మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు మరెన్నో పథకాలు ప్రజలకోసం చేపట్టామని, తమ పాలనపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సారధ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు నెలల పాలనలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, తమ ఉనికిని కోల్పోతామనే భయంతోనే కాంగ్రెస్, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బుధవారం సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ తో కలిసి హరీష్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2009 మ్యానిఫెస్టోలో పొందుపరిచిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చని కాంగ్రెస్ పార్టీకి ఏడు నెలల పాలనలో సగానికి పైగా హామీలను నెరవేర్చిన తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎక్కడిదని మండిపడ్డారు.
ఒక్కొక్కరికీ ఆరు కిలోల బియ్యం, తొమ్మిది గంటల కరెంటు, 24 లక్షల ఎకరాల ఆయకట్టు, వంట గ్యాస్ ధరలు సగానికి తగ్గిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, ఐదేళ్ళు అధికారంలో ఉండి ఏ ఒక్కటైనా అమలు చేసిందా? అని ప్రశ్నించారు. కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణకు ఒక పక్క ఏపీ ప్రభుత్వం కావాలనే ఇబ్బందులు కలిగిస్తున్నా, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో లేకున్నా దేశానికి ఆదర్శంగా ఉండే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత మా ప్రభుత్వానిదని చెప్పారు. ఇచ్చినమాట ప్రకారం రుణమాఫీ, పించన్ పెంచడం, ఎర్రజొన్న బకాయిలు చెల్లించడం, ఆటో డ్రైవర్లకు, ట్రాక్టర్ డ్రైవర్లకు పాట బకాయిలు రద్దు చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
ఆర్టీసీకి మొదటిసారి రూ. 400 కోట్లు విడుదల చేసి 1000 బస్సులు కొన్నదని, జలహారంతో నాలుగేళ్ళలో ప్రతి ఇంటికీ నీరు ఇచ్చే కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు ముఖ్యమంత్రి 8 గంటల పాటు అన్ని శాఖల వారిని కూర్చోపెట్టి రివ్యూ చేయడం గతంలో ఏనాడైనా చూశారా? అని హరీష్ ప్రశ్నించారు. పవర్లూం కార్మికులకు రుణమాఫీ వర్తింపచేసినందుకా మాపై విమర్శలని, చెరువుల పునరుద్ధరణకు చేపడుతున్న కార్యక్రమం దేశంలో ఎక్కడా జరగనిదనేది నిజం కాదా? అన్నారు. గత ప్రభుత్వాల ఫీజు రీయింబర్సుమెంట్ అప్పులకోసం 500 కోట్ల రూపాయలు విడుదల చేశామని, యాదగిరి గుట్ట అభివృద్ధికి నిధులు, వరంగల్ లో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, టెక్స్ టైల్ పార్క్ ప్రతిపాదించామన్నారు. ఇన్ని చేస్తున్నా మీరేమో గాంధీభవన్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లలో ప్రెస్ మీట్లు పెట్టి ఏం జరగడంలేదని అంటున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు.