గత ఆదివారం జరిగిన రెండు పట్టభద్రుల మండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి రామచందర్ రావు విజయం సాధించగా, నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నల్గొండలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో నాల్గో రౌండ్ ముగిసే సమయానికి పల్లా 2860 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
హైదరాబాద్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు బుధవారం ప్రారంభం అయ్యింది. ముందుగా 435 పోలింగ్ కేంద్రాలలో పోల్ అయిన ఓట్లను కట్టలుగా కట్టి లెక్కింపు మొదలుపెట్టారు. మొదటి రౌండ్ నుండి ప్రతి రౌండ్ లోనూ బీజేపీ అభ్యర్థి ఎన్ రాం చందర్ రావు సమీప టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ పై ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం నాలుగు రౌండ్లలో లక్షా 11 వేల 739 ఓట్లు లెక్కించగా, బీజేపీ అభ్యర్థి ఎన్ రాం చందర్ రావు 53,881 ఓట్లు సాధించి మొదటి ప్రాధాన్య ఓట్లతోనే విజయం సాధించారు. దేవీప్రసాద్ కు మొత్తం 40,563 ఓట్లు పోలయ్యాయి. హైదరాబాద్ నియోజకవర్గంలో 8,433 చెల్లని ఓట్లు పోలవగా, నల్గొండ నియోజకవర్గంలో నాలుగు రౌండ్ల లెక్కింపులో 3675 ఓట్లు చెల్లకుండా పోయాయి.