mt_logo

లెక్క పక్కాగా ఉండాలి

-ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే
-ఖచ్చితమైన లెక్కలతో అద్భుత నిర్ణయాలు
-పక్కా సమాచారంతోనే పకడ్బందీ ప్రణాళిక
-పోలింగు రీతిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు
-పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధం
-మీడియా ఇప్పటికైనా పిచ్చిరాతలు మానుకోవాలి
-సమగ్ర కుటుంబ సర్వే సన్నాహక భేటీలో సీఎం కేసీఆర్
పక్కా సమాచారం ఉన్నట్లయితేనే ప్రణాళికతో ముందుకుపోవచ్చు. ఖచ్చితమైన లెక్కలుంటే అద్భుత నిర్ణయాలు అమలు చేయవచ్చు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. కొత్త రాష్ట్రంలో ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారని, వారి ఆశలు నెరవేర్చేదిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఒకే రోజు రాష్ట్రవ్యాప్త సమగ్ర కుటుంబ సర్వే-2014కు అధికారులను సమాయత్తం చేసేందుకు శుక్రవారం నగరంలోని హైటెక్స్‌లో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్వే ఆవశ్యకతను, ఉద్దేశాలను, లక్ష్యాలను, ప్రయోజనాలను సీఎం సుదీర్ఘంగా వివరించారు. సర్వే ద్వారా ప్రభుత్వం ఏం చేయదల్చుకున్నదీ విడమర్చి చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది కదా! గతంలో అనేక సర్వేలు చేశాం కదా! అన్న సందేహాలు రావచ్చు. కానీ ప్రభుత్వం వద్ద ఉన్న గత సర్వేలు సరైన పంథాలో జరుగలేదు. కొన్నింటిలో నూరు శాతం తప్పులు కూడా ఉన్నాయి.

మనది కొత్త రాష్ట్రం, సరికొత్త పంథాలో వెళ్లాలి. ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. పక్కా సమాచారం ఉన్నట్లయితేనే ప్రణాళికతో ముందుకుపోవచ్చు. ఖచ్చితమైన లెక్కలుంటే అద్భుత నిర్ణయాలు అమలు చేయవచ్చు అని కేసీఆర్ చెప్పారు. గత అనుభవాలు, జరిగిన తప్పులవల్ల ప్రజలు నాయకులు, అధికారుల పట్ల అసహనంతో ఉన్నారని పేర్కొన్నారు. చేదుగా అనిపించినా.. నిరుపేదలకు ఆశించిన స్థాయిలో ఫలాలు అందలేదు. ఇక నుంచి శషబిషలు, ఈర్ష్యాద్వేషాలు లేకుండా, స్పష్టమైన అవగాహనతో, గమ్యాన్ని నిర్దేశించుకొని అందరం కలిసి చిత్తశుద్ధితో పని చేద్దాం అని సీఎం పిలుపునిచ్చారు.

రాష్ట్రస్థాయి నుంచి కేవలం కాగితాల ద్వారా ఆదేశాలు జారీ చేస్తే అవి కిందిస్థాయికి వెళ్లే వరకు సమాచారం కుంచించుకు (సింక్) పోయి, గందరగోళం ఏర్పడుతున్నదన్నారు. ఇలాంటి గత అనుభవాలున్న నేపథ్యంలోనే అందరం ఒక దగ్గర కూర్చుని, మంచి అవగాహన ఏర్పర్చుకునేందుకు ఈ సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో 84 లక్షల కుటుంబాలు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు ఉన్నాయి. కానీ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2 తర్వాత ఆ సంఖ్య 86.20 లక్షలకు పెరిగింది. ఇది నిజం కావచ్చు, కాకపోవచ్చు. అందుకే అసలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? వారి స్థితిగతులేంటి?.. ఇలా అన్ని వివరాలను పక్కాగా సేకరించేందుకే ఈ సర్వే చేపడుతున్నాం అని చెప్పారు.

రాష్ట్రంలో నాలుగులక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు చెబుతున్నా.. ఈ లెక్కలు కూడా సరిగాలేకపోవడం బాధ కలిగిస్తుందని అన్నారు. అసలు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో ఈ గంటలో మనం చెప్పలేకపోవడం అవమానకరమని వ్యాఖ్యానించారు. అందుకే కొత్తగా పకడ్బందీ సర్వే నిర్వహించి, రాష్ట్రంలోని కుటుంబాలు ఎన్ని? వాళ్ల పరిస్థితి ఎలా ఉంది? ఆరోగ్యం… ఇలా అనేక వివరాలు సేకరించి సమీకరిస్తే తదుపరి కార్యాచరణకు శ్రీకారం చుట్టవచ్చన్నారు. గతంలో జరిగిన సర్వేల్లో పొరపాట్లకు వ్యక్తులను తప్పు పట్టాల్సిన పని లేదని, ప్రభుత్వం వద్ద సరైన లెక్కలు లేకపోవడం వల్లనే ఇన్ని అనర్థాలు, కుంభకోణాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సర్వే పక్కాగా జరగాలి
సమగ్ర కుటుంబ సర్వే ఎలా నిర్వహించాలో ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు. అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి సమగ్ర సమాచారాన్ని సేకరించాలి. అంశాలవారీగా వాటికి కోడ్స్ ఉన్నాయి. సమాచారాన్ని పొడిపొడిగా సేకరించవద్దు. వాళ్లు చెప్పిందే రాసుకురావడం సరి కాదు. మీరు కూడా పరిశీలించాలి. ఒక్కసారి సర్వే ద్వారా వచ్చిన సమాచారం కిందిస్థాయి ఎమ్మార్వో నుంచి మొదలుకుని ఆర్డీవో, ఎంపీడీవో, కలెక్టర్‌తో పాటు హైదరాబాద్ సచివాలయంలోని అందరు కార్యదర్శులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి టేబుళ్ల మీద కూడా అవే ఉండాలి.

ఫలానా వ్యక్తి పేరు కంప్యూటర్‌లో టచ్ చేయగానే అన్ని వివరాలు వచ్చేలా ఉండాలి. ఒక్కసారి పక్కా సమాచారాన్ని సేకరించగలిగితే అద్భుత నిర్ణయాలు అమలు చేయవచ్చు. అదేరీతిన ఒక్కసారి తప్పు జరిగితే చాలా అనర్థాలు చోటుచేసుకుంటాయి. పేదవారికి చేరాల్సిన డబ్బును మధ్యలో దొంగలు తన్నుకుపోయే ప్రమాదం ఉంది. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు.. అందరూ ఒకేరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 84 లక్షలకు పైచిలుకు ఉన్న కుటుంబాల గణన పూర్తి చేయాలి.

ఎన్నికల రోజు పోలింగు నిర్వహించినట్లు.. పోలింగ్ కేంద్రాల వారీగా అధికారులను కేటాయించి, సర్వే చేయాలి. ఏ రోజు నిర్వహిద్దామనే దానిపై నిర్ణయం తీసుకుందాం. 15-20 రోజులు ఆలస్యమైనా ఫరవాలేదు. ఎలాంటి తొందర లేదు. ఎలాంటి ఆంక్షలు ఉండవు. సర్వే నిర్వహించే రోజు రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు (డీసీఎం వంటివి) ప్రభుత్వమే ఎంగేజ్ చేసుకుంటుంది. స్థానిక భౌగోళిక పరిస్థితుల ఆధారంగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకోండి అని సీఎం సూచించారు.

కార్డుల సంఖ్యపై ఆత్మపరిశీలన చేసుకోవాలి
సర్వేను ఆవశ్యకతను వివరించిన సీఎం.. తెలంగాణలో 84 లక్షల కుటుంబాలు ఉన్నాయి. కానీ తెల్ల రేషన్‌కార్డుల సంఖ్య 91 లక్షలుగా ఉంది. వీటికితోడు 15 లక్షల గులాబీ కార్డులు ఉన్నా యి. అంటే 22 లక్షల కార్డులు అదనంగా ఉన్నాయి. పరిపాలనా వ్యవస్థకు ఇంతకన్నా అవమానం ఏముంటుంది? ఈ అదనపు కార్డులు ఎక్కడ ఉన్నాయి? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరముంది. లెక్కలు సరిగా లేకపోవడంవల్ల ఫీజులు, ఉపకార వేతనాల (ఫీజు రీయింబర్స్‌మెంట్)చెల్లింపులతో తెలంగాణ ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నది.

ఏటా రూ.4వేల కోట్లు చెల్లించాల్సి వస్తున్నది. ప్రస్తుతానికి రూ.1363 కోట్ల బకాయిలు ఉండగా, ఈ ఏడాదికి మరో రూ.3వేల కోట్లు చెల్లించాలి. ఇంత విచ్చలవిడితనమా? ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ అన్నింటికీ తెల్ల రేషన్‌కార్డులతో ముడిపెట్టడంవల్లనే ఇదంతా జరిగింది. ప్రతి అవినీతిలోనూ తెల్ల రేషన్ కార్డులు ఇదే విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాయి అని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 52-55 లక్షల గృహాలు నిర్మించినట్లు లెక్కలున్నాయని, గ్రామాల్లోకి వెళితే జనం ఇంకా ఇళ్లు కట్టాల్సిన అవసరముందని చెబుతున్నారని పేర్కొన్నారు. ఏమిటీ అడ్డగోలుతనం? ఏమిటీ వేల కోట్ల రూపాయల అవినీతి? అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

సెంటు భూమినీ వృథాగా ఉండనివ్వం నిజాం పుణ్యమాని తెలంగాణలో కోటిన్నర ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములున్నాయని కేసీఆర్ చెప్పారు. కానీ సమైక్య రాష్ట్రంలో దుర్మార్గులు స్వార్థంతో గోల్‌మాల్ చేశారని ఆరోపించారు. వాటిని తిరిగి తీసుకుంటున్నామని తెలిపారు. అసలు తెలంగాణలో ఎంతమేర ప్రభుత్వ భూమి ఉందనే సమాచారాన్ని జిల్లా కలెక్టర్లను అడిగాం. పలు దఫాల అనంతరం చివరగా 35 లక్షల ఎకరాలు ఉండగా, అందులో 20 లక్షల ఎకరాలు వ్యవసాయానికి అనువుగా లేదని చెప్పారు. అనువుగా లేని వాటిని కూడా తెలివిగా వాడుకోవాలి అన్నారు.

మరికొన్ని రోజుల్లో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించనున్నామని సీఎం వెల్లడించారు. ఇప్పటికే 40 మందికి పైగా పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెడతామని తనను కలిశారని చెప్పారు. వ్యవసాయానికి అనువుగా లేని భూములను పరిశ్రమలకు కేటాయిద్దాం. ఇందులో 3-4 లక్షలు పోను మిగతావి గుట్టలుగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. చిన్న గుట్టలయితే వాటిని సరిచేద్దాం. పెద్దవైతే గుట్టల ఉపరితల భాగాన్ని సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి వినియోగించుకుందాం. ముందు వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములను, ఆతర్వాత కొద్దిపాటి గుట్టలు ఉన్న వాటిని, ఆపై పెద్ద గుట్టలు ఉన్న వాటిని… ఇలా విడతల వారీగా భూములను వినియోగించుకుందాం. ఒక్క సెంటు భూమిని కూడా వృథాగా ఉండనివ్వం. అధికారులు భూములకు సంబంధించి ఖచ్చితమైన వివరాలు ఇవ్వండి. ఇందుకు సమయాన్ని తీసుకోండి. మంచి పనులు చేసేందుకు ప్రజలు మనకు ఐదేండ్ల సమయాన్ని ఇచ్చారు అని సీఎం వివరించారు.

పిచ్చిరాతలు మానుకోవాలి
రాష్ట్రంలో మీడియా ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నదని ముఖ్యమంత్రి విమర్శించారు. ప్రభుత్వ పథకాలు ఒకటైతే.. వారు రాసే వార్తలు మరోలా ఉంటున్నాయి. సంచలనాత్మక (సెన్సేషనల్) వార్తల కోసం మీడియా తాపత్రయపడుతున్నది. ఇప్పటికైనా ఈ విధానాన్ని మానుకోవాలి. అడ్డగోలుగా రాసే విధానాన్ని మార్చుకోవాలి.

ఇప్పటికీ కొన్ని పత్రికలు మేమేమైనా రాయగలమన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ పథకాల మీద ఇష్టమొచ్చినట్లు రాస్తున్నారు. కనీసం ప్రభుత్వం, మంత్రుల వద్ద వివరణ తీసుకోమన్నా తీసుకోవడం లేదు. ఇదేదో నేను డిక్టేట్ చేయడం లేదు. బాధతో చెప్తున్నాను. ఈరోజు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఒక ఆంగ్ల పత్రిక ఇలాగే రాసింది. నేనేదో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ నుంచి అధికారాలు తీసుకున్నానని, బడ్జెట్‌ను నేనే తయారు చేస్తున్నానని రాసింది. ఎవరు చెప్పారండి వారికి? ఈటెల రాజేందర్ మా ప్రభుత్వంలో చాలా కీలకమైన వ్యక్తి. ఆయన్ని పట్టుకొని ఇలాంటి దిక్కుమాలిన వార్తలు రాస్తారా? ఎవరి శ్రేయస్సు కోసం రాస్తున్నారు? ఆ పత్రిక రేపు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని నేను డిమాండు చేస్తున్నాను. బడ్జెట్ రూపకల్పనలో ఆర్థిక శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.

ఇతర శాఖలు, ముఖ్యమంత్రి, ప్రణాళిక విభాగం..అందరూ కలిసి తయారు చేస్తారు. రోజూ ఇలాంటి వార్తలు చూసి నవ్వుకుంటున్నాం. ఇప్పటికైనా పిచ్చిరాతలు మానుకోవాలని మీడియాను నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను అన్నారు. ఈ సన్నాహక సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు టీ రాజయ్య, మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, కేటీ రామారావు, పోచారం శ్రీనివాసరెడ్డి, జోగు రామన్న, పీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పలువురు ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు పాల్గొన్నారు.

సర్వే పత్రంలో ఏముందంటే..!
తెలంగాణలోని ప్రతి పౌరుడి వివరాలు పూర్తి స్థాయిలో నమోదు చేసేందుకు, తద్వారా నిజమైన లబ్ధిదారులకు పథకాలు దరిచేర్చేందుకు కంకణం కట్టుకున్న ప్రభుత్వం.. ఈ నెల 19న చేపట్టనున్న సర్వే కోసం ఒక పత్రాన్ని తయారు చేసింది. చిరునామాతో మొదలుపెట్టి.. ఆర్థిక, సామాజిక స్థితిగతులన్నీ ఈ పత్రంలో నమోదు చేస్తారు.

విభాగం (ఏ)లో పేరు, చిరునామా ఉంటాయి.

విభాగం (బీ)లో కుటుంబ వివరాలు నమోదు చేస్తారు. మతం, సామాజికవర్గం, రేషన్‌కార్డు ఉందా? ఉంటే ఎలాంటిది? బ్యాంకు ఖాతా ఉందా? అనే అంశాలు నమోదు చేస్తారు. ఇందులోనే వివాహానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. వితంతువులు, విడిపోయినవారు తదితరాలు నమోదు చేస్తారు.

విభాగం (సీ)లో కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఇందులో పుట్టినతేదీ మొదలుకుని, విద్యార్హతలు, ఉపాధిపొందుతున్న తీరు, ఆధార్ నంబర్ వంటివి ఉంటాయి. పెన్షన్‌దారులైతే వారికి ఏ రకం పెన్షన్ వస్తున్నదనే వివరాలు క్రోడీకరిస్తారు.

విభాగం (డీ)లో ఇంటి పరిస్థితిని అంచనా వేస్తారు. ఇందులో వారికి సొంత ఇల్లు ఉందా? లేక అద్దె ఇంట్లో ఉంటున్నారా? సొంత ఇల్లయితే పక్కా ఇల్లా? గుడిసె వంటివా? గదులెన్ని? ఇంకా ఎక్కడైనా ఇండ్లు ఉన్నాయా? గతంలో బలహీవర్గాల గృహనిర్మాణంలో లబ్ధిపొందారా? వంటి అంశాలు నమోదు చేస్తారు.

విభాగం (ఈ)లో ఇంటికి ఉన్న విద్యుత్ సౌకర్యంగురించి వివరాలు సేకరిస్తారు.

విభాగం (ఎఫ్)లో.. ఎవరైనా వికలాంగులు ఆ కుటుంబంలో ఉంటే.. వారి వివరాలు, వారికి ఉన్న వైక్యలం ఏమిటి? సదరు వైకల్యంపై సర్టిఫికెట్ ఉందా? ఉంటే దాని నంబరు తదితరాలు రికార్డు చేస్తారు.

విభాగం (జీ)లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారి వివరాలు నమోదు చేస్తారు.

విభాగం (హెచ్)లో వ్యవయసాయ భూమికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. భూమి ఉంటే అందుకు సంబంధించిన వివరాలు నమోదు చేస్తారు. అది వంశపారంపర్యంగా వచ్చినదా? కొనుగోలు చేసినదా? అసైన్డ్ భూమా? శిఖం పట్టానా? లేక కౌలుకు చేస్తున్నారా? వంటి అంశాలను రికార్డు చేస్తారు.

విభాగం (ఐ)లో పశుసంపద వివరాలు నమోదు చేస్తారు. ఇందులో బర్రెలెన్ని? గొర్రెలు/మేకలు, కోళ్లు, పందులు వంటివి నమోదు చేస్తారు.

విభాగం (జే)లో సొంత చరాస్తుల వివరాలకు సంబంధించిన అంశాలుంటాయి. ఇందులోనే బైక్, కారు, ఆటో, కారు, జీపు వంటివాటితోపాటు వ్యవసాయ యంత్రాలైన ట్రాక్టర్, దున్నేయంత్రం, కోత యంత్రం వంటి వాటి వివరాలు రికార్డు చేస్తారు.
చివరిలో సర్వేకు వచ్చిన సిబ్బందికి తాను చెప్పిన వివరాలన్నీ వాస్తవాలని ధ్రువీకరిస్తూ ఇంటి యజమాని సంతకం చేయాల్సి ఉంటుంది.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *