రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పాటు అయినందున కోర్టు పరిధిలోకి కూడా రాదని, పార్లమెంటుకు మాత్రమే పూర్తి అధికారం ఉందని, ఎవరూ దానిని ప్రశ్నించలేరని, సుప్రీం కోర్టు కూడా పార్లమెంటు అధికారాన్ని ప్రశ్నించలేదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
బిల్లుపై శాసనసభలో ఎలా నడుచుకోవాలనే విషయంపై అన్నిపార్టీలకు చెందిన టీ నేతలు న్యాయనిపుణుల సలహాలను తీసుకుంటున్నారు. వారి సలహాలను పాటించడం ద్వారా అసెంబ్లీలో పాటించాల్సిన వ్యూహాన్ని తయారు చేసుకుంటున్నారు. ఇదే విషయంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డితో పలువురు టీ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీలో చర్చకు మాత్రమే అవకాశం ఉందని, ఎలాంటి సవరణలు ప్రతిపాదించే అధికారం లేదని, కేవలం అభిప్రాయాలు మాత్రమే చెప్పి బిల్లును పార్లమెంటుకు పంపాలని చెప్పారు.
సీమాంధ్ర నేతలు సభలో క్లాజులవారీగా ఓటింగ్ కు సిద్ధమవుతూ సమయం వృధా చేస్తున్నారని, దీనివల్ల తెలంగాణ ఏర్పాటులో ఏమైనా న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని అడుగగా, పార్లమెంటుకు మాత్రమే రాష్ట్ర విభజన చేసే అధికారం ఉందని మరోసారి స్పష్టం చేశారు. న్యాయమూర్తిని కలిసినవారిలో మంత్రులు జానారెడ్డి, శ్రీధర్ బాబు, టీఆర్ఎస్ నేతలు ఈటెల రాజేందర్, కేటీఆర్, హరీష్ రావు, టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.