mt_logo

నర్సింగ్ ఆఫీసర్లకు నాలుగు నెలలుగా జీతాలు లేవు: హరీష్ రావు

కొత్తగా నియమితులైన 4,000 మంది నర్సింగ్ ఆఫీసర్ల నాలుగు నెలల పెండింగ్ జీతాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 7 వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నాలుగు నెలలుగా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదు అని దుయ్యబట్టారు.

ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప, వారి జీత భత్యాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన 4 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు అందక అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని పేర్కొన్నారు.

ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు లేని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాలును తక్షణం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాను ఆని హరీష్ రావు అన్నారు.