By: – సవాల్ రెడ్డి
శషబిషలు వద్దు. సాకులు కూడా వద్దు. పాలమూరులో టీఆర్‌ఎస్ ఓడింది. అది వాస్తవం. అంగీకరిద్దాం. బీజేపీ మతం ఉపయోగించినా, కులం ఉపయోగించినా గెలుపు మాత్రం సాధించింది. ఎలా గెలిచింది అన్న వాదోపవాదాలూ అప్రస్తుతం. అసలు గెలిచింది తెలంగాణవాదమా? మతవాదమా? అన్న మీమాంస అక్కర్లేదు. సమైక్యపార్టీలు గెలవలేదు అన్న సమర్థనలు కూడా అనవసరం. అదే సమయంలో మిగిలిన ఐదు స్థానాల్లో వచ్చిన భారీ మెజార్టీ విజయాలు వదిలి, ఒక్క స్థానంలో చిన్న ఓటమి మీద చింతా వద్దు. కుంగిపో నూ వద్దు. ‘తోటి కోడలి గర్భంపోతే గొడ్రాలు తెగ సంబరపడిపోయినట్టు’… డిపాజిట్లు పోయిన పార్టీలను వదిలి, చిన్న అపజయాన్ని చూసి సంబరపడే ఆంధ్ర మీడియాను పండగ చేసుకోనివ్వండి. పోయేదేం లేదు. ఈ గెలుపుతో.. టీఆర్‌ఎస్-బీజేపీ వైరం ఏర్పడి ఇక ఉద్యమంలో విభేదాలు వస్తాయని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణవాదుల ఓట్లు చీలుతాయని, ముస్లింలు దూరమైపోతారని పగటికలలు కనేవాళ్లను కననివ్వండి. కలలు కనే హక్కు వాళ్లకూ ఉంది కదా!
ఒక విషయం మాత్రం తెలంగాణవాదులంతా గుర్తించుకోవాలి. పాలమూరే తెలంగాణ కాదు. తెలంగాణ అంతా పాలమూరు కాదు. అన్ని నియోజకవర్గాల్లో కులం కార్డులు కుదరవు. ‘రజాకార్ల’ బూచీలు ప్రతిచోటా చెల్లవు. పాతబస్తీలో ఎంఐఎం గెలుస్తుంది. తెలంగాణ మిగిలిన చోట్ల గెలుస్తుందా? మరి పాలమూరు ఫలితం మిగిలిన చోట్లా ఉంటుందని అనుకోవడం ఏ రకంగా హేతుబద్ధం? పాలమూరు దాటితే పరకాల ఉంటుంది. అయినా ఇప్పుడు ఆలోచించాల్సింది ఎన్నికల జయాపజయాల మీద కాదు. ఉద్యమం మీద సాగుతున్న కుట్రల మీద. శత్రువు చర్యల మీద. గత కొద్దికాలంగా జరుగుతున్నది గమనించండి. మొన్నమొన్నటిదాకా ఉద్యమపార్టీ ఎమ్మెల్యేలను చీల్చడం, విద్యార్థులపై ఉక్కుపాదం మోప డం, వందల కేసులతో వేధించడం వంటి చర్యలతో ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నాలు చేశారు. అవన్నీ విఫలమయ్యాయి.
నేరుగా దెబ్బతీయడం సాధ్యం కాదని, కొంత కాలంగా తెలంగాణ ఉద్యమ మూలాల మీద దెబ్బకొట్టే కార్యక్షికమం చేపట్టారు. ఉద్యమ నాయకుడి వంశ మూలాలపై దుష్ప్రచారం. కేసీఆర్ తెలంగాణవాడే కాదన్న పత్రికల కథనాలు.. దాన్ని భుజానేసుకుని ప్రతిపక్షం జరిపిన భారీ ప్రచారం. ఇది ఉద్యమ నాయకత్వ నైతిక స్థైర్యాన్ని దిగజార్చే ప్రయత్నం. పోలవరం టెండర్లతో సకల జనుల సమ్మెను ముడిపెట్టి చేసిన అవినీతి ఆరోపణలు. నోళ్లు నొచ్చేదాకా మళ్లీ ప్రతిపక్షమే జరిపిన దుర్మార్గమైన దాడి. దానికి ఆంధ్ర పత్రికలు ఇచ్చిన భారీ కవరేజి. అవినీతి రంగు పులిమి నాయకత్వంపై ప్రజల్లో అనుమానాలు రేకిత్తించడం.
కారణాలు ఏవైనా.. తెలంగాణ ఉద్యమం విషయంలో మొదట్లో ముస్లింలు దూరంగా ఉంటూ వచ్చారు. ముస్లింలకు ప్రాతినిథ్యం వహించే ఎంఐఎం తెలంగాణను వ్యతిరేకించడం కూడా ఇందుకు దోహదం చేసి ఉండవచ్చు. ఇటుక ఇటుక పేర్చినట్టు కేసీఆర్ అనేక ప్రయత్నాల అనంతరం తెలంగాణలోని మెజారిటీ ముస్లింలను ఉద్యమపంథాలోకి తీసుకురాగలిగారు. నిజాంను కీర్తించడం నుంచి.. ముస్లింలకు రిజర్వేషన్ల పెంపు, ఉప ముఖ్యమంత్రి పదవి వంటి వాగ్దానాల దాకా ఆయన చేసిన ప్రయత్నాలు.. ఒక దశలో ఆయనను తీవ్రమైన విమర్శలకు గురిచేశాయి. సోకాల్డ్ మేధావుల నుంచి రాజకీయవాదుల దాకా ఆయనను దుమ్మెత్తిపోయని వారు లేరు. రజాకార్ల వారసుడని ఒకరంటే.. దొరల మనస్తత్వమని మరొకరు అన్నారు. తెలంగాణకు గట్టి మద్దతు ఇచ్చే మేధావి వర్గం సైతం కేసీఆర్ ప్రయత్నాలను జీర్ణించుకోలేకపోయింది. అయినా ఒక్కో అడుగు ముందుకువేసి ఆయన ఏళ్ల తరబడి సాగించిన ప్రయత్నాల వల్ల తెలంగాణ ఉద్యమానికి ముస్లింల మద్దతు సాధించగలిగారు. ఒక దశలో బీజేపీ లాంటి పార్టీకి సైతం ఓటు వేయించగలిగారు. ఇప్పుడు ఇంత శ్రమను పాలమూరు ఫలితం బూడిదలో పోసిన పన్నీరుగా మార్చేసిందా అన్నదే తెలంగాణవాదుల్లో ఉన్న ఆందోళన. ఇది కేవలం బీజేపీ గెలవడంవల్ల ఏర్పడింది కాదు. మైనారిటీ అభ్యర్థిని అనైతిక ప్రచారాలతో ఓడించడం వల్ల వచ్చింది. ఉద్యమానికి ఊపిరిగా నిలవాల్సిన జేఏసీలు సైతం ఇందులో పాలుపంచుకోవడం వల్ల వచ్చింది. ‘ఇంత కాలం నిస్వార్థంగా ఉద్యమానికి మద్ద తు ఇచ్చి, చివరికి ముస్లిం వ్యతిరేకి అన్న పేరున్న బీజేపీని సైతం నిజామాబాద్‌లో గెలిపించినందుకు ఉద్యమ నాయకులు మాకిచ్చే కానుక, ఒక్కగానొక్క మైనారిటీ అభ్యర్థిని ఓడించడమే కాకుండా… రజాకార్లు అన్న బిరుదు ఇవ్వడమూ’ అన్ని ప్రశ్నిస్తే జవాబే ఇవ్వలేని ఇబ్బంది ఏర్పడడం వల్ల వచ్చింది. ఉప ఎన్నికల సమయంలో పాలమూరులో బీజేపీ పోటీని మామూలు విషయంగా పరిగణించలేం.
మిగిలినస్థానాలు రాజీనామాల వల్ల వచ్చినవి. ఇది మర ణం వల్ల వచ్చిన ఖాళీ అని బీజేపీ వాదించవచ్చు. టీఆర్‌ఎస్‌కు పోటీ చేసేందుకు ఏ రకంగా హక్కు ఉంది అని వాదించవచ్చు. అదే వాదన బీజేపీకి వర్తిస్తుంది. ఆ మాటకు వస్తే ఆ పార్లమెంటు స్థానానికి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న కారణంగా, అంతకుముందు ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోవడం వల్ల టీఆర్‌ఎస్‌కే ఆ నియోజకవర్గంలో పోటీకి దిగే హక్కు ఎక్కువగా ఉంది. బీజేపీకి ఏ రకంగా చూసినా అలాంటి హక్కు లేదు. టీఆర్‌ఎస్ ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించిందని ఆరోపిస్తున్న బీజేపీ టీఆర్‌ఎస్ కన్నా ముందే.. కిషన్ రెడ్డి తెలంగాణ పోరు యాత్ర సందర్భంగానే పాలమూరులో పోటీకి దిగుతామని ప్రకటించిన విషయం మరగుపరుస్తున్నది. ఒకవేళ టీఆర్‌ఎస్ వైఖరి ఏకపక్షమైతే సమస్య పరిష్కారానికి జేఏసీ ఉంది కదా. అక్కడ చర్చల ద్వారా పరిష్కారం కానంత సమస్యా అది. అందుకు ఆ పార్టీ తరఫున కనీస ప్రయత్నమైనా జరిగిందా? అది వదిలేసి నా అసలు బీజేపీకి మహబూబ్‌నగర్‌లో అభ్యర్థి ఉన్నాడా? మాజీ టీఆర్‌ఎస్ నాయకుడిని పార్టీలో చేర్చుకొని మరీ పోటీకి దిగడం ఎందుకు? అతనికి టీఆర్‌ఎస్‌ను మద్దతు ఇమ్మనడం ఏం నీతి? జేఏసీ కనుక ధైర్యం చేసి టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చి ఉంటే ఈ పాటికి బీజేపీ జేఏసీ నుంచి బయటకు వచ్చి ఉండేది కాదా?
ఇక ‘మిగిలిన స్థానాల్లో మేము మద్దతు ఇచ్చాం అనడం, అది రాజీనామా చేసిన స్థానం కాదు’ అనడం ఏ రకమైన సంకేతాన్ని ప్రజలకు పంపింది. ఉద్యమం నడుస్తున్నది సీట్లు పంచుకోవడానికి, హక్కులు మాట్లాడుకోడానికా.. తెలంగాణ సాధనకా? గెలవడం ద్వారా ఉద్యమ బలనిరూపణే ఉద్యమ లక్ష్యం తప్ప హక్కులు అనే వాదనలు ఏమిటి? ఏం వైఖరి ఇది?
బీజేపీ మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్‌కు వదిలి ఉంటే తెలంగాణ ఉద్యమానికి మేలు జరిగేది. గత ఉప ఎన్నికల్లో నిజామాబాద్‌లో తేలిగ్గా గెలిచే అవకాశం ఉన్నా టీఆర్‌ఎస్ పోటీ చేయలేదు. ముస్లిం సమస్య ఉన్నా మద్దతు ఇచ్చి కేసీఆర్ ప్రచారం చేశారు. తన అభ్యర్థులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఒక్కొక్క సభ నిర్వహించి ప్రచారం చేసిన కేసీఆర్ నిజామాబాద్ పట్టణంలో ఒకే రోజు ఏకబిగిన నాలుగు సభల్లో ప్రచారం చేశారు. తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత నెల రోజులు మకాం పెట్టి ప్రచారం చేశారు. ముస్లింలు ఇటు కేసీఆర్, అటు తెలంగాణ ముఖం చూసి బీజేపీని గెలిపించారు. ఆ విషయాన్ని బీజేపీ విస్మరించింది. నిజానికి బీజేపీ ముస్లిం వ్యతిరేకముద్ర తెలంగాణ ఉద్యమకారులకు గుదిబండ లాగే ఉన్నది. బీజేపీ మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్ తరపున నిలిచిన ముస్లిం అభ్యర్థికి మద్దతు ఇచ్చి ఉంటే జాతీయస్థాయిలో ఎలా ఉన్నా రాష్ట్రంలోనైనా దాని మీద ముస్లిం వ్యతిరేక ముద్ర తొలిగేది. తెలంగాణ ఉద్యమం పట్ల ఉన్న నిబద్ధత ను ముస్లింలు చాటారు. బదులుగా బీజేపీ వాళ్లు ఏం చేశారు? ముస్లింల జనాభా అధికంగా ఉండి గెలవగలిగిన నియోజకవర్గంలో మైనారిటీ అభ్యర్థిని ఓడించారు.
మొన్నటి దాకా పార్లమెంటులో బిల్లు పెడితే మద్దతు ఇస్తాం లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది. తెలంగాణ ఇస్తుందని.. నిస్వార్థ నినాదం చేసి బీజేపీ పాలమూరు విజయం తర్వాత కొత్త పల్లవి ఎత్తుకుంది. తెలంగాణ జాతీయపార్టీల ద్వారా మాత్రమే సాధ్యమని, టీఆర్‌ఎస్‌లాంటి చిన్న పార్టీల ద్వారా సాధ్యం కాదని వాదిస్తున్నది. తెలంగాణ తెచ్చేది, బీజేపీయేనని వాదిస్తున్నది. ఇది గత అధ్యక్షులు ఉద్యమంలో పాలుపంచుకున్న సమయంలో ఎప్పుడూ వినిపించినది కాదు. పైగా ఇంతకాలం కాంగ్రెస్ చేసిన తెలంగాణ కాంగ్రెస్‌కే సాధ్యం అన్న నినాదానికి తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అన్న నినాదానికి .., ఈ నినాదానికి తేడా లేదు. ఇప్పుడు బీజేపీ అదే దారి ఎంచుకుంటున్నదా? కాంగ్రెస్ దారిలోనే బీజేపీ వెళుతున్నదా?
నిజమే.., తెలంగాణ ఇవ్వడం జాతీయ పార్టీలకే సాధ్యం. ఆ విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు. ఉండాల్సిన అవసరమూ లేదు. కచ్చితంగా జాతీయ పార్టీలు పూనుకున్నప్పుడే తెలంగాణ సాధ్యం. అయితే తమంత తాముగా అవి స్పందించవు. ఆ పార్టీల వెంటబడి ఒత్తిడి తేగలిగిన శక్తి కావాలి. వాటి తోక పట్టుకు ఆడించే శక్తి కావాలి. ఆ శక్తి ఉద్యమం ద్వారా మనం సమకూర్చుకోవాలి. ఉద్యమ పార్టీలకు ఆ బలాన్ని బలగాన్ని అందివ్వాలి.
అందుకే తెలంగాణవాదులు జాతీయ పార్టీలను కాదు, జనాన్ని గుండెల్లో పెట్టుకునే పార్టీల వెంట నడవాలి. ప్రజలే అధిష్ఠానంగా భావించే పార్టీలకే మద్దతు ఇవ్వాలి. ఢిల్లీలో స్విచ్ ఆఫ్ చేస్తే రాష్ట్రంలో నోరు మూతపడే నాయకుల వెంటకాదు. జనం చెప్పిన మాట వినే నాయకులను అనుసరించాలి. కోరితే తల ఇచ్చే వాళ్లు కావాలి తప్ప, తల ఎక్కడో తాకట్టు పెట్టే నాయకులు కాదు.
అందుకే తెలంగాణవాదులు పాలమూరు పరాజయానికి కుంగిపోవడం, ముస్లింలు ఉద్యమానికి దూరమవుతున్నారన్న ఆంధ్ర మీడియా ప్రచారానికి ఆందోళనకు గురికావడం వంటి పనులు అవసరం లేదు. తెలిసో, తెలియకో కొందరు తెలంగాణ మేధావులు రాస్తున్న అతి రాతలకు బాధ పడాల్సిన అగత్యమూ లేదు. ఉద్యమంపైన ముస్లింల విశ్వాసం చెక్కు చెదరదు. ఇచ్చిన మాట కోసం వారికి సీటు కేటాయించడమే ఉద్యమానికి ముస్లింల పట్ల ఉన్న ఆదరణకు గుర్తు. ఓడించిన వాడిని వదిలివేసి, సీటు ఇచ్చిన వాడిదే తప్పు అంటూ కొందరు చేస్తున్న సూత్రీకరణలు నమ్మేందుకు వారేం చిన్న పిల్లలు కాదు. ఉద్యమానికి ఏ ఢోకా లేదు. ఇలాంటి ఆటు పోట్లు గతంలో ఎన్నో ఎదురయ్యాయి. ఉన్న సీట్లు ఊడిన పరిస్థితి చూశాం. పదిసీట్లకు పరిమితమై ఇంకేది తెలంగాణ అన్న పరిస్థితి చూశాం. అప్పుడు కూడా ఆంధ్ర మీడియా , తెలంగాణ మేధావులు చేసిన సూత్రీకరణలు, నిందలు, నిష్టూరాలు, అవహేళనలు చూశాం. అయినా మూడు నెలలు తిరక్కుండానే కేంద్రాన్ని గడగడ లాడించిన మహా ఉద్యమంగా మారడాన్నీ చూశాం. అదీ తెలంగాణ శక్తి. అందుకే మన లక్ష్యం.. తెలంగాణ సాధనకు ఉద్యమించడం. కేంద్రంపై తిరుగులేని పోరాటం జరపడం. అదే సమయంలో ఎన్నికలే వస్తే తెలంగాణ ఉద్యమపార్టీలనే గెలిపించడం. తద్వారా కేంద్రంలో కీలక పాత్ర వహించే అవకాశం ఇవ్వడం. అందుకే తెలంగాణవాదులు మరిచిపోవద్దు. పాలమూరే తెలంగాణ కాదు. తెలంగాణ అంతా పాలమూరూ కాదు. పాలమూరు దాటితే.. పరకాల దాటితే.. పార్లమెంటూ ఉంటుంది. [నమస్తే తెలంగాణ నుండి]