ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఈరోజుతో ఆరునెలలు పూర్తయ్యాయి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు పోతోంది. పాలనలో అడుగడుగునా తెలంగాణ ముద్ర కనపడుతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు నూతన పారిశ్రామిక విధానం, రోడ్ల విస్తరణ, ఇంటింటికీ నల్లా సౌకర్యం, చెరువుల పునరుద్ధరణ తదితర అంశాలను రూపొందించి ప్రభుత్వం అభివృద్ధి దిశగా సాగుతుంది.
జూన్ 2 వ తేదీన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటినుండి ఈరోజు వరకు కేసీఆర్ చేసే ప్రతి పనిలోనూ చెదరని ఆత్మవిశ్వాసం, పట్టుదల కనపడుతుంది. ఎవరెన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలని చూసినా, ఎన్ని ఎదురుదాడులు చేసినా ఆయన ఎక్కడా వెనక్కు తగ్గకుండా తెలంగాణ ప్రజలకు ఏం కావాలో అవి తీర్చే ప్రయత్నంలో తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఉద్యోగుల సమస్య, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్, చెరువుల పునరుద్ధరణ, గురుకుల్ ట్రస్ట్ భూముల వ్యవహారం, రుణమాఫీ, ఆసరా, పించన్లు ఇలా ప్రజలకు మేలుచేసే అనేక అంశాలపై కేసీఆర్ తనదైన ముద్ర వేశారు.
గోల్కొండ కోట మీద జెండా ఎగరేయడం, మన రాష్ట్రం- మన పండుగలు అంటూ బతుకమ్మ, బోనాలు పండుగలను తెలంగాణ యావత్తూ భారీగా నిర్వహించడం, రాష్ట్ర చిహ్నాలు ప్రకటించడం.. ఇలా ఎన్నో. జయశంకర్ సార్, పీవీ, ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్, దాశరథి, ప్రజాకవి కాళోజీ, కొమురం భీం, కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది.