mt_logo

శకునం చెప్పే జేపీ కుడితిలో పడ్డాడు

రాజ్యాంగాన్ని చంకలో ఉంచుకుని ఎక్కడెక్కడి పుస్తకాల్లోంచి కొటేషన్లను ధారాళంగా మనమీదికి విసిరేసి “చూశావా అర్భకా” అనే పోజుకొట్టే నాగభైరవ జయప్రకాశ్ నారాయణ టీవీ సాక్షిగా ఒక అబద్ధం ఆడేసి అడ్డంగా దొరికిపోయారు. అఫ్ కోర్స్ అదేమీ కొత్త అబద్ధం కాదు. చాలాకాలంగా అరకొర నాలెడ్జీ ఉన్న తెలంగాణ వ్యతిరేకులందరూ వల్లె వేస్తున్నదే. కాకపోతే ఆ అబధ్ధాన్ని జయప్రకాశ్ నారాయణలాంటి మేధావులుంగారు వల్లెవేయడమే ఆశ్చర్యం కలిగిస్తున్నది.

పరకాల ఉప ఎన్నికల నేపథ్యంలో లోక్ సత్తా అధినేతకు హఠాత్తుగా తెలంగాణపై ప్రేమ పుట్టుకు వచ్చింది. ఇంకేముంది “అందరికీ ఆమోదయోగ్యంగా, సామరస్యపూర్వకంగా వచ్చే తెలంగాణను తాము ఆహ్వానిస్తున్నాం” అని రెండు మెలికలు ఉన్న స్టేట్మెంట్ ఒకటి పారేశారు. సరే ఆ మెలికల సంగతి తరువాత మాట్లాడుకుందాం. చాలా కాలంగా తెలంగాణ వ్యతిరేక వైఖరి కనబరుస్తున్న లోక్ సత్తా నుండి ఇట్లాంటి స్టేట్మెంట్ రావడం ఒక వార్త అయ్యింది. దీన్ని పురస్కరించుకుని నిన్న TV5 చానెల్ వాళ్లు నాగభైరవ జయప్రకాశ్ నారాయణను ఇంటర్వ్యూ చేశారు. దాంట్లో షరా మామూలుగానే ఆయన ఒక పేద్ద ప్రవచనం చెప్పారు. దాని మధ్యలో అలవోకగా ఒక అబద్ధాన్ని ఇరికించారు.

రాష్ట్ర విభజనలో హైదరాబాద్ అంశాన్ని ప్రస్తావిస్తూ…

“ఇప్పటిదాకా ఇట్లాంటి సమస్య రాలేదు. ఈ దేశంలో ఎప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడినా కూడా రాజధానికి దూరంగా ఉన్నది, పెద్ద నగరం లేనిది, మమ్మల్ని పట్టించుకోవట్లేదన్న భావం ఉన్నది…అలాంటిదొచ్చింది…” అన్నాడు.

హతోస్మి!

తెలంగాణ వ్యతిరేకులు అనేక ఏళ్లుగా ఈ పచ్చి అబద్ధాన్ని వల్లెవేస్తున్నారు. ఇప్పటిదాకా ఈ దేశంలో విడిపోయే భాగంలో రాజధాని లేదనేదే ఆ అబద్ధం. తెలంగాణను వ్యతిరేకించేవాళ్లల్లో అత్యధికులు చరిత్ర తెలియని మూర్ఖశిఖామణులే కాబట్టి ఇట్లాంటి అబద్ధాలు చలామణిలోకి రావడం ఆశ్చర్యమేమీ లేదు.

కానీ ఇంత చదువుకున్న జయప్రకాశ్ నారాయణ ఇదే అబద్ధాన్ని వల్లెవేయడమే దారుణం.

ఈ దేశంలో ఇదివరకు రెండు ప్రాంతాలు రాజధానులతో సహా విడిపోయాయి.

స్వాతంత్ర్యానంతరం మరాఠీ మాట్లాడే ప్రాంతాలను ఉమ్మడి బొంబాయి రాష్ట్రం నుండి విడదీసి మహారాష్ట్రను ఏర్పాటు చేయాలని ఉద్యమం తలెత్తింది. అప్పుడు గుజరాతీలు, మరాఠీలు ఇద్దరూ బొంబాయి నగరం కొరకు పట్టుబట్టారు. ఇప్పుడు సీమాంధ్ర సోదరులు అంటున్నట్టుగానే అప్పుడు గుజరాతీలు కూడా బొంబాయి నగరాన్ని తామే అభివృద్ధి చేశామని కనుక దానిపై తమకు హక్కు ఉంటుందని వాదించారు. అప్పుడు అంబేడ్కర్ మరాఠీల పక్షాన వాదిస్తూ బొంబాయి నగరంలో గుజరాతీలు ఎప్పటికైనా ఇంటికి కిరాయిదార్ల వంటివారేనని, వారు ఆ ఇంటికి రంగులు వేసినంత మాత్రాన ఎన్నటికీ ఆ ఇంటిపై హక్కుదార్లు కారని చెప్పారు.

గుజరాతీలు పట్టు వీడలేదు. బొంబాయి నగరం తమకు దక్కకపోతే దాన్ని కేంద్రపాలితప్రాంతం చేయాలని పట్టుబట్టారు. వారి మాటను మన్నించిన నెహ్రూ, బొంబాయిని అయిదేళ్లపాటు కేంద్రపాలిత ప్రాంతం చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు.

కానీ భౌగోళికంగా మహారాష్ట్ర మధ్యలో ఉన్న బొంబాయి కేంద్రపాలిత ప్రాంతంగా ఎక్కువకాలం మనలేకపోయింది. నగరంలో అశాంతి నెలకొన్నది. చివరికి కేంద్రప్రభుత్వం దిగివచ్చి బొంబాయిని మహారాష్ట్రకు రాజధాని నగరంగా ప్రకటించి గుజరాత్ కు మరొక రాజధాని నిర్మించవలసి వచ్చింది.

ఇక రెండో ఉదాహరణ: ఈశాన్య భారతంలో ఉన్న అతిపెద్ద రాష్ట్రం అస్సాం నుండి మేఘాలయ విడిపోయినప్పుడు అప్పటి అస్సాం రాష్ట్ర రాజధానిగా ఉన్న షిల్లాంగ్ తో సహా విడిపోయింది. అప్పుడు అస్సాం రాజధానిని గౌహతి శివార్లలోని డిస్పూర్ కు మార్చవలసి వచ్చింది.

దేశవిదేశాల్లోని ఎన్నో అంశాల పట్ల అనర్గళంగా ఉపన్యాసాలు దంచే నాగభైరవ జయప్రకాశ్ నారాయణకు ఇంత చిన్న విషయం తెలియదా, లేక తెలిసీ బుకాయిస్తున్నాడా? ఆయన భక్తులే బదులివ్వాలిప్పుడు.

లోక్ సత్తా అధినేతకు కనుక తెలంగాణ విభజనకు అడ్డంకిగా మారిన అంశాలను పరిష్కరించే చిత్తశుద్ధి ఉంటే అందుకు ఉపకరించే ఉదాహరణలు మన దేశచరిత్రలో బోలెడు ఉన్నాయి. కేవలం ఉపన్యాసాలతోనే సమస్యలు పరిష్కారం అయిపోతాయనుకునే నాగభైరవ జయప్రకాశ్ నారాయణకు అటువంటి చిత్తశుద్ధి లేకపోవడమే అసలు విషాదం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *