తెలంగాణ ఏర్పాటు తరువాత రెండేళ్ల పాటు కోదండరామ్ సార్ టీఆర్ఎస్ పరిపాలన పట్ల, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం పట్లా సానుకూలంగానే ఉన్నాడు. ఒకసారి అమెరికా పర్యటనకు వెళ్లిన ఆయనను కొంతమంది ఎన్ఆర్ఐలు తప్పుదోవ పట్టించారని అంటారు. ఆ పర్యటన నుండి వచ్చి రావడంతోనే ఆయన రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడడం మొదలు పెట్టారు. ఆర్నెల్ల క్రితం కేసీఆర్ ను దింపుతా అంటూ తెలంగాణ జన సమితి పార్టీ పెట్టారు. ఇప్పుడు తీరా ఎన్నికల సమయంలో కేవలం మూడు నాలుగు సీట్ల కొరకు ఆంధ్రా పార్టీ తెలుగుదేశంతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. ఇది చూసి మొదటి నుండి ఆయనకు మద్దతుగా ఉన్న అనేక మంది ఉద్యమకారులు మండి పడుతున్నారు. ముఖ్యంగా ఆయనకు సాలిడ్ గా మద్దతు ఇచ్చే ఎన్నారై ల నుండే తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
వాషింగ్టన్ నగరంలో ఉండే విజయ్ కృష్ణ ఛాట్ల కోదండరామ్ సార్ మీద రాసిన పోస్టు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.
మీరు కూడా చదవండి!
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడి పోయిందన్నట్లు, స్వార్థరాజకీయ క్రీడలో, పదవుల పందేరంలో, వామనులైపోయిన తెలంగాణవాదులు, మన కోదండరాం సార్!
తెలుగు దేశం అనే ఆంధ్ర ప్ర’దేశ’ పార్టీని మహాకూటమి అనే అవకాశవాద కూటమిలో చేర్చడం, తెలంగాణలో ఉండకుండా చెయ్యవలసిన పార్టీని, నెత్తి మీద పెట్టుకోవడం ఏ విలువలకు చిహ్నమో, మనం ఇన్నిరోజులు నమ్ముతూ వస్తున్న మన టిజాక్ పెద్దలు చెప్పాలె!
తెలంగాణ అస్తిత్వం కాకుండా, కెసిఆర్ ని ఓడించడం ముఖ్యమనుకుని నమ్ముతున్న, నమ్మ పలుకుతున్న వీళ్ళలో తెలంగాణ పట్ల అవగాహన, చిత్తశుద్ధి లేమి కనబడుతుంది! వీళ్ళు ఇంతగా ఎలా దిగజారిపోయారో అనిపిస్తుంది… బాధనిపిస్తుంది.. తెలంగాణని 57 ఏండ్లు నిస్సిగ్గుగా దోచుకున్న ఆంధ్రా పాలకులకు అడుగుమడుగులొత్తిన ఈ కాంగ్రెసోళ్లు ఈ దొంగ ఆంధ్రా బాబు పార్టీతోటి అంటకాగితే మరి తెలంగాణకి మిగిలింది కేసీఆర్ పార్టీనే కదా!
తెలంగాణ కోసం అహర్నిశం కృషి చేసిన తెలంగాణ వాదుల నమ్మకాన్ని మనం ఎంతో విలువిచ్చిన కోదండరాం సార్ వమ్ము చేసిన తీరు అతి దయనీయమైంది. తెలంగాణ చరిత్ర పుటల్లో నుంచి తమను తాము తొలిగించుకున్న టీజాక్ దానిని ఇన్నాళ్లు నడిపించిన, నడిపిస్తూ ఉన్న మన కోదండరాం సార్ని చూస్తే జాలి వేస్తుంది! మనిషి మంచోడే! కానీ దృఢ నాయకత్వ లక్షణాలు లేని మంచి మనిషి! లక్ష్యంపై గురి, ఒత్తిడులతో మారని విలువలు, దృఢ చిత్తం ఉన్న నాయకత్వం మనకి కావాలె!
తెలంగాణకు మరో ప్రత్యామ్నాయం కనిపించేవరకు, కనిపెట్టేవరకు టీఆరెస్ మాత్రమే మన దారి!
ఒక నిబద్ధత ఉన్న ప్రత్నామ్యాయం లేనపుడు ఉన్న ఒక్క కెసిఆర్ ని గెలిపించుకోవడం ప్రతి తెలంగాణ వాడి కర్తవ్యం! వెనుకబడిన తరగతులకు కొంత ప్రాతినిథ్యమే ఆంధ్రా పార్టీ బలమైతే… దాన్ని తిరస్కరించి ఇంకొక పార్టీ పెట్టుకోవాలి. తెలంగాణ ఓటర్లూ.. ఆంధ్ర పార్టీలను తిరస్కరించండి! ఆంధ్రాపార్టీలతో పోయే ఏ తెలంగాణ వాన్నయినా తిరస్కరించండి!