mt_logo

తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లే: జైపాల్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం వచ్చేసినట్లేనని, అందులో ఏమాత్రం సందేహం లేదని కేంద్రమంత్రి ఎస్. జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఉస్మానియా మెడికల్ కళాశాలలో జరిగిన టీ ఎన్జీవో డైరీ ఆవిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు బలవంతపు పెళ్లి అని, ఆ పెళ్లి పెద్దలు కుదిర్చినది కాదని, ప్రేమ వివాహమూ కాదని, ఎప్పుడైనా విడిపోవచ్చని నెహ్రూనే స్వయంగా చెప్పారని జైపాల్ రెడ్డి చెప్పారు. షరతులతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు విఫలమైందని, తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమం దేశంలో ఎక్కడా జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటు కంటే ఉన్నత చట్ట సభ ఎక్కడా లేదని సీమాంధ్ర నేతలకు స్పష్టం చేశారు. లక్షలాదిమంది టీ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకుల వల్ల డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిందని, తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీ జేఏసీ చైర్మన్ కోదండరాం, విద్యార్థులు, రైతుల పోరాటాలు మామూలువి కావని జైపాల్ రెడ్డి పేర్కొన్నారు.

టీ జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ, షరతులు లేని సంపూర్ణ తెలంగాణ కావాలని, బిల్లులో తప్పనిసరిగా సవరణలు చేసి హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో కీలక బాధ్యతను తీసుకోవాలని జైపాల్ రెడ్డిని కోరారు. బీజేపీ నేత సీ.హెచ్ విద్యాసాగర్ రావు తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడానికి ఎన్డీయే ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, బిల్లుపై సవరణలు పూర్తయ్యేవరకూ జాగ్రత్తగా ఉండాలని, పోరాటం చేసైనా తెలంగాణను నిర్మించుకుందామని సూచించారు. ఈ కార్యక్రమంలో టీ జేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, చుక్కా రామయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, శ్రీనివాస్ గౌడ్, అద్దంకి దయాకర్, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సీ. విఠల్, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ పుట్టా శ్రీనివాస్, కవి,  గాయకుడు దేశపతి శ్రీనివాస్, కే.వీ.విశ్వేశ్వర్ రెడ్డి, టీపీఎఫ్ ఉపాధ్యక్షుడు వేదకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *