తెలంగాణ బిల్లులో ఉన్న అంశాలు కాకుండా వేరే ఏ ఇతర సమాచారం కూడా తమకు తెలియకుండా ముఖ్యమంత్రికి గానీ, శాసనసభ్యులకు గానీ అందించరాదని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఏదైనా ఉంటే పార్లమెంటులో చూసుకుంటామని, సభ్యులు పట్టుబడితే తాము పంపించిన నోట్ ను చూపించమని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. బిల్లు అసెంబ్లీకి చేరిన తర్వాత సీమాంధ్ర నేతలు బిల్లు సమగ్రంగా లేదని, కొన్ని తప్పులు దొర్లాయని, వాటిపై తమకు అదనపు సమాచారం అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే. మహంతిని కోరారు. బిల్లులో లేని అంశాలను, తప్పులను వివరిస్తూ సీఎస్ కేంద్ర హోం శాఖకు ఒక లేఖ వ్రాసారు. ఆ లేఖపై స్పందించి కేంద్ర హోం శాఖ ఒక నోట్ ను సీఎస్ కు పంపింది. అందులో ముఖ్యంగా సీమాంధ్ర సభ్యులు అడిగిన సమాచారం అందించవలసిన పని లేదని, అన్ని విషయాలూ కూలంకశంగా చర్చించిన తర్వాత తుది బిల్లులో కేంద్ర కేబినెట్ తగిన అంశాలను చేర్చి పార్లమెంటులో సమర్పిస్తామని తేల్చి చెప్పింది.
గతంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదికలో కొన్ని తప్పులు ఉన్నా వాటినే కేంద్ర హోం శాఖకు పంపారు. మీరు పంపించిన నివేదికే మేము బిల్లులో పెట్టామని హోం శాఖ కార్యదర్శి సురేశ్ మూడురోజులక్రితమే సీఎస్ కు వివరించారు. బిల్లులో దొర్లిన తప్పులను దిద్దుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు డిసెంబర్ నెలలోనే అన్ని శాఖలనుండి ఖచ్చితమైన సమాచారం రాబట్టి వాటిని సంబంధిత శాఖకు పంపించారు. తాజాగా ఆ నివేదికను కేంద్రానికి అందించేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరిదిద్దిన అన్ని అంశాలను నివేదిక రూపంలో తమకే పంపాలని, తుదిబిల్లులో ఈ సవరణలు చేస్తామని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.
బిల్లును ఎలాగైనా చర్చ జరక్కుండా అడ్డుకోవాలని చూస్తున్న సీమాంధ్ర నేతలకు ఇది చెంపపెట్టులాంటిది.