శాసనమండలిలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మే నెల తర్వాత కరెంట్ కోతలుండవని, ఒకవేళ ఉన్నా అతి స్వల్పంగానే ఉంటాయని, అది కూడా సరఫరాలో తలెత్తే సమస్యల వల్లే ఉంటుందని స్పష్టం చేశారు. హిందూజా, కృష్ణపట్నం నుండి మనకు రావలసిన వాటా ఏపీ ఇవ్వలేదు. కేంద్రం మొట్టికాయలేసి లిఖిత పూర్వక ఆదేశాలిచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదు.. ఇప్పుడు బాబు కరెంట్ ఇస్తామన్నా తీసుకోం. కరెంట్ వినియోగం ఉత్పత్తిపై ప్రతి నిమిషం మానిటరింగ్ చేస్తున్నామని సీఎం తెలిపారు.
వ్యవసాయానికి కావాల్సిన కరెంట్ 2200 నుండి 2500 మెగావాట్లు. ప్రైవేట్ సెక్టార్ కు కరెంట్ ఉత్పత్తి ఇవ్వబోమని తెగేసి చెప్పాం. సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల తాడిచర్ల బొగ్గుగని మనకు కాకుండా పోయింది. దానికోసం తిరిగి దరఖాస్తు చేశామని చెప్పారు. 2016 నుండి రైతులకు ఉదయం 9 గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు కరెంట్ ఇస్తాం. 2017 పూర్తయ్యేనాటికి అన్ని సెక్టార్లకు 24 గంటల కరెంట్ ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.