తెలుగు వల్లభుడూ ప్రత్యేకవాదే!

  • May 28, 2013 10:08 am

By – సవాల్‌ రెడ్డి 

 

(1973 ఆంధ్రభూమి)

Click on image to view full size)

అక్టోబర్ 9, 2008న 26 సంవత్సరాల పార్టీ సిద్ధాంతాన్ని తిరగరాస్తూ 15 మంది సభ్యులున్న తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. అంతవరకూ వల్లించిన సమైక్యవాద సిద్ధాంతా న్ని అటకెక్కించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేసింది. ఈ నిర్ణయం అనేకమంది రాజకీయ విశ్లేషకులు, మేధావులు, ఇతరుల్లో తీవ్ర చర్చ రేపింది. ఇది ఎన్టీఆర్ ఆశయాలకు విఘాతమన్నారు రాజకీయ విశ్లేషకులు…. వంశాంకురాలు, ఆత్మలు, ఆత్మకథకులు, హరికథకులు ఏమన్నారు… ఎన్టీఆర్ బతికి ఉంటే గుండె పగిలేదన్నారు. వీర ఫ్యాన్సు తెలుగు జాతి ఐక్యతే ఎన్టీఆర్ ఆశయమన్నారు. ఎన్టీఆర్ జీవితమంతా తెలుగుజాతి ఐక్యతకు పాటుపడ్డారన్నారు. చంద్రబాబును, పొలిట్‌బ్యూరోను దుమ్మెత్తి పోశారు. ఆత్మకథకురాలు కూడా అయిన అర్దాంగి టీవీ స్టూడియోలన్నీ తిరిగి శాపనార్థాలు పెట్టేశారు. ఎన్టీఆర్ కలలో కూడా ఇలాంటిది ఊహించలేదన్నారు. ఓ వంశాకురమైతే టీడీపీ తీర్మానానికి భిన్నంగా తెలుగుజాతి ఎప్పటికీ విడిపోదని బల్లగుద్ది చెప్పారు. ఆయన బిడ్డలుగా ఆ ఆశయానికే కట్టుబడి ఉంటామన్నారు. ఎన్టీఆర్ బిడ్డగా తానెప్పుటికీ సమైక్యవాదినన్నారు చిన్నమ్మ.

ఎందుకు? ఎన్టీఆర్ సమైక్యవాదానికి సంకేతమనే భావన. తెలుగుజాతి గౌరవానికి ప్రతీక అంటూ జరిగిన ప్రచారం. ఇంత ప్రచారానికి ఆయన చేసిందేమిటి? ఆయనకీ వీరతాడు పడిందెప్పుడు?

1969 ద్వితీయార్ధంలో….

అప్పుడు తెలంగాణ ప్రజలు ఆంధ్రా పాలకుల దోపిడీ మీద తిరగబడుతున్నారు. నిధులు, ఉద్యోగాల దోపిడీతో విసిగిపోయి తమ సొంత తెలంగాణ రాష్ట్రం కావాల ని దేశాన్నే కదిలించే ఆందోళన చేస్తున్నారు. దౌర్జన్యాన్నే నమ్ముకున్న సమైక్య సర్కారు వందలాదిమంది యువకులను కాల్చి చంపేసింది. ఈ సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని నిరసించిన ఎన్టీఆర్ అప్పుడు తాను నిర్మిస్తున్న ‘తల్లా పెళ్లామా’ అనే చిత్రంలో కథకు, కథా గమనానికి సంబంధం లేకపోయినా ఓ పాట, మూడున్నర నిమిషాల సమైక్యవాద ప్రసంగం చేర్చి 1970 జనవరిలో చిత్రాన్ని విడుదల చేశారు.

సమైక్యవాదాన్ని ప్రబోధిస్తూ తెలుగుజాతి మనది అంటూ సాగే ఆ పాటలో కవనము, గాత్ర ము, సంగీతం పోటాపోటీగా ఆధిపత్యవర్గాల భావజాలానికి పట్టంగట్టి కనకాభిషేకం చేశాయి. చిత్రంలో మూడున్నర నిమిషాల పాటు సాగే ప్రసంగంలో ‘మన పెంపు ఐకమత్యము చూసి ఓర్వలేని వాళ్లు ఈ గడ్డను గొడ్డళ్లతో పగులగొట్టాలని చూస్తున్నారని (ఈ ఉద్యమానికి ఇందిర ఆశీర్వాదముందనే ప్రచారం ఆంధ్రలో ఉండేది) రాజకీ య విమర్శలు… పారిక్షిశామికవేత్తలు ఏ ప్రాంతం వారైనా వారి ధనసంపత్తిని పాతుకోవద్దంటూ ముల్కీ నిబంధనలపై విసుర్లు… ఆంధ్ర ఆడపడుచులను అవమానించడం హీనమంటూ ఉద్యమకారులపై బురద… ఇలా ఆధిపత్య భావజాలాన్ని గుక్కతిప్పుకోకుండా అందంగా ఆవిష్కరించాడు ఎన్టీఆర్.

ఇక ‘తెలుగు జాతి మనది’ పాటలో పోచంపాడైనా నాగార్జున సాగరైనా అందరిదీ అంటూ నాటి తెలంగాణవాదుల ప్రధాన విమర్శ (సాగర్ నిర్మాణమే తప్ప పోచంపాడు కదలడం లేదనేది)ను పలుచన చేశారు. ఇంట్లో సమస్య ఉంటే వీధికెక్కాలా.. నలక పడితే కనుగుడ్డు పెరికివేస్తామా అంటూ హృద్యంగా సెంటిమెంటు పండించి ‘పాలు పొంగే తెలుగు గడ్డను పగులగొట్ట వద్దంటూ బతిమాలతారు. ఇక్కడ గమనార్హమైన విషయమేమంటే అప్పుడు ఆయన ఆలోచన యావత్తూ తెలుగుజాతి ఐక్యత చుట్టూనే పరిభ్రమించింది. రాష్ట్రం అనే ఈ భౌగోళిక ప్రాంత ఏకత్వంమీద మాత్రమే ఆయన దృష్టి కేంద్రీకృతమైంది. తెలంగాణ ప్రజల కష్టాలు, వందలాదిమంది బిడ్డలను కాల్చి చంపిన ఘటనలపై ఆయన కంటిలో తడి లేదు. (తెలంగాణ ఉద్యమాన్ని తుపాకులతో ఘోరంగా అణచివేశారు) ఏమైనా ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలను ధైర్యసాహసాలతో కాపాడినందుకు ఆయనకు పెద్ద వీరతాడే పడింది. తెలుగుజాతి గౌరవానికి ఆయన పర్యాయపదమే అయ్యారు. నాటి నుంచి ఎక్కడ తెలుగు సమావేశాలు జరిగినా ఆయన తెలుగుజాతి పాటే ప్రతిధ్వనించింది.

కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మళ్లీ తలెత్తింది.

ఈసారి ఆంధ్ర ప్రాంతంలో… 1972లో ముల్కీ నిబంధనలు చెల్లుతాయని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అక్కడ కల్లోలం రేగింది. అనేక ఏళ్లుగా తెలంగాణలోని ఉద్యోగాలు ఎగరేసుకుపోతున్న ఆంధ్రులకు ఈ తీర్పు అశనిపాతమే అయ్యింది.అక్కడ ఉద్యోగాలు వద్దంటే మాకు ఆంధ్రప్రదేశే వద్దన్నారు. జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. కనివినీ ఎరుగని విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. బందులు, హర్తాళ్లతో ఆంధ్ర అల్లకల్లోలమైంది. కేంద్ర మంత్రుల ఇండ్లు కూడా తగులబెట్టారు. రైల్వేలైన్లు ధ్వంసం చేశారు. తెలంగాణ ఉద్యమానికి సమైక్య సుద్దులు చెప్పిన తెలుగు మీడియా అక్కడ మాత్రం…ఉద్యమం ప్రజలు చేస్తున్నారో, పత్రికలే చేస్తున్నాయో తెలియనంతగా మమేకమైంది. కల్లోలం అణచేందుకు కేంద్ర బలగాలు దిగాక కాల్పుల్లో కొందరు యువకులు నేలకొరిగారు. ఉధృతంగా సాగుతున్న ఉద్యమానికి తెలుగు సినీ పరిశ్రమ మద్దతు ప్రకటించింది. ‘నటశేఖరుడు’ మద్రాసులో నిరాహార దీక్ష చేపడితే పలువురు సీనియర్ నటులు ఉద్యమసభల్లో పాల్గొని ప్రసంగాలు చేశారు. అమరవీరుల కుటుంబాలకు విరాళాలు ప్రకటించారు.

(1973 ఆంధ్రప్రభ)

ఈ సమయంలో రంగంలోకి దిగివ ఎన్టీఆర్, మరో అగ్ర నటుడు అక్కినేనితో చర్చించి జై ఆంధ్ర ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత 1973 ఫిబ్రవరి 17 తేదీన మరోసారి ఇద్దరు అగ్రనటులు కలిసి రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక బహిరంగ ప్రకటనను విడుదల చేశారు. ప్రజాభిప్రాయానికి విలువ ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌ను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించి తెలుగుజాతికి సుఖసంతోషాలు సిద్ధింపచేయాలని వారు అందులో పేర్కొన్నారు.

‘కళలు కళాకారులు రాజకీయాలకు అతీతంగా ఉండాలని నానుడి ఉన్నా, ప్రజాస్వామ్యయుగంలో ప్రజాభీష్టాన్ని ప్రతిబింబిస్తూ ప్రజాదరణతో పెంపొంది గౌరవించబడుతున్న కళా ప్రపంచం ప్రజల మనోభావాలకు ఎప్పుడూ విరుద్ధంగా ప్రవర్తించదు. ప్రవర్తించలేదు. తెలుగు సోదరులందరూ ఒకే కుటుంబంగా కలిసి జీవించాలని ప్రయత్నించారు. భిన్న దృక్పథాలతో కలిసి జీవించడం కంటే విడిపోయి స్వేచ్ఛగా సోదరభావంతో జీవించడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు.

ఈ ప్రయత్నంలో ఆనాడు తెలంగాణ ఈనాడు ఆంధ్ర సోదరులెన్దరో అమరజీవులైనారు. అమరులైన సోదరులకు అశ్రుతర్పణ చేస్తూ వారి కుటుంబాలకు సంతాప సానుభూతులు తెలుపుకుంటున్నాం. తెలుగు బిడ్డలుగా జాతి అభిమానాన్ని పంచుకుంటున్న వారంగా ఈనాడు తెలుగుగడ్డ మీద జరుగుతున్న మారణకాండ నిరసిస్తూ ప్రజాభిప్రాయానికి విలువనిచ్చి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించి తెలుగుజాతికి సుఖసంతోషాలను సిద్ధింపచేయాలని భారత ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాము’

ఇదీ ఆ ప్రకటన!తెలంగాణ ఉద్యమకాలంలో ఎన్టీఆర్ భౌగోళిక ఐక్యత మీద మాత్రమే ఆందోళనపడ్డారు. వందలాది మంది తెలంగాణ యువకుల హననం ఆయన కంటికి ఆనలేదు. ఆంధ్ర ఉద్యమం నాటికి ఆయనకు భౌగోళిక ఐక్యత కన్నా యువకుల బలిదానాలే ప్రధానమయ్యాయి. అందుకే ‘పాలు పొంగే తెలుగు గడ్డను పగులగొట్టండి అని బహిరంగంగానే ప్రకటన ఇచ్చారు. నలుగురికి అలుసై పోతామని గుర్తుకు రాలేదు. కనుగుడ్డు పెరికినా ఫర్వాలేదనే భావించారు.

వాస్తవానికి ఆ సమయంలో తెలంగాణలో మరణాలు లేవు. అయినా గతంలో జరిగిన ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇరుప్రాంతాలూ విభజనకు సానుకూలమనే భావనతో రాష్ట్రాన్ని విభజించమని బహిరంగ ప్రకటనే చేశారు ఎన్టీఆర్‌..

ప్రధాన డిమాండ్లు ముల్కీ నిబంధనల రద్దు, తెలంగాణ అభివృద్ధి సంఘం రద్దు నెరవేరడంతో జై ఆంధ్రకు ఆంధ్రులు మంగళం పాడేయడం మామూలు పరిస్థితులు నెలకొనడం మనకు తెలుసు.

దశాబ్దం తర్వాత….ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం ఏర్పాటు చేశా రు. ఈసారి మళ్లీ గొంతు మారింది. సమైక్య రాష్ట్రం పార్టీ విధానంగా ప్రకటించుకున్నారు. ఆనాడు ఆయన విడుదల చేసిన ప్రసంగాల క్యాసెట్లలో విభజన ఉద్యమాలపై తీవ్రంగా ధ్వజమెత్తడం విశేషం. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఆయన జీవిత విశేషాలను ప్రచురించిన పత్రికలన్నీ ఆయన తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా తీసిన సినిమాను, పాటను ప్రస్తావించి ఆయనను సమైక్యవాద పురుషునిగా చిత్రించాయే తప్ప 1973లో విభజనకు మద్దతు ఇచ్చిన విషయం మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు.

కేవలం పది సంవత్సరాల కిందటి సంఘటనలు మర్చిపోవడం అసాధ్యం. అయినా ఆంధ్ర మీడియా పిల్లి ఆ సమయంలో కళ్లు మూసుకుని పాలు తాగేసింది.

2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటించారు.. ఆంధ్రలో పుట్టుడో పెట్టుడో ఓ సమైక్యవాద ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమంలో భాగంగా చేపట్టిన అన్ని సభల్లో వక్తల నోట ఎన్టీఆర్ ఆశయం మేరకు సమైక్యరాష్ట్రం విడదీయరాదంటూ ప్రసంగాలు…

టీడీపీ వక్తలు అయితే తెలుగుజాతి ఐక్యత కోసం ఎన్టీఆర్ పుట్టారని, జీవితం ధారపోశారని డైలాగులు.. కాషాయాంబర రూపంలో సమైక్యతకు చిహ్నంగా ఎన్టీఆర్ డూపులు….బ్యానర్లలో ఎన్టీఆర్ బొమ్మ. సమైక్య ఉద్యమ పాటలేం లేవు కాబట్టి వేసిన ఒకే పాట ‘తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతి మనది’. ఆనాడు ఈ పాట తరువాత ఎన్టీఆర్ మాట మార్చాడు. ఆ పాట రాసిన సినారే కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రవాదిగా మారారు.

అయినా పార్ట్‌టైమ్ ఉద్యమకారులకు సినిమా పాట తప్ప వేరే దిక్కులేదు మరి!

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]


Connect with us

Videos

MORE