mt_logo

ఔను.. తాట తీశారు!

By: సవాల్ రెడ్డి

– ఓటర్లలో పెల్లుబికిన ఆత్మగౌరవం..
-తెలంగాణ నేతలపై అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం
– పవన్‌కు దిమ్మతిరిగే జవాబిచ్చిన తెలంగాణ ఓటరు

తెలంగాణ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ ఓటర్లు గట్టి బుద్ధి చెప్పారు. తెలంగాణ ఉద్యమ నాయకుడిని ఉద్దేశించి తాట తీస్తా అని చేసిన దురహంకార వ్యాఖ్యలపై తెలంగాణ భగ్గుమంది. నెత్తురు మండుతున్నా సంయమనం పాటించింది. పోలింగ్ రోజున ఆ ఆగ్రహాన్ని ఓట్లద్వారా చాటింది. ఫలితంగా ఆ నటుడు ప్రచారం చేసిన ఒకటి, రెండు స్థానాలు మినహా ఎక్కడా ఆయన మద్దతు ఇచ్చిన అభ్యర్థులెవరూ గట్టెక్కలేదు. పైగా వారందరూ మూడో, ఐదో స్థానాలకు దిగజారిపోయారు. ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టిన నిజామాబాద్ నుంచి మొదలుకుని సికింద్రాబాద్‌లో రాత్రి దాకా సాగిన చివరి స్థానం వరకూ ఇవే ఫలితాలు వచ్చాయి. ఆయన ప్రచారంతో లాభపడదామనుకున్న వారికి నిరాశే మిగిలింది. ఆయన ప్రచారం ఏప్రిల్ 23న నిజామాబాద్‌లో జరిగిన భారత్ విజయ్ యాత్రతో ప్రారంభమైంది. అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ, జిల్లాల్లోని 9 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు వేయమని ఆయన అభ్యర్థించారు. ఇందులో ఏ ఒక్కరూ ఎన్నికల్లో గట్టెక్కలేదు. ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.

గత అసెంబ్లీలో బీజేపీ ప్రాతినిథ్యం వహించిన నిజామాబాద్ అర్బన్‌లో కూడా ఆ పార్టీకి మూడో స్థానమే దక్కింది. తర్వాత కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. ఆయనకూ మూడోస్థానమే దక్కింది. అదే వేదిక మీదినుంచి పెద్దపల్లిలో టీడీపీ, రామగుండంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. వారిలో పెద్దపల్లి టీడీపీ అభ్యర్థికి మూడోస్థానం వస్తే, రామగుండం బీజేపీ అభ్యర్థికి ఏకంగా ఐదోస్థానం వచ్చింది. ఇక అక్కడినుంచి ఆయన వరంగల్ జిల్లా చేరారు. అక్కడ పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్న తొర్రూరులో ప్రసంగించారు. పాలకుర్తి నియోజకవర్గంలో మిగిలిన అన్ని మండలాల్లో ఆధిక్యం వచ్చినా ఒక్క తొర్రూరులోనే ఓట్లకు గండి పడింది. ఆ ఒక్క మండలంలో మాత్రమే టీఆర్‌ఎస్‌కు భారీగా ఓట్లు పడ్డాయి.

అదే వేదిక మీదినుంచి వర్ధన్నపేట అభ్యర్థిని గెలిపించాలని పిలుపు ఇచ్చారు. ఆయనకు మూడోస్థానమే దక్కింది. తర్వాత రోజు ఆయన కామారెడ్డి, కోరుట్లలో పర్యటించారు. కామారెడ్డి సభలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, సిరిసిల్ల బీజేపీ అభ్యర్థులు పాల్గొన్నారు. వీరికి ఓట్లు వేసి గెలిపించాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఫలితాల్లో కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థికి కేవలం 13 వేల ఓట్లతో మూడో స్థానం మాత్రమే దక్కింది. ఎల్లారెడ్డి, సిరిసిల్ల అభ్యర్థులు కూడా మూడోస్థానంలోనే నిలిచారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా కోరుట్లలో ఆయన సభ పెడితే అక్కడ బీజేపీ అభ్యర్థికి నాలుగోస్థానం వచ్చింది. ఇక నల్లగొండలో సభ పెడితే అక్కడ బీజేపీ అభ్యర్థికి ఐదో స్థానంతో కేవలం 4 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. తర్వాత రోజు మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్, కల్వకుర్తిల్లో సభలు జరిగాయి. షాద్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థికి మూడో స్థానమే దక్కగా కల్వకుర్తి పెండింగ్‌లో ఉంది.

చివరిరోజు ఆయన హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో ప్రచారం చేశారు. ఇక్కడ ఖైరతాబాద్, శేరిలింగంపల్లి సీట్లు ఆయన ప్రచారం చేసిన అభ్యర్థులకు వస్తే ఆయన చివరి ప్రచారసభ సికిందరాబాద్‌లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. మొత్తంగా గ్రేటర్ పరిధి మినహాయిస్తే మిగిలిన తెలంగాణ జిల్లాల్లో ఎక్కడా ఆయన ప్రచారం నిర్వహించినచోట్ల ఎక్కడా బీజేపీ, టీడీపీ అభ్యర్థులెవరూ గట్టెక్కకపోగా దాదాపు అంతా మూడో, ఐదో స్థానానికే పరిమితమయ్యారు. సినీ నటుడు కదా నాలుగుఓట్లు పడతాయనుకున్న అభ్యర్థులకు ఆయన చేసిన ప్రసంగాల వల్ల నష్టమే జరిగింది.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *