణ వారు కోల్పోయిన అస్తిత్వం. ఇల్లలికి పేరు మరిచిన ఈగకు పేరు గుర్తుకు రావాలి. విలీనం తర్వాత విధ్వంసానికి ముందరి ఉజ్వల గతాన్నిప్పుడు తవ్వుకోవాలి. సమ్మక్క సారక్కను తల్చుకోవాలి. నిజమే. తెలంగాణలో లాభనష్టాలు లేని బతుకును బతుకుగా స్వీకరించే తత్వమేదో ఉన్నది. రాజరికాలకు, భూస్వామ్యానికి, గడీలకు, దొరలకు, తాబేదార్లకు, రాజ్యానికి కూడా తలవంచని తత్వమేదో దక్కన్ పీఠభూమి వారసత్వమై ఉన్నది. కాకతీయుల మీద కత్తి దూసిన సమ్మక్క సారలక్కల నుంచి తెలంగాణ జండెత్తిన యోధునిదాకా.. ఈ చరిత్రను వర్తమానం లో వారసత్వంగా తీసుకోవాల్సి ఉన్నది. గత వైభవాన్ని చాటుకోవాల్సి ఉన్నది. ఫ్రాంజ్ ఫానన్ నిజమే. కోల్పోయాము మేము.

మమ్మల్నిమేము. మాటలు మరచినట్టు తప్పిపోయినాం మేము. కోస్తాంధ్ర అంగట్లో కాట గలిసినాం మేము. టీవీల నిండా ప్రవహించిన శుద్ధ శుష్క హాసాల నటనలకు, పత్రికల నిండా వరదై పారిన పదాలకు, సినిమా తెరల గుండా ప్రవహించిన విషానికి.. ఆధిపత్యం ముందు సంస్కృతిని ధ్వంసం చేస్తుంది. తెలంగాణ సంస్కృతి ధ్వంసమయింది. కానీ కానీ తెలంగాణ నాలుక మీద ఒక పాటున్నది. ఆ పాటే ఒక ఆయుధం. అది గూడాలల్ల పుట్టింది. అది గుడిసెలల్ల పుట్టింది. అది బుడ్డగోసిలేని దళితుల అంగుటి వరమైంది. అల్లిబిల్లి పదాల వన్నె చిన్నెల హరివిల్లు అయ్యింది. తెలంగాణ సందర్భంలో అది ధూమ్ ధామ్ అయింది. గుడిసెల మీద ఎగిరిన పాటే ఇప్పటి అసలైన ఆయుధం. నిజమే. ఏ పెత్తనం అయితే పరాయిలను చేసిందో? ఆ పెత్తనంపై దండయాత్ర. కళాకారుల మర్లబడ్డ గొంతులు చరిత్రను, వైభవాన్ని సంస్కృతిని తవ్వితీశాయి. ధూమ్‌ధామ్ ఎత్తుకున్న బతుకమ్మ అయింది. తీసిన బోనం అయింది. మూడు పానాదుల కాడ నిలేసిన బొడ్రాయి అయింది. అమరవీరుల స్తూపం అయింది. పదేళ్ల ధూమ్‌ధామ్ ఒక తెలంగాణ పోరు పతాక అయింది. ఏవీ అలనాటి గుర్తులు, అలనాటి సంగతులు, అలనాటి వైభవాలని అంగలార్చింది. అలనాటి వైభవాలు కాదు వర్తమానంలో తెలంగాణ ఎగరేసిన జెండాను భూజానికి ఎత్తుకున్నది పాట. తెలంగాణ సాయుధ పోరాటంలో పల్లెటూరి పిల్లగాడితో ఎర్రకోటపై ఎర్రజెండా ఎగిరించడానికి పురిటి నొప్పులు పడింది. తెలంగాణ పాట. అదొక ధిక్కార స్వరం. అదొక వెల్లడి. సర్వవేళ సర్వావస్థల్లో నాలుకల మీద నడయాడిన దుక్కం. ఉద్వేగం, ఉప్పెనలాంటి ఉక్రోషం, ఒక ఆగ్రహం, కనుపాప జీరలో ఎర్రని ఎరుపు పాట. నక్సల్బరీ గద్దరన్న గొంతులో అడవులు, వాగులు, వంకలు దాటి రేలపాటయింది. గద్దర్ ఒక యుద్ధనౌక. అతనొక నిష్టగల పండితుడి కన్నా అధికుడు. నాలుక మీద జీవద్భాష నడయాడిన వాళ్లందరూ ఆమాటకొస్తే ఈ దేశపు అసలు సిసలు పండితులు. శూద్రులెవరు. పంచములెవరు? తెలంగాణలో పంచముడే పాట పాడాడు. అతదే అధికుడు.

గద్దర్ నక్సల్బరీ నినాదం. నూరు మాటల పెట్టు ఒక గద్దర్ పాట. ఇంకా మాటలెందుకు? ఛలో ధూమ్ ధామ్.. అడవి బాట పట్టిన అన్నలనడుగు. ఏ పాట అతని గుండెల్లో గూడుకట్టుకున్నదో? ఏ పాట అతని ఆయుధ సంగీతమయిందో? వెన్నులో భూకంపం పుట్టించిన గద్దర్ వెన్నులో తూటాదించాడు శత్రువు. తెలంగాణ బతికే ఉంది. గద్దర్ ఆమ్మా తెలంగాణమా అన్నడు. ఎర్రజెండ జెండెన్నియ్యలో… పల్లెపదాలు మోదుగుపూల ఎరుపు వనాలై విలసిల్లనవి. బెల్లి లలిత ముక్కలైన దేహం, ఖండిత శిరస్సు చెప్పిన పాట రహస్యం. పాట పాడని ఊరులేదు. పల్లెలు పాట కోయిలలయిన కాలం.

మళ్లీ నిలబడింది తెలంగాణ. అవును మున్నూటా అరవై తొమ్మిది మరణాల మునుము. అదిగో తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం నుంచి, నక్సలబరీకి నడకలు నేర్పిన పాట తెలంగాణ వర్తమానంలో ప్రతిఘటనను అందిపుచ్చుకున్న కెరటమైంది. ఎంత నెత్తురు ఇచట ఏరులై పారెనో.. అని అది ఆర్తగీతాలను వినిపించింది. పోగొట్టుకున్న వాళ్ల కోసం తొవ్వల్ల పువ్వుల స్మృతి గీతమయింది. సుత్తి కొడవలి మీద ముత్తెమై మెరిసిన నక్షత్రపు మెరుపు అయింది. పాట తెలంగాణను ఆవహించింది. వీధులు బతుకమ్మ లాడినవి. తెలంగాణ ఉద్యమం ధూమ్‌ధామ్ అయింది. పదేండ్ల కిందట గత వర్తమానాల చిత్రపటం మీద ఒక మెరుపులా పుట్టిందే ధూమ్‌ధామ్. నువ్వు కడుపుల్లో పేగుల మీద వీణలు మీటిన వాడివా? నువ్వు రగల్‌జెండా మీద రగులుకున్న బుక్కాగుండావా? అయినా సరే ఇదిగో ఇది తెలంగాణ. నువ్వు కమ్యూనిస్టువా? అయినా రా… నువ్వు ఉత్తరాలె పాటలు పాడేవాడివా అయితే రా! తెలంగాణ పిలుస్తున్నది. నిన్నూ. నన్నూ, సబ్బండ వర్ణాలను, సబ్బండ జాతులను జమిలిగా రమ్మంటున్నది తెలంగాణ. విప్లవం ఒక సుదూర సుందర స్వప్నం. కానీ తెలంగాణ పరాయియై తన నేల మీద తాను కోల్పోయిన స్వప్నాలను మళ్లీ కంటున్నది. తెలంగాణ అమరవీరుల సాక్షిగా అని పిలిచింది తెలంగాణ. ఉమ్మడి అస్తిత్వం కోసం జమిలి గానం. ‘నువ్వు నేను తెలంగాణ నీలి గగన ప్రాంగణాన’ పదేండ్ల క్రిందట పుట్టిన ఒక ఉమ్మడి వేదిక ధూమ్‌ధామ్. అది తెలంగాణంత విశాలమై, వ్యాపించింది. అది తెలంగాణ పోరాటపు గొంతుక అయింది. లీడర్లను వేదిక కింద కూచోబెట్టి… వేదిక మీద పాట రాజ్యమేలింది. తెలంగాణ కోల్పోయిన సంస్కృతిని బంతిపువ్వుల్ల తెచ్చి బాస చేసింది. కోల్పోయిన చరిత్రను కండ్ల ముందట కమనీయ దృశ్యం చేసింది. అంతరించిన కళలను వేదికల నిండా నింపింది. డిల్లెంబల్లెం ఆడింది. శివసత్తులను దుంకించింది. అమరవీరుని కోసం శైవగీతాలు పాడి ఏడ్పించింది. అచ్చ గద్దర్ వారసత్వంలో అచ్చ రాజకీయాలు చెప్పింది. మాటల తూటాలు పేల్చింది. అదే ధూమ్ ధామ్.మనసు నిమ్మళమైంది. మనసు నమ్మకమైంది. ధూమ్‌ధామ్ తెలంగాణ పాటల మాటల నిప్పుల జమిడికె. ఛలో ధూమ్ ధామ్.. ఛలో ధూమ్ ధామ్. ఇప్పుడిక భరోసా ఉన్నది. కత్తులు దూసుకపోయినా… ఎత్తిన జెండా దించకోయ్. తెలంగాణ పాటగాళ్లకు వందనం. తెలంగాణ ధూమ్‌ధామ్‌కు పదివేల వందనాలు.. ధూమ్‌ధామ్ మోగాలి. సీమాంధ్ర సర్కార్ గుండెల్లో డప్పుల దండోరా కావాలని కోరుకుంటూ… పాటే మన ఆయుధం.. పాటే మన ప్రయాణం.
(విమలక్కను తక్షణమే విడుదల చేయాలి…)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *