ఐటీ కంపెనీలకు అడ్డాగా మారిన హైదరాబాద్‌కు మరో ప్రఖ్యాత కంపెనీ రాబోతున్నది. భారత్‌లో తమ తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నట్టు అమెరికాకు చెందిన గ్లోబల్ ఐటీ, ఇన్‌ఫ్రా కంపెనీ పార్క్ ప్లేస్ టెక్నాలజీస్ ప్రకటించింది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ కంపెనీలకు నెలవుగా ఉన్న రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. 150 మంది పనిచేసేలా 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలమైన శిక్షణ కేంద్రం, మీటింగ్ హాల్స్, జిమ్, స్విమ్మింగ్‌పూల్, యాంఫీ థియేటర్ లాంటి అత్యాధునిక సౌకర్యాలతో దీన్ని తీర్చిదిద్దనున్నట్టు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, పరిశ్రమలకు అందజేస్తున్న ప్రోత్సాహకాలు, హైదరాబాద్‌లోని సానుకూల వాతావరణం, మౌలిక వసతులు తమను అమితంగా ఆకట్టుకున్నాయని, అందుకే భారత్‌లో తమ తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నామని ఆ కంపెనీ స్పష్టం చేసింది. వ్యాపారాభివృద్ధిలో భాగంగా భారత్‌లో పెట్టుబడి పెట్టి ఇప్పటికే డజను మందికిపైగా అసోసియేట్స్‌కు శిక్షణ ఇచ్చిన పార్క్ ప్లేస్ టెక్నాలజీస్‌కు ప్రస్తుతం దేశంలో 400కుపైగా స్థానిక, అంతర్జాతీయ బ్లూచిప్ క్లయింట్లు ఉన్నారు.
హైదరాబాద్ డైనమిక్ సిటీ: క్రిస్ అడమ్స్
హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ డైనమిక్ సిటీగా పార్క్ ప్లేస్ టెక్నాలజీస్ సీఈవో, అధ్యక్షుడు క్రిస్ ఆడమ్స్ అభివర్ణించారు. అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతి పొందిన ఐటీ, ఈ-కామర్స్ కంపెనీలు హైదరాబాద్‌కు రావడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సానుకూల వాతావరణం కారణమని తెలిపారు. హైదరాబాద్‌లో తమ తొలి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా భారత్‌లో తమ ప్రణాళికలను మరింత విస్తరించనున్నట్లు క్రిస్ ఆడమ్స్ చెప్పారు.