mt_logo

పార్టీలు వేరైనా పోరాటం ఒక్కటే! జానారెడ్డి

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి అంతా కలిసికట్టుగా శ్రమించాలని, పార్టీలకతీతంగా పోరాడాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ నేత, మంత్రి కే జానారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నాడు రెండు పార్టీలకు చెందిన నాయకులు జానారెడ్డి నివాసంలో సమావేశమయ్యారు.

రాష్ట్ర విభజన బిల్లులోని అభ్యంతరకర సమావేశాలపై అసెంబ్లీలో ఎలా చర్చించాలన్నదానిపై వారందరూ ఒక అభిప్రాయానికొచ్చినట్లు సమాచారం. జనవరి ౩న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నందున 2వ తారీఖున అన్ని తెలంగాణ రాజకీయపక్షాలు, టీజేఏసీ, టీ ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి అఖిలపక్షం ఏర్పాటుచేసి బిల్లులోని అంశాలపై సవరణలు ప్రతిపాదించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇలా అన్నారు.

‘చారిత్రక సమయంలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరక్కుండా చూడాల్సిన బాధ్యత అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ నేతలపై ఉంది. కాబట్టి పార్టీలకతీతంగా మనందరం ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది.’

సీమాంధ్రకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ తెలంగాణపై అప్పుల భారాన్ని మోపేందుకు సీమాంధ్రులు కుట్రలు పన్నుతున్నారని, ఎలాగైనా వీటిని అడ్డుకుని సంపూర్ణ తెలంగాణ సాధించుకోవాలని ఇరు పార్టీల నేతలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఉమ్మడి రాజధాని, గవర్నర్ పాలన, నీటి వ్యవహారాలు, ఆస్తులు, అప్పుల పంపకాలు, ఉద్యోగ నియామకాలు తదితర అంశాలపై సవరణలు ప్రతిపాదించాలని, కాని పక్షంలో తెలంగాణ నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా చర్చించారు. పార్టీలు వేరైనా తెలంగాణ కోసం ఒక్కటిగా ఉద్యమించాల్సిన సమయమని జానారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒకే మాట ఒకే బాటగా కలిసి పనిచేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలోని ఆస్తులు కాజేసి అప్పులు మిగల్చాలని సీమాంధ్రులు కుట్రలు చేస్తున్నారని ఎంపీ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *