ప్రభుత్వ పథకాలు అసలైన లబ్ధిదారులకు చేరడానికి ఏ దేశంలోనూ నిర్వహించని రీతిలో ఒకే రోజు ఇంటింటి సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 84లక్షల పైగా కుటుంబాలను 4లక్షల మంది ఉద్యోగులు ఒకే రోజు కలిసి వివరాలు నమోదు చేయనున్నారు. ఈ సర్వేను ఈనెల 19న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశం శుక్రవారం నగరంలోని హైటెక్స్ లో జరుగగా మంత్రులు, అన్ని జిల్లాల ఎమ్డీవోలు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ మిశ్రా, ప్రభుత్వ సలహాదారులు,అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ‘తెలంగాణలో మొత్తం 84లక్షల కుటుంబాలు ఉండగా తెల్ల రేషన్ కార్డుల సంఖ్య 91లక్షలుగా ఉంది. అవేకాకుండా గులాబీ రేషన్ కార్డులు మరో 15లక్షలదాకా ఉన్నాయి. అంటే 22 లక్షల కార్డులు అదనంగా ఉన్నాయన్నారు. ప్రతి పథకానికీ తెల్ల రేషన్ కార్దులే ఆధారం కాబట్టి అవినీతి తారాస్థాయిలో ఉందని, రాష్ట్రంలో ఇప్పటికే 52 నుండి 55 లక్షల ఇండ్లు నిర్మించినట్లు లెక్కలున్నాయి. గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు ఇంకా ఇండ్లు కట్టాల్సిన అవసరముందని చెప్తున్నారు.’
అడ్డగోలుతనంగా గత ప్రభుత్వాలు వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని, తెలంగాణలో 84లక్షల కుటుంబాలు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తుంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ సంఖ్య 86 లక్షలకు పైగా పెరిగింది. అసలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? వాటి పరిస్థితి ఏమిటి? తెలుసుకోవడానికే ఇంటింటి సర్వే పక్కాగా చేపడుతున్నామని, ఖచ్చితమైన లెక్కలుంటే అద్భుత నిర్ణయాలు అమలుచేయవచ్చు అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సర్వే జరిగే రోజున అందరూ ఇండ్లలో ఉండేలా ప్రసార మాధ్యమాలు, ఇతర మార్గాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని, సర్వే జరిగిన రోజున ఇంట్లో లేకపోతే ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు పొందలేకపోతారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే అన్ని నిర్ణయాలకు సర్వే లెక్కలే కీలకంగా మారతాయని, వీటి ఆధారంగానే సంక్షేమ పథకాలు అమలవుతాయని, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు ఆ రోజు సెలవు ప్రకటించి అందరూ ఇండ్లలో ఉండేలా చూస్తే సర్వే కరెక్టుగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. సర్వే జరిగే రోజు పోలీసు సిబ్బంది సైతం సివిల్ దుస్తుల్లో ఉండి సర్వే నిర్వహణలో పాలుపచుకుంటారని, సర్వే నిర్వహణకు ఒక్కో జిల్లాకు 2కోట్ల రూపాయలు విడుదల చేయనునట్లు తెలిపారు.
ఒక్కో ఉద్యోగికి 25నుండి 30కుటుంబాలు కేటాయిస్తారు. ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఫార్మాట్ లో సర్వే వివరాలను సిబ్బంది నింపాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి అధికారులకు ఈనెల 15లోపు శిక్షణ ఉంటుంది. సర్వే పూర్తి చేసిన ఇంటికి జనాభా లెక్కల తరహాలో తెలంగాణ రాజముద్రను అంటిస్తారు. పూర్తిచేసిన ఫారాలను అదేరోజు మండలకేంద్రంలోని తహసీల్దార్లకు ఉద్యోగులు అందిస్తారు. వాటిని సీజ్ చేసి అక్కడి నుండి జిల్లా కేంద్రాలకు పంపిస్తారు. అనంతరం మొత్తం సమాచారాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కంప్యూటరీకరిస్తారు. ఈ విధంగా ఒక్కరోజు సర్వే చేయడంవల్ల ఒక వ్యక్తి మరో చోట వివరాలు నమోదు చేసుకునేందుకు వీలుండదని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అవినీతికి తావుండదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.