By: వరవరరావు
అవమానానికి స్వాభిమానానికి మధ్య అనాదిగా పోరాటం జరుగుతూనే ఉన్నది.
పోరాటం ఉన్నంత కాలం జంపన్నలు ఉంటారు. స్వాభిమానం ఉన్నంతకాలం సమ్మక్క సారలమ్మలుంటారు.
సర్వనామమైపోయిన ఆ పేర్లలో ఒక మెతుకుపట్టి చూసినట్లుగా ఒక సమ్మక్క కథతో మేడారం సమ్మక్క, సారలమ్మ సంస్మరణ ముగిస్తాను.
వరంగల్ దగ్గరి గ్రామంలో జన్మించిన సమ్మక్క రంగారెడ్డి జిల్లా వికారాబాదు ప్రాంతంలో ఇందిరాక్రాన్తి పథంలో కాంట్రాక్టు లేబర్‌గా పనిచేస్తున్నది. సకలజనుల సమ్మెలో భాగంగా సెప్టెంబర్ ఆఖరివారంలో రెండు రోజులు రైల్‌రోకో పిలుపు యిచ్చినపుడు ఆమె చుట్టుపక్కల ఉన్న ఐదారు గ్రామాల డ్వాక్రా మహిళలను సమీకరించి వికారాబాదు తాండూరు రైలు మార్గంపై రెండు రోజులు మిలిటెంటుగా రైల్‌రోకో నిర్వహించింది. పిలుపు ఇచ్చిన ఏ రాజకీయ పార్టీ నాయకులు, జెఎసి నాయకులు అక్కడ కనిపించలేదు. వాళ్ల కార్యకర్తలూ లేరు. పోలీసుల కంట్లో పడకుండా సమ్మక్క సమర్థవంతంగా ఈ పని నిర్వహించింది. ఈ సమీకరణ వెనుక ఎవరున్నారని ఆరాలు తీసి చివరకు డిఎస్పీ సమ్మక్కను అరెస్టు చేసాడు. పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించి టార్చర్ చేయడానికి ప్రయత్నిస్తే ప్రజలు రాత్రి పూట మహిళా పోలీసులు లేని పోలీస్ స్టేషన్‌లో సమ్మక్క నెట్లా నిర్బంధిస్తారని పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించారు.
దానితో ఆమెను ఇందిరా క్రాంతిపథం కార్యాలయానికి తరలించి అక్కడ రెండు రోజులు ప్రశ్నించారు. ఆమెది వరంగల్ అని, ఆమె పేరు సమ్మక్క అని తెలుసుకున్న డిఎస్పీ – అందుకేనా ‘మేడారం సమ్మక్క వలే తిరుగుబాటు చేస్తున్నావు’ అని ఆరోపిస్తూ రైల్వే కేసు పెట్టి చంచల్‌గూడ జైలుకు తరలించాడు.
ఇపుడీ సమ్మక్క తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
—
నమస్తే తెలంగాణ నుండి