-తెలంగాణ పచ్చబడాలె.. అదే నా ధ్యేయం..
-చివరి రక్తపు బొట్టు వరకు పాటుపడుతా
-ప్రపంచంలోనే నంబర్ వన్ పారిశ్రామికవిధానం అమలుచేస్తాం
-రూపాయి కూడా లంచం అడుగరు.. నా హామీ
-అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలి
-సింగిల్‌విండో, స్పెషల్ ఛేజింగ్ సెల్ అంశాలే ప్రాథమ్యాలు
-పెట్టుబడులకు స్నేహపూర్వక హస్తాన్ని అందిస్తాం
-ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
-మహబూబ్‌నగర్ జిల్లాలో పీ అండ్ జీ, కోజెంట్ కంపెనీలకు ప్రారంభోత్సవం
-జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి శంకుస్థాపన
తెలంగాణ పచ్చబడాలె.. ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. ప్రభుత్వానికి ఆదాయం రావాలి. నా చివరి రక్తపు బొట్టు వరకు తెలంగాణ కోసమే పాటుపడుతా.. అదే నా లక్ష్యం, ఆశయం. అందుకోసం అహర్నిశలు పని చేస్తా. పరిశ్రమలు ఎన్ని ఎక్కువ వస్తే రాష్ట్రానికి అంత మేలు. అందుకే పెట్టుబడి వర్గానికి స్నేహపూర్వకహస్తం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.
దానికోసం అధికారులతోపాటు ప్రజాప్రతినిధులూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. అందరూ సహకరిస్తేనే సత్ఫలితాలొస్తాయని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం వేముల గ్రామం స్పర్శ్ పారిశ్రామికవాడలోగల కోజెంట్ ఫార్మాస్యూటికల్ గ్లాస్ తయారీ పరిశ్రమ, కొత్తూరు మండలం పెంజర్ల గ్రామశివారులోగల ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ (పీ అండ్ జీ) పరిశ్రమను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అదే గ్రామశివారులోగల జాన్సన్ అండ్ జాన్సన్ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కోజెంట్ పరిశ్రమ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో 30 లక్షల ఎకరాల బీడు భూమి ఉందని.. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో భూముల్లేవన్నారు. ప్రతి అంగుళాన్ని సర్వే చేయిస్తున్నామని, ప్రతి ఎకరాను సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఎలాంటి వివాదాల్లేని భూమి 20 లక్షల ఎకరాలు ఉందన్నారు. వీటిలో వ్యవసాయానికి ప్రతికూలంగా ఉన్నవాటిని పరిశ్రమలకు కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే పరిశ్రమల స్థాపనకు 35 వేల ఎకరాలు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారని పేర్కొన్నారు. తెలంగాణ నిలబడాలె. కలబడాలె. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలకు పాల్పడినా కేసీఆర్ దేనికీ భయపడడని అభిమానుల హర్షధ్వానాల మధ్య కేసీఆర్ ఉద్విగ్నంగా మాట్లాడారు.
ప్లగ్ అండ్ ప్లే
గత ప్రభుత్వాల హయాంలో పరిశ్రమలకు స్థలాలు కేటాయించి చేతులు దులిపేసుకున్నారు. మేం కేటాయించే ముందే పరిశ్రమలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఇది చైనాలో విజయవంతంగా అమలవుతున్న విధానం అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆరునూరైనా సరే… వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రపంచంలో నంబర్ వన్ ఇండస్ట్రియల్ పాలసీగా ప్రసిద్ధి చెందుతుందన్నారు.
పరిశ్రమల స్థాపనకు ముందుకువచ్చే పారిశ్రామికవేత్తలకు తగిన ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. సింగిల్‌విండో విధానంతో పరిశ్రమలకు 15రోజుల్లోగా కావలసిన అనుమతులన్నీ ఇస్తామన్నారు. అవసరమైతే పారిశ్రామికవేత్తలు నేరుగా తనతోగానీ, తన కార్యాలయ అధికారులతోగానీ సంప్రదించవచ్చని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం 50నుంచి 80వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశముందన్నారు.
పారిశ్రామికవర్గాలకు అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి ఎలాంటి వేధింపులు ఉండవని తన హామీగా చెప్పారు. అందుకే ప్రపంచ పారిశ్రామికవర్గాన్ని తెలంగాణకు రావాలని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ (పీ అండ్ జీ), జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలు తెలంగాణలో పరిశ్రమలను నెలకొల్పడాన్ని ప్రత్యేకంగా అభినందించారు. పీ అండ్ జీ ఇప్పటికే రూ.900 కోట్లు పెట్టి పరిశ్రమను నెలకొల్పిందన్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ రూ.400 కోట్లతో పరిశ్రమను నెలకొల్పుతున్నట్లు చెప్పారు.
మరో రూ.4 వేల నుంచి రూ.5 వేల కోట్లతో విస్తరించి దక్షిణాది రాష్ట్రాలకు హబ్‌గా మారుస్తామని జాన్సన్ అండ్ జాన్సన్ ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తుందని చెప్పారు. అందుకే పీ అండ్ జీ కంపెనీ కూడా మరిన్ని సేవలను విస్తరించాలని మేనేజింగ్ డైరెక్టర్ శాంతాను కోస్లాను అభ్యర్థించారు.
అధికారులకు, ప్రజాప్రతినిధులకు హెచ్చరిక
పీ అండ్ జీ కంపెనీని ఆర్అండ్‌బీ వంటి శాఖలు ఇబ్బందులకు గురి చేసిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఇవన్నీ గత పాలనలో నడిచాయని, ఇక నుంచి నడువవని హెచ్చరించారు. ప్రతి ఇన్వెస్టర్‌కూ ఫ్రెండ్లీగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలని హెచ్చరించారు. ఏ ఒక్క ఇండస్ట్రీని ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు.
అప్పుడెందుకు చేయలేదో..
సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినంగా ప్రభుత్వం తరపున వేడుకలు నిర్వహించాలంటూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ గగ్గోలు పెడుతున్నాయని కేసీఆర్ విమర్శించారు. ఇంత కాలం ఎవరు పరిపాలించారు? వారి కాలంలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రజలు హుషార్‌గా ఉన్నారు.. ఎడ్డికాలం కాదని గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబునాయుడు తను తెలంగాణలో అధికారంలో వస్తే అధికారికంగా నిర్వహిస్తడంట! మరి 9 ఏండ్ల కాలంలో ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. 100 రోజుల పాలనపై ప్రతిపక్షాలు చిలుకపలుకులు పలుకుతున్నాయని మండిపడ్డారు.
మొదటి విడతలో 1500మందికి ఉపాధి
మూడేండ్లలో జాన్సన్ అండ్ జాన్సన్ పెంజర్ల పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. మొదటి విడతలో 1500మందికి ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు. 47 ఎకరాల్లో ఏర్పాటుచేస్తున్న పెంజర్ల పరిశ్రమ ప్రపంచంలోనే పెద్ద ఉత్పత్తుల కేంద్రంగా రికార్డు సృష్టించబోతున్నదన్నారు.
పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని, పారిశ్రామికాభివృద్ధికి చొరవ తీసుకుంటున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కోజెంట్ పరిశ్రమ సీఈఓ సూడాన్ మాట్లాడుతూ 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.200కోట్ల పెట్టుబడితో స్థాపించిన ఈ పరిశ్రమలోని ఆధునిక సాంకేతిక యంత్రాలద్వారా రోజుకు మిలియన్ మౌల్డెడ్ వయల్స్, అర మిలియన్ ట్యూబులర్ వయల్స్, కంటైనర్లు ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ భాస్కర్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, వై అంజయ్యయాదవ్, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, టీఆర్‌ఎస్ నేతలు నిరంజన్‌రెడ్డి, విఠల్‌రావుఆర్యా, మాజీ ఎంపీ మందా జగన్నాథం, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, సీఎం ప్రత్యేక కార్యదర్శి నర్సింగరావు, టీఎస్‌ఐఐసీ ఈడీ నర్సింహారెడ్డి, పీఆండ్‌జీ మేనేజింగ్ డైరెక్టర్ శాంతను కోస్లా, అసోసియేట్ డైరెక్టర్ మాధవరావు, కోజెంట్ ఎండీ ఫెడ్రిక్ బార్బియర్, యూఎస్ కాన్సుల్ జనరల్ మైఖేల్, ఫ్రెంచ్ కాన్సుల్ జనరల్ ఎరిక్ లావెర్తుతోపాటు పరిశ్రమకు చెందిన ఎక్బాల్‌సింగ్, రోహిత్‌రెడ్డి, శరత్‌చంద్ర, అక్షయ్‌సింగ్ , కలెక్టర్ ప్రియదర్శిని, ఎస్పీ నాగేంద్రకుమార్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ నా గుండెల్లో ఉంది
మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు నన్నెంతో ఆదరించారు. ఈ జిల్లా నా గుండెలో ఉంది. ఎంపీగా ఇక్కడినుంచే తెలంగాణ సాధించాను. ఇక్కడి సమస్యలు తెలుసు. పాలమూరు పచ్చబడాలె. వలసలు ఆగాలి. ఇక్కడికే వలసలు రావాలి. జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా తదితర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి 11వందల కోట్లు ఖర్చయినా సరే పనులు పూర్తిచేస్తాం. జూరాల ప్రాజెక్టు కింద లక్ష ఎకరాలతోపాటు అన్ని ప్రాజెక్టుల కింద వచ్చే ఖరీఫ్ సీజన్ వరకు 6.5లక్షల ఎకరాల్లో వరి కోతలను నేను చూడాలి.
జిల్లా దారిద్య్రాన్ని తరిమికొడుదాం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో జిల్లా ముఖచిత్రాన్ని మార్చుతామనాన్నరు. జిల్లాలో వలసలు ఆగిపోవడమే కాకుండా, ఇక్కడి వరికోతలకు కర్ణాటకనుంచి కూలీలు వలసవచ్చే పరిస్థితి వస్తుందన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుతో రాష్ర్టానికి రక్షిత మంచినీటిని అందించేందుకు రూ.20 వేల కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశామని, మహబూబ్‌నగర్ జిల్లాకూ త్వరలోనే నీళ్లు అందిస్తామన్నారు. నాలుగేండ్లలో ప్రతి ఇంటికీ నల్లాలతో సురక్షిత నీటిని అందించిన తర్వాతే టీఆర్‌ఎస్ ఓట్లు అడుగుతుందని ప్రకటించారు.
కాకతీయులే వాటర్‌షెడ్ గురించి ప్రపంచానికి నేర్పారు. అప్పటి గొలుసు చెరువులను సమైక్య పాలకులు ధ్వంసం చేశారు. కాకతీయుల వారసత్వాన్ని కొనసాగిస్తూ.. రూ.20 వేల కోట్లతో చెరువుల సామర్థ్యాన్ని పెంచుతున్నాం అని వెల్లడించారు. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే 6100 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, చెరువులు ఉన్నాయన్నారు.
ప్రతి గ్రామంలో 1.25 లక్షల మొక్కల పెంపకం
అడవులు నాశనమయ్యాయి.. అందుకే గ్లోబల్ వార్మింగ్ సమస్య వెంటాడుతున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. దీనికి శాశ్వత పరిష్కారంగా తెలంగాణలోని ప్రతి గ్రామంలో 1.25 లక్షల మొక్కలను పెంచేందుకు రూ.500 కోట్లతో హరితవనం ప్రాజెక్టును రూపొందించినట్లు తెలిపారు. 230 కోట్ల మొక్కల పెంపకం లక్ష్యంగా పని చేస్తున్నట్లు వివరించారు.
84 సభల్లో చెప్పా
సమైక్య పాలనలో అనేక సమస్యలొచ్చాయి.. అందులోనిదే విద్యుత్ కొరత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా మూడు, నాలుగేళ్ల వరకు ఈ సమస్య ఎదుర్కొవాల్సిందేనని 84 సభల్లో చెప్పినా అని చంద్రశేఖర్‌రావు గుర్తు చేశారు. విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల తలెత్తింది.. కానీ, 2016 నాటికి సర్‌ప్లస్ విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. రైతులకు, పరిశ్రమలకు 24 గంటలూ విద్యుత్తు సరఫరా చేసే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..