హైదరాబాద్ తాజ్ కృష్ణలో జరిగిన సీఐఐ సదస్సుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతం పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతమని, ఇప్పటికిప్పుడు పరిశ్రమల కోసం తెలంగాణలో లక్షన్నర ఎకరాల భూమి సిద్ధంగా ఉందని చెప్పారు. పారిశ్రామికాభివృద్ధికి విద్యుత్ రంగం ప్రధానమైనదని, ఐటీఐఆర్ లాంటి ప్రాజెక్టులకు 24 గంటల కరెంట్ అవసరమని కేసీఆర్ పేర్కొన్నారు. దామరచర్లలో రూ. 40 వేల కోట్లతో జెన్కో, సింగరేణి ఆధ్వర్యంలో 6600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేశామని, ప్రస్తుతం ఛత్తీస్ గడ్ నుండి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్నామన్నారు.
పరిశ్రమలకు అన్నివేళలా కరెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, సౌత్ గ్రిడ్, నార్త్ గ్రిడ్ ఇంకా అనుసంధానం కాలేదని, ప్రస్తుతం పరిశ్రమలకు కరెంట్ కోతలు లేవని సీఎం తెలిపారు. దేశంలో ఫార్మా యూనివర్సిటీ ఎక్కడా లేదని, ఇంటర్నేషనల్ ఫార్మా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని, ఫార్మా సిటీ త్వరలో ప్రారంభం కాబోతుందని, రాచకొండ గుట్టలో ఫిలిం సిటీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
ఇదిలాఉండగా ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ఈరోజు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై పరిశ్రమల సమాఖ్య హర్షం వ్యక్తం చేసింది. కొత్త పరిశ్రమలకు తోడ్పాటు అందించేలా రాష్ట్ర బడ్జెట్ ఉందని, మూతపడ్డ పరిశ్రమల పునరుద్ధరణకు దోహదపడేలా ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్ విప్లవాత్మక నిర్ణయమని, 2017 లోగా వెయ్యి పరిశ్రమలు, 50 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపింది.