ఆప్షన్ల పేరుతో సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలో ఉంచాలని చేస్తున్న కుట్రలపై తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ తీవ్రంగా మండిపడుతుంది. తెలంగాణలో ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోవద్దని, విభజన విషయంలో అప్రమత్తత అవసరం అని సూచించింది. ఎక్కడి ఉద్యోగులు అక్కడే అని తెలంగాణ ఉద్యోగులను బెదరగొడితే మళ్ళీ ఉద్యమమే అని టీజేఏసీ హెచ్చరించింది. గ్రామ సచివాలయం నుండి రాష్ట్ర సచివాలయం వరకు తెలంగాణ ఉద్యోగులే ఉండాలనే డిమాండ్ తో గవర్నర్ నరసింహన్ ను కలిసి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి ఉద్యోగసంఘాల నేతలు సిద్ధమవుతున్నారు. తెలంగాణకు కేటాయించే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా నిశితంగా పరిశీలించి నియామకం జరపాలని, తెలంగాణ అభివృద్ధి పట్ల, తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి కలిగిన అధికారులను మాత్రమే కేటాయించాలని గవర్నర్ ను వారు కోరనున్నారు.
ఉద్యోగసంఘాల నేతలను సంప్రదించకుండా ప్రొవిజనల్ జాబితా ప్రకటించినా నేతలను ప్రశ్నించాలని, ప్రొవిజనల్ జాబితా పేరుతో జోనల్, మల్టీ జోనల్, హెచ్ వోడీలు, సెక్రెటేరియట్, అసెంబ్లీలోని సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రంలో నియమించేలా కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ జేఏసీ నేతలు ఆరోపించారు. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన ఉండాలని, తెలంగాణ ఏర్పడగానే తెలంగాణ ఉద్యోగులకు జరిగిన అన్యాయాలన్నింటినీ సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసేలా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జేఏసీ నేతలు కోరారు.