mt_logo

సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్షాల కుట్ర కేసులు

దేశంలో ఎక్కడా లేని పరిస్థితి తెలంగాణ లో కన్పిస్తున్నది. రాజకీయ పార్టీలు ప్రజల మేలు చేయాలని ఆలోచిస్తాయి. తెలంగాణలో మాత్రం ప్రతిపక్షాలు ప్రజలపై పగ పెంచుకున్నాయి. ప్రజలపై కక్ష సాధిస్తున్నవి. కాంగ్రెస్, టిడిపి, బిజెపి, సిపిఎం పార్టీలు ప్రజలకు ద్రోహం చేస్తున్నవి.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను ఎలాగైనా అడ్డుకోవడానికి కేసుల మీద కేసులు ప్రజల పేరుతో వేస్తున్నవి. చనిపోయిన వాళ్ళు, చాలాకాలం క్రితమే ఊరు వదిలి వెళ్ళిన వారి పేర్లతో కేసులు వేయడం మునుపెన్నడూ లేదు. ఇంతకన్నా పెద్దకుట్ర ఏముంటుంది?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు ను అడ్డుకునేందుకు విపక్ష కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కుయుక్తులు, అనుసరిస్తున్న దొడ్డి దారి విధానాలన్నీ బయటపడుతున్నాయి. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కు వ్యతిరేకంగా హైకోర్టులో నడుస్తున్న కేసులో ని 872 మంది పిటిషనర్లలో ఏడుగురు మృతుల పేర్లు కూడా ఉండడం సంచలనం సృష్టిస్తున్నది.

పిటిషన్ దాఖలు చేసిన వారిలో సింగారం గ్రామానికి చెందిన మాసుల సత్యనారాయణ రెండేళ్ళ క్రితం చనిపోయాడు. అదే గ్రామానికి చెందిన మాసుల రామచంద్రం కూడా రెండేళ్ళ క్రితమే చనిపోయాడు. వేముల ఘాట్ కు చెందిన కుంట మల్లయ్య, మంగారి రామయ్య, బొడల్లి ఎల్లయ్య రెండేళ్ల క్రితమే చనిపోయారు. అదే గ్రామవాసులు బాస శ్రీను పోరడ్డి రామయ్య సంవత్సరం క్రితం చనిపోయారు. వీరి పేర్లు, సంతకాలు, చిరునామా పిటిషన్ లలో ఎలా చేరాయో కాంగ్రెస్ నాయకులకు మాత్రమే తెలుసు. మరణించిన వారిని కూడా కాంగ్రెస్ పార్టీ తన నీచ రాజకీయాలకు విడిచిపెట్టదని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. పిటిషనర్ల జాబితాలో మృతులున్నారో లేరో చర్చకు రావాలని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని మంత్రి సవాల్ చేశారు.

కాగా ఆగస్టులో కేసు దాఖలైంది. అంతకన్నా ముందే చనిపోయిన వారు, బతుకుదెరువు కోసం హైదరాబాద్, భివండి, దుబాయి, ముంబయి నగరాలకు గతంలో ఎప్పుడో వలస వెళ్లిన వారి పేర్లు కూడా పిటిషనర్ల జాబితాలో ఉన్నాయి. తమకు తెలియకుండానే, ఎలాంటి సమాచారం లేకుండానే తమ పేర్లతో పిటిషన్లు దాఖలు కావడం పట్ల దాదాపు 400 మందికి పైగా లబోదిబోమంటున్నారు.

కోర్టులో కేసు చేయాలంటే న్యాయవాది సమక్షంలో తప్పనిసరిగా సంతకాలు, లేదా వేలిముద్ర వేయాలి. అలాంటిదేమీ ఈ కేసులో కనబడడం లేదు. వాస్తవాలు తెలుసుకొని కంగు తింటున్నారు. అలాగే కాంగ్రెస్ నాయకుల మాయమాటలు, మోసపూరిత వాగ్దానాలతో సంతకాలు చేసిన వారికి జ్ఞానోదయమై కేసు ఉపసంహరించుకుంటామంటూ న్యాయవాది దగ్గరకు వెళితే ‘కుదరదని’ ఆయన వెనక్కి పంపిస్తున్నారు. ఎర్ర వెల్లి నుంచి 21 మంది, పల్లె పహాడ్ నుంచి 29 మంది, సింగారంకు చెందిన 66 మంది, ఏటిగడ్డ కిష్టాపూర్ కు చెందిన 10 మంది పిటిషనర్లలో ఉన్నారు.

హైకోర్టు తిరస్కరిస్తే గ్రీన్ ట్రిబ్యునల్. ఏదో విధంగా భూసేకరణను నిలుపుదల చేయించాలని, భూసేకరణ ఆగితే ప్రాజక్టులు ఆగుతాయని ప్రతిపక్షాలు కుట్రలు పన్ని మొత్తం మీద హైకోర్టు ద్వారా జిఓ 123 ద్వారా భూసేకరణ ప్రక్రియని నిలుపుదల చేయించినాయి.

భక్తరామదాసు ప్రాజక్టు గడువు కన్నా రెండు నెలల ముందే పూర్తయ్యింది. 123 జీవో కింద భూసేకరణ పూర్తయినందుకే ఇది సాధ్యమయ్యింది. భక్త రామదాసు ప్రాజెక్టు స్ఫూర్తితో మిగతా ప్రాజెక్టులను కూడా ఇదే వేగంతో పూర్తి చేయాలనుకుంటే ప్రతిపక్షాలు కాళ్లలో కట్టే పెడుతున్నవి.

పాలమూరు – రంగారెడ్డిపై 5 పిల్స్ వేశారు. డిండి పై ఒకటి, కాళేశ్వరంపై మరొకటి పిల్స్ హైకోర్టులో వేశారు. 123 జీవోకు వ్యతిరేకంగా 29 రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో మల్లన్న సాగర్ పైన 10, పాలమూరు – రంగారెడ్డి పై 8, మిడ్ మానేరు గౌరవల్లి పై 3, అనంతగిరి రిజర్వాయర్ పరిధిలో 2 పిటిషన్లు వేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో 2 కేసులు వేశారు.

హైకోర్టులో పిల్స్ వేసిన వారిలో బిజెపి నాయకుడు జనార్ధనరెడ్డి ఉన్నారు. ఆయన తరపున వాదిస్తున్నది న్యాయవాది రచనా రెడ్డి. ఆమె కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బి. నరసింహారెడ్డి కూతురు.

మల్లన్న సాగర్ ప్రజల పేరు మీద కేసులు వేసిన న్యాయవాది కెకె. మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నేత. గత ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి ఓడిపోయిన వ్యక్తి. మహేందర్ రెడ్డి 6 కేసులు, న్యాయవాది రచనా రెడ్డి 5 కేసులు, పేరి ప్రభాకర్ 2 కేసులు, వంగ అనిత 2 కేసులు వేశారు.

మల్లన్న సాగర్ భూసేకరణ కు వ్యతిరేకంగా దాఖలైన 10 కేసులలో మహేందర్ రెడ్డి 6 కేసులలో న్యాయవాది. మల్లన్న సాగర్ కేసులలో పిటిషనర్లలో చాలామంది అసలు బతికే లేరు. చాలామంది ఉపాధి కోసం ఎన్నో ఏళ్ళ క్రితం ఊరు విడిచిపెట్టిన వాళ్ళు.

మల్లన్న సాగర్ కేసులు వేసిన వారిలో మాజీ ఎపి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ సన్నిహితుడు చెప్యాల రాజిరెడ్డి, ఎండి హయతుద్దీన్, పోరటి జనార్ధన్ ఉన్నారు. ఇదే ప్రాజక్టుపై కేసు వేసిన మరొక పిటిషనర్ అలిగి తుక్కమ్మ సిపిఎం కార్యకర్త.

పాలమూరు – రంగారెడ్డి పై కేసులు వేసిన వారిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త దామోదర రెడ్డి భార్య నాగ జ్యోతికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉన్నది.

కాంగ్రెస్ శాసనసభ్యురాలు డికె. అరుణ సన్నిహితుడు బడకల్ పవన్ కుమార్ గత ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ తరపున దేవరకద్ర నుంచి పోటీ చేసి ఓడిపోయాడు.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసిన హర్షవర్దన్ రెడ్డి కొల్లాపూర్ కాంగ్రెస్ ఇన్ చార్జిగా ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కొల్లాపూర్ లో పోటీ చేసి ఓడిపోయినాడు. ఆయన అనుచరుడు ఊరకొండ రాముడు పేరుతో నూ కేసులు వేశారు.

ఇటు హైకోర్టు అయినా, గ్రీన్ ట్రిబ్యునల్ అయినా కేసులు వేసింది కాంగ్రెస్, టిడిపి, సిపిఎం, బిజిపి నాయకులు, వాళ్ల అనుచరులు కాగా మెజారిటీ కేసులలో న్యాయవాదులు కెకె. మహేందర్ రెడ్డి, రచనారెడ్డిలు వాదిస్తున్నారు.

కాళేశ్వరం, పాలమూరు, డిండీ ఎత్తిపోతలతో పాటు సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి అవుతే, త‌మ ఉనికికి ప్ర‌మాదం త‌ప్ప‌ద‌ని విప‌క్షాలు భావించి కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టుల పురోగతిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నాయి. ఈ కుట్రలని చేదించి ప్రాజెక్టులని పూర్తి చేసి తీరుతాం. తెలంగాణ ప్రజల సాగునీటి ఆకాంక్షలను నెరవేరుస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *