mt_logo

కలిసి ఉంటే కలదు సుఖం (నాకుమాత్రమే!!)

By: విశ్వరూప్

రాష్ట్రం మొత్తం ఇప్పుడు ప్రత్యేక, సమైక్యవాదులుగా చీలిపోయింది. రెండు వర్గాల వారూ తాము చెప్పేదే రైటూ, అవతలివారిది అబద్దాలు అంటారు. ఇంతకూ సమైక్యవాదం, తెలంగాణవాదం ఈ రెండు వాదనలలో ఉన్న తేడాలేమిటి?

– తెలంగాణా కోరుకునే వారు మాట్లాడేది మా నీళ్ళు, మా ఉద్యోగాలు, మా ప్రాంతానికి నిధులు అని, ఇవన్నీ ఇన్నిరోజులు సరిగ్గా పంచబడలేదు కాబట్టి మాకు స్వయంపాలన కావాలని. సమైక్యవాదులు చెప్పేది మనదంతా ఒకే భాష కాబట్టి అంతా కలిసే ఉండాలి అని.

నీళ్ళు, నియామకాలలో అన్యాయం జరుగుతుందని వాపోతుందన్నవారు కేవలం భాషను చూసి కలిసి ఉండాలంటే ఎలా ఉంటారు? సమాన అవకాశాలు, సమాన న్యాయం లేకుండా సమైక్య భావన ఎలా ఉంటుంది? కడుపు కాలుతుంటే తెలుగుజాతి గౌరవం అంటూ నినాదాలు ఎవరిని ఉత్తేజపరుస్తాయి?

– ఒక వ్యక్తి తెలంగాణా కావాలని వాదిస్తే అది తన కోసం కాదు, తన ప్రాంతంలో ఉండే సామాన్యుడి కోసం. తెలంగాణా వస్తే బ్లాగుల్లో ఆర్టికల్స్ రాసుకునే ఐటీ ఉద్యోగికి ఒరిగేదేమీ ఉండదు, కానీ తాను వాదించేది తన కోసమో లేక తన లాంటి ఉన్నతవర్గం కోసమో కాదు. తెలంగాణావాదులు వాదించేది ఎకరం భూమి ఉండి సాగునీటి కోసం దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న ఒక రైతుకోసమో, ఒక డిగ్రీ చదివి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసే బీద మధ్యతరగతి యువకుల కోసమో లేక ఫ్లోరైడ్‌తో జబ్బులు తెచ్చుకుంటున్న సామాన్యుడికి తాగునీటి కోసమో.

ఒక సమైక్యవాది వాదించేది మాత్రం సీమాంధ్రలోని సామాన్యులకోసం కాదు (తెలంగాణలోని సామాన్యుడికోసం అసలు కాదు, న్యాయంగా సమైక్యవాది ఇరుప్రాంతాలవారి కోసం మాట్లాడాలి). హైదరాబాదులో భూములధరలగురించి, హైదరాబాదులో ఉండే ధనిక సీమాంధ్రుల కోసం, తను లేక తమ లాంటి రిచ్ అండ్ ఎలైట్ కోసం.

– తెలంగాణావాదులు మాట్లాడేది తమ ప్రాంత సామాన్యులకు న్యాయంగా రావాల్సిన నీళ్ళు, నిధులు, ఉద్యోగాలకోసం. సమైక్యవాదులు మాట్లాడేది తము ఇప్పటిదాకా అక్రమంగా కొల్లగొడుతున్న నీళ్ళు, నిధులు, ఉద్యోగాల కోసం.

– తెలంగాణ ఉద్యమం పేద మధ్యతరగతి ప్రజల, వెనుకబడిన తరగతులు, దళితుల ఉద్యమం. సమైక్య వాదన మాత్రం ధనిక అగ్రకుల వర్గాలవారి వాదన, సీమాంధ్ర సామాన్యులలో, సీమాంధ్ర దళిత వెనుకబడినవారిలో లేని భావన.

– తెలంగాణవాదులు చెప్పేది తాము స్వయంగా అనుభవించిన వివక్షను గురించి. సమైక్యవాదులు చెప్పేది వివక్ష అనేది అబద్ధం, అంతా బాగానే ఉంది అని. మీరు అనుభవించనిదాన్ని అబద్ధం అని ఎలా చెబుతారు? కడుపుకాలిన వాడు నాకు ఆకలవుతుందని చెబితే పక్కన ఉన్న కడుపు నిండిన వాడు నీ ఆకలి అంతా ఉట్టి అబద్ధం అంటే ఎలా ఉంటుంది?

– హైదరాబాదులో ఉండే కొద్దిమంది సెక్యూరిటీకి నష్టం అనే ఊహజనిత వాదన గురించి, కనీసం మిగతా తెలంగాణ ప్రాంతంలోని సీమాంధ్ర సెటిలర్ల సెక్యూరిటీ గురించి కూడా కాదు.

మరి ఇందులో ఏది అసలయిన ఉద్యమం, ఏది అబద్దపు ఉద్యమం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *