mt_logo

ఒక ఆశయాన్ని కలిసి పంచుకుందాం

By: నారదాసు లక్ష్మణ్‌రావు (శాసన మండలి మాజీ సభ్యులు)

ఇవి ఉద్విగ్న క్షణాలు. ఒక నేలను విముక్తం చేసే యుద్ధంలో విజయాన్ని ముద్దాడిన విజయోత్సవ దినాలు. సంకెళ్ళు తెగిన దేహాలు చేస్తున్న స్వేచ్ఛాగానాలు. గ్రహణం వీడిన చంద్రుడిలా, మబ్బులు దాటిన సూర్యుడిలా కోటి ప్రభలతో కాంతులీనుతున్న తెలంగాణకు నాలుగు కోట్ల ప్రజలు ఆనందంతో ప్రణమిల్లుతున్న అద్భుత సన్నివేశం. అస్తమించని సూర్యుడు, విశ్రమించని యోధుడు, తెలంగాణ స్వాప్నికుడు, సాధకుడు, చోదకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న చారిత్రక శుభసందర్భం. తెలంగాణ ప్రజల పోరాట ప్రతీకయైన ఈ విజయం శాశ్వతం కావాలి. జన హృదయ నేత కేసీఆర్ నాయకత్వం తెలంగాణ రక్షణ కవచమై కలకాలం నిలవాలి. అన్నం ముద్ద లాంటి ఆశయాన్ని అందరం కలిసే పంచుకుందాం. యుద్ధరంగమైన జీవితాన్ని ఒకటి గానే ఎంచుకుందాం.

తెలంగాణలో తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొని పోరాటం చేస్తున్న యోధుల సాహసానికి సంఘీభావంగా రాసిన అలిశెట్టి కవిత్వ పాదాలవి. శత్రువు వేరు కావచ్చు. యుద్ధ సందర్భమూ వేరుకావచ్చు. కానీ, దశాబ్దాల సీమాంధ్ర దౌర్జన్యాలను ఎదురించి, వీరోచిత పోరాటం ద్వారా మనం కలగన్న తెలంగాణను సాధించుకున్న తరుణంలో ఆకలి కేకలు లేని తెలంగాణను నిర్మించుకోవడానికి అన్నం ముద్దలాంటి ఒక ఆశయాన్ని కలిసి పంచుకోవాల్సి ఉంది. తెలంగాణ ఏర్పడిన సంబురాలైనా జరుపుకోకముందే, కేంద్రం అండ చూసుకొని తెలంగాణ ద్రోహి చంద్రబాబు సాగిస్తున్న పోలవరం కుట్రలను చూసినప్పుడు మనం ఇంకా ముగియని యుద్ధంలోనే ఉన్నామని తెలియవస్తున్నది. కుట్రలెన్నింటినో రచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆఖరి కుట్రలను అంతమొందించి అందరి ముఖాల్లో వెలుగులు నింపడానికి మరలా యుద్ధరంగం కానున్న జీవితాన్ని ఒక్కటిగానే ఎంచుకోవాల్సి ఉంది. అబేధ్యమైన ఐక్యతను ప్రదర్శించాల్సి ఉంది. నిరంతర అప్రమత్తతను కలిగి ఉండాల్సి ఉంది.

పాలకులు ప్రభువులు కాదు, ప్రజాసేవకులనీ, కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని పనిచేస్తూ పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పని విధానాన్ని అలవర్చుకొని ప్రజల హదయాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించాలని గెలుపొందిన తన సహచరులకు కేసీఆర్ పదేపదే బోధిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత పాలనా బాధ్యతలు తీసుకోవడానికి మధ్య చాలా సమయం కలిసి వచ్చినందున తాను ప్రకటించిన పథకాల అమలుకు సంబంధించిన సంపూర్ణ అవగాహన ఏర్పరుచుకోవడానికి అధికారులు, అన్ని వర్గాల నిపుణులతో నిరంతర చర్చలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వంలో పాలుపంచుకోబోతున్న సహచరులను ప్రజా విధేయులుగా పనిచేయాల్సిన చారిత్రక సందర్భం గురించి అప్రమత్తం చేస్తున్నారు. నిజంగా ఇది శుభ పరిణామం. రాజకీయాల్లో ఓనూతన అధ్యాయం. ఉద్యమ ఫలాలు ప్రజలకు అందాలని పరితపిస్తున్న కేసీఆర్ గారికి ప్రజలు ఆశీస్సులు సదా అందజేయాల్సిన అవసరం ఉంది. ప్రజోపయోగ పథకాలకు మద్దతు ప్రకటించాల్సి ఉంది. క్రెడిబెలిటీతో కూడిన రక్షణ వలయాన్ని నిర్మించాల్సి ఉంది.

అధినేత ఒక్కడే కాదు. అనుచరులూ ఆయన ఆలోచన సరళిని అందిపుచ్చుకోవాలి. ప్రజలు కోటి ఆశలతో టీఆర్‌ఎస్‌కు అధికారాన్ని అప్పజెప్పారు. వారి ఆశలు ఒక్కటికూడా వమ్ము కాకూడదన్న వజ్ర సంకల్పంతో కేసీఆర్ ఉన్నారు. ఆయన ప్రభుత్వంలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, అధికారగణం అందరూ సమష్టి బాధ్యతగా ఆయన సంకల్పాన్ని సాకారం చేయడానికి కంకణబద్ధులై ఉండాలి. ప్రజలు స్పష్టమైన మార్పును కోరుకుంటున్నారు. సీమాంధ్ర పాలనకు, తెలంగాణ స్వీయ పాలనకు మధ్యనున్న వ్యత్యాసాన్ని పోల్చుకుంటున్నారు. శత్రువు పాలనలోంచి స్వీయ అస్తిత్వ రాజకీయ వ్యవస్థలో సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఆశించి, ఆహ్వానించి పట్టం కట్టిన కేసీఆర్ నాయకత్వ నీడలో పది కాలాలు పచ్చగా ఉండాలని కలలు కంటున్నారు. వారి కలలన్నీ నెరవేర్చడానికి కంకణం కట్టుకున్న అధినేత అడుగుజాడల్లో అంకితభావంతో నడవాలి. అప్పుడే ప్రజలు ఆశిస్తున్న, కేసీఆర్ వాగ్దానం చేస్తున్న బంగారు తెలంగాణ సాధ్యం అవుతుంది. సీమాంధ్ర కుట్రదారులు కారుకూతలు కూస్తూనే ఉన్నారు. తనేదో పెద్ద పోటుగాడైనట్లు పనిలో తనతో కేసీఆర్ పోటీపడాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలతో చంద్రబాబు అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాడు.

తెలుగు వారిని ఒక్కటి చేస్తానని ఒకడు, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తానని మరొకడు, నోరు మూసుకొని పడుండమంటూ కొవ్వెక్కిన కూతలు కూస్తూనే ఉన్నారు. మరో పదేళ్ళ వరకూ మన సంపూర్ణ స్వేచ్ఛకు భంగం కలిగించే కొన్ని బంధనాలు మిగిల్చే ఉంచారు. వారి కుట్రలను అమలు పర్చడానికి కావలసిన సహకారం అందించడానికి, వారి వక్రభాష్యాలకు వంత పాడడానికి ఈ గడ్డ మీద పుట్టి కూడా ఈ మట్టికి ద్రోహం చేస్తున్న తెలంగాణ టీడీపీ తమ్ముళ్ళు ఉండనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ, తెలంగాణ ఏర్పాటు విషయంలోనూ మా పాత్ర కూడా మహా గొప్పదని చెప్పుకునే తెలంగాణ బీజేపీ సోదరులు, చంద్రబాబు తదితరుల దుష్ట పన్నాగాలకు మద్దతు పలుకుతూ తెలంగాణ వ్యతిరేక విధానాలకు తెర లేపిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించక కిక్కురు మనకుండా ఉన్న బానిస మనస్తత్వాలను గమనిస్తూనే ఉన్నాం. ఇక ముందుముందు ఇంకా మరెన్ని తెలంగాణ వ్యతిరేక చర్యలను చూడబోతున్నావెూ ఊహించజాలము.

60ఏళ్ళ సీమాంధ్ర ప్రభుత్వ హయాంలో వేలాది ఎకరాల భూమి అస్మదీయులకు అప్పనంగా కట్టబెట్టిన విధానం మనం చూశాం. లక్షల కోట్ల విలువైన భూముల ఆధారంగా కోట్ల రూపాయల విలువైన వాణిజ్య కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడబోతున్న చివరి నిమిషాల్లో కూడా భూ పందేరాలకు సిద్ధపడి మనపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. అందినంత దండుకోవాలని ఫైళ్ళను కదిలిస్తున్నారు. ఇన్ని రకాలుగా దగుల్బాజి పనులు చేస్తూనే తెలుగు వాళ్ళందరం ఒక్కటే, అందరం కలిసి జీవించాలి. రెండు ప్రాంతాల ప్రజలు నాకు రెండు కళ్ళలాంటి వాళ్ళు. వాళ్ళ అభివృద్ధి, సంక్షేమమే నా ధ్యేయం అంటూ పుండు మీద కారం చల్లే మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు. ఈ విషనాగుల కోరలు పీకే పనిని పక్కాగా ప్రారంభించాలి. భూ అక్రమ కేటాయింపులన్నీ రద్దు చేయాలి. సీమాంధ్రుల విష సంస్కృతి మూలాలను పెకిలించివేయాలి. ఇందుకోసం అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు సమష్టిగా కార్యాచరణను తీసుకుని ముందుకుపోవాలి.

ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయకపోవడం అనేది కేసీఆర్ గారి ఎంతటి వివేకవంతమైన చర్యనో, ఎంత ముందుచూపుతో తీసుకున్న నిర్ణయవెూ అర్థమవుతుంది. ఒంటరి పోరులో, ఇంటి పార్టీ గెలుపొందడం ద్వారా స్వీయ రాజకీయ అస్థిత్వ స్పృహ మాత్రమే మన తెలంగాణకు రక్షణ కవచమై నిలుస్తుంది అన్న విషయం మరొక్కసారి రుజువైంది. పోరాట స్ఫూర్తి గల జాతికి నాయకునిగా ప్రమాణ స్వీకారం చేసి, పరాక్రమానికి మారుపేరైన ఈ మట్టికి ప్రణమిల్లిన మరుక్షణం నుంచి ఒక యోధుని విశ్వరూపాన్ని ఈ సీమాంధ్ర కురూపులు చూడబోతున్నారు. ప్రాణ త్యాగానికి సిద్ధపడి సాధించుకున్న మాతృభూమిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించి సాధించే ప్రగతి ఎలా ఉంటుందో చూసినప్పుడు అవాకులు పేలిన నోళ్ళు మూతపడతాయి. ఒక నిశ్శబ్ద విప్లవం సృష్టించే పెను మార్పులు ఎలా ఉంటాయో అపహాస్యం చేసిన అర్బకులు గ్రహిస్తారు. కొల్లాయి కట్టిన గాంధీ ఈ దేశ స్వాతంత్య్రానికి కారకుడైతే, ఒక బక్కపల్చటి దేహం నిత్య పోరాటాల ఈ నేలను భూతల స్వర్గంగా మార్చబోతున్న సుందర దశ్యాన్ని చూడబోతున్నాం. ఆ సంకల్పానికి సలాం చేద్దాం. ఆయన భవిష్యత్ విజన్‌తో చేతులు కలుపుదాం. విజయాలకు బాటలు వేస్తున్న మహానేతకు బాసటగా నిలుద్దాం. బిందువు బిందువు సింధువు అయినట్లు, చేయి చేయి కలిపి అబేధ్య శక్తిగా నిలుద్దాం.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *