mt_logo

తెలంగాణపై ఆంక్షలుంటే మళ్ళీ సమరానికి సిద్ధం: కేసీఆర్

మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ తెలంగాణ మీద ఏమైనా ఆంక్షలుంటే ఒప్పుకునేది లేదని, సంపూర్ణ తెలంగాణ కోసం అవసరమైతే మళ్ళీ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బిల్లులో నాలుగు అభ్యంతరకరమైన అంశాలున్నాయని, వాటిని సవరణ చేయకపోతే తెలంగాణ ఆర్ధికంగా నష్టపోతుందని అన్నారు.

1919-20లలోనే హైదరాబాద్ లో స్థానికులకు ఉద్యోగాలు దక్కాలని ఉద్యమం వచ్చిందని, దాని కారణంగానే ముల్కీ రూల్స్ వచ్చాయని చెప్పారు. సీమాంధ్ర ముఖ్యమంత్రుల హయాంలో ముల్కీ రూల్స్, 36, 610 జీవోలు అమలు కాకుండా అడ్డుకున్నారని స్పష్టం చేశారు. బిల్లును క్షుణ్ణంగా చదివి అందులో అభ్యంతరాలను ప్రధాని, సోనియాగాంధీలకు వివరించి సంపూర్ణ తెలంగాణ సాధించుకుందామని, ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేశారు.

జనవరి ౩న ఇందిరాపార్కులో జరిగే ధర్నాకు అందరూ సిద్ధం కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

“తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చింది. అందులో అనుమానమేలేదు. నేను అబద్ధాలు ఆడను. ఆమెకు కృతఙ్ఞతలు ఎలా చెప్పాలా అని చూస్తున్నాం” అని కేసీఆర్ చెప్పారు. చివరిగా ఆయన చెప్పిన పాము కథ అందర్నీ ఉత్సాహ పరిచింది.

టీజేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ, రాబోయేది తెలంగాణ నామ సంవత్సరం అన్నారు. బిల్లుపై అభ్యంతరాలను తెలుపుతూ జనవరి 6-7 తేదీల్లో భారీ ధర్నా చేస్తామని చెప్పారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్, బీజేపీఎల్పీ నేత యెండల లక్ష్మీనారాయణ, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, టీ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *