రాష్ట్రంలో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ నెల 20 నుంచి ప్రారంభించాలనుకున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను వాయిదా వేయాలని మంత్రులు, అధికారులు సీఎం కేసీఆర్‌ను కోరారు. వారి విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. జూన్ 3 నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రారంభించాలని సూచించారు. జూన్ 3 నుంచి 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పల్లె, పట్టణ ప్రగతిపై మంత్రులు, అధికారులతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి, దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి మేయర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు హాజరయ్యారు.