mt_logo

పంద్రాగస్టున దళితులకు భూపంపిణీ..

దళితులకు భూపంపిణీ పథకాన్ని ఆగస్టు 15న నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభించాలని సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలపై చర్చ జరిగింది.

హైదరాబాద్ పై గవర్నర్ కు అధికారాలను అప్పగించడాన్ని రాష్ట్ర మంత్రివర్గం తీవ్రంగా నిరసించింది. శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ కు అప్పగించడమంటే తెలంగాణ ప్రభుత్వ అధికారాలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవడమేనని, కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మరోసారి లేఖ వ్రాయాలని తీర్మానించారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ను ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించి కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు.

ఫాస్ట్ పథకం ద్వారా విద్యార్థులకు చెల్లించే ఫీజులపై కూడా సుదీర్ఘ చర్చ జరిగింది. 1956 స్థానికతను ప్రామాణికంగా తీసుకుంటే ఇప్పటి వరకు ఉన్న ఫీజు బకాయిలను చెల్లించడానికి ఎలాంటి విధానం అవలంభించాలనే అంశాన్ని చర్చించారు. రైతు రుణాల రీ షెడ్యూల్ కోసం ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శిని ముంబై పంపాలని, రుణాల రీ షెడ్యూల్ ను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తింపజేయాలని రిజర్వు బ్యాంకుకు లేఖ రాయాలని తీర్మానించారు.

2009 నుండి 2014 వరకు పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద 480 కోట్ల 42 లక్షల రూపాయలను చెల్లించేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల 26 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని మంత్రివర్గం తెలిపింది. దళితులకు భూపంపిణీ పథకంలో ఆ కుటుంబంలోని మహిళ పేరిటే పట్టాలు ఇస్తామని, మొదటి విడతగా అసలు భూమిలేని దళిత కుటుంబాలను ఎంపిక చేశామని, ఆయా జిల్లాల్లో మంత్రులు ఈ పథకాన్ని ప్రారంభిస్తారని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బోరుబావి తవ్వటంతో పాటు విద్యుత్ మోటార్, సంవత్సరం పాటు అయ్యే వ్యవసాయ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *