మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే వై.ఎల్లారెడ్డి, ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకుడు పిడమర్తి రవి, వివిధ సంఘాల నేతలు, వరంగల్ టీడీపీ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రేమలతారెడ్డి మొదలైనవారు బుధవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ కోసం పోరాటం ఎవరు చేశారో వారికే అధికారాన్ని కట్టబెట్టాలని, 14 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాగానే పంచాయితీ పూర్తికాలేదని, పరిష్కారం కావాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయని, ఇలాంటి సమయంలోనే అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తెలంగాణ సాధించింది తామేనని, తెచ్చింది, ఇచ్చింది మేమేనని కొంతమంది గారడీ మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, వారిపట్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ఎల్లారెడ్డి మంచికి, నిజాయితీకి నిర్వచనంగా ఉంటారని, ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ ప్రజలు ఆయనకు ఓటు వేయడమే కాకుండా బ్యాలెట్ పెట్టెకు కూడా దండం పెట్టుకుని వెళ్తారని ప్రశంసించారు. మక్తల్ నియోజకవర్గం నుండి ఆయనను ఎమ్మెల్యేగా నిలుపుతానని, ప్రజాబలంతో ఎల్లారెడ్డి ఘనవిజయం సాధిస్తారని అన్నారు. తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవిని తానే పార్టీలోకి ఆహ్వానించానని, ఉద్యమ నిర్మాణంలో రవి చిచ్చరపిడుగని పొగిడారు. రాబోయే ఎన్నికల్లో రవిని పార్టీ అభ్యర్థిగా నిలిపి ఎమ్మెల్యేను చేస్తామన్నారు. విద్యార్థులంతా సంఘటితంగా ఉండి లక్ష ఓట్ల మెజార్టీతో రవిని గెలిపించాలని కోరారు. టీడీపీ మహిళానేత ప్రేమలతారెడ్డి కూడా తనకు అత్యంత సన్నిహితురాలని గుర్తుచేశారు. మరోవైపు సూర్యాపేటకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ నేత మొరిశెట్టి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బుధవారం హైదరాబాద్ లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.