టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కరే రహస్యంగా రాష్ట్రపతిని కలవడం చూస్తే అర్ధమవుతుంది ఆయన తెలంగాణ పట్ల ఎంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారో! రాష్ట్రపతితో సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడిన మాటలను బట్టి చూస్తే విభజన జరక్కుండా ఆపాలని చూస్తున్నట్లు అర్ధమవుతుంది. సీమాంధ్ర నాయకులతో వెళితే తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడతానని, తెలంగాణ నాయకులతో వెళితే విభజన ఆపడం వీలుకాదని అభిప్రాయపడ్డట్లు తేటతెల్లమవుతుంది. విభజన బిల్లులోని అంశాలు సరిగ్గాలేవని, అందుకే రాష్ట్ర విభజనను ఆపివేయాలని రాష్ట్రపతిని కోరినట్లు చెప్పడం చూస్తే, చంద్రబాబుకు తెలంగాణ రాష్ట్రం ఇప్పట్లో ఏర్పడడం ఇష్టం లేదని తెలుస్తుంది. సమన్యాయం అంటూ గొంతు చించుకుని అరుస్తున్న బాబు సీమాంధ్ర, తెలంగాణ టీడీపీ నాయకులను కలుపుకుని రాష్ట్రపతి దగ్గరకు వెళ్ళొచ్చు. కానీ అలాంటిదేమీ లేకుండా ఒక్కరే వెళ్ళడం పలు అనుమానాలకు తావిస్తుంది. సీమాంధ్ర టీడీపీ నేతలకు దొరికిన అప్పాయింట్ మెంట్ తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలకు లభ్యం కాకపోవడం చూస్తే చంద్రబాబు ఎలా అడ్డుకున్నారో స్పష్టమవుతుంది. మిగతా పార్టీల నాయకులందరూ బృందాలుగా వెళితే చంద్రబాబు ఒంటరిగా వెళ్ళడం అందరిలో చర్చనీయాంశం అయ్యింది.