mt_logo

ఎన్నికలు వస్తున్నాయంటే కాంగ్రెస్ నాయకులకు చలిజ్వరం..

ఆలేరు నియోజకవర్గంకు చెందిన పలు పార్టీల నేతలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఇవాళ తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయా పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 2001 లో జెడ్పీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం మొత్తంలో గులాబీ జెండా ఎగిరిందని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పారు.

కాంగ్రెస్ తో ఏమీ కాదని అసెంబ్లీ ఎన్నికల్లోనే తేలిపోయింది. పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతలు ప్రజల చేత తిరస్కరించబడ్డారు. ఎన్నికలు వస్తున్నాయంటే కాంగ్రెస్ నాయకులకు చలిజ్వరం పట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఎందుకు గెలిపించాలో కార్యకర్తలు గ్రామగ్రామాన వివరించాలని కేటీఆర్ సూచించారు. కేంద్రంలో ఎవరు మంత్రిగా ఉంటే వాళ్ళ రాష్ట్రాలకే ప్రయోజనాలు కలుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. రైతు బంధు, రైతు భీమా, మిషన్ భగీరథకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే ప్రధాని మోదీ పట్టించుకోలేదని, మోడీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతున్నదని చెప్పారు. రాహుల్ గాంధీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్డీయేకు 150, యూపీఏకు 100 సీట్లు మించి వచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *