తెలంగాణ రాష్ట్ర తొలి డీజీపీగా అనురాగ్ శర్మ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం అనురాగ్ శర్మ బాధ్యతలు తీసుకుని కేసీఆర్ ప్రమాణస్వీకార ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరోవైపు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పెషల్ సెక్రెటరీగా పీ. రాజశేఖర్ నియమించబడ్డారు. తెలంగాణ ప్రభుత్వంలో డిప్యుటేషన్ పై పనిచేసేందుకు మూడేళ్ళపాటు కేంద్రం అనుమతించింది. ప్రస్తుతం రాజశేఖర్ డిల్లీలో ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా మహేందర్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1986 బ్యాచ్ కు చెందిన ఆయన మొదట కరీంనగర్ జిల్లా గోదావరిఖని సబ్ డివిజన్ అసిస్టెంట్ ఎస్పీగా పనిచేశారు. తర్వాత గుంటూరు, ఆదిలాబాద్, నిజామాబాద్, కర్నూలు జిల్లాల్లో వివిధ శాఖల్లో విధులు నిర్వర్తించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా, డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేశారు. అనంతరం నాలుగేళ్ళపాటు సైబరాబాద్ కమిషనర్ గా పనిచేశారు.
ఇదిలావుండగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారులుగా ఆరుగురిని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నియమించారు. వారిలో రిటైర్డ్ ఐఏఎస్ లు ఏకే. గోయల్, ఏ. రామలక్ష్మణ్, బీవీ. పాపారావు, కేవీ. రమణాచారి, జీఆర్. రెడ్డి, సాగునీటిరంగ నిపుణులు ఆర్. విద్యాసాగర్ రావులు ఉన్నారు. వీరంతా ఏడాదిపాటు ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగుతారు.