తెలంగాణ అంటే ఇతర సీమాంధ్ర నేతల్లాగే నాగభైరవకు కూడా పట్టరాని వ్యతిరేకత. తొలినాళ్లలో ఆయన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంపై ఒంటికాలిపై లేచేవాడు. డిసెంబర్ 9, 2009 నాడు తెలంగాణ ఏర్పాటు ప్రకటన వచ్చినప్పుడు ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆ తరువాత హుటాహుటిన ఢిల్లీ వెళ్లి తన పలుకుబడిని ఉపయోగించి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను నిలుపుదల చేస్తూ డిసెంబర్ 23 నాడు మరొక ప్రకటన వచ్చేలా చేశాడు. తదనంతర కాలంలో అనేకసార్లు తెలంగాణ ఉద్యమంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా విషం కక్కాడు.
శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన 118 పేజీల నివేదికలో ఒక్కచోట కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్ధతు ఇవ్వకపోగా, రాష్ట్ర ఏర్పాటు అవసరం లేదని, “సమస్య” పరిష్కారానికి కొన్ని చిట్కా వైద్యాలు కూడా సూచించింది లోక్ సత్తా పార్టీ.
సమైక్యాంధ్ర లాబీ ఎన్ని ఎత్తులు వేసినా తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఉధృతి తగ్గకపోగా ఇంకా ఎక్కువవడం, మరోవైపు తన వైఖరి కారణంగా తెలంగాణలో మొత్తం పార్టీ తుడిచిపెట్టుకుపోవడంతో నాగభైరవుడికి ఇటీవల కొంచెం తత్వం బోధపడుతోంది. అందుకే ఈ మధ్య ఎక్కడ అవకాశం దొరికినా తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని ప్రకటనలు గుప్పిస్తున్నాడు ఈయనగారు.
అందులో భాగంగానే ఎన్నడూ లేనిది ఈసారి లోక్ సత్తా వారు కూడా తమ పార్టీ ఆఫీసులో బతుకమ్మ జరుపుకున్నారు. అయితే ఇక్కడే ఆ పార్టీవారు తమ నైజం మరోసారి బయటపెట్టుకున్నారు. బతుకమ్మ పాటలో కూడా నాగభైరవుడిని స్తుతించి తమ స్వామిభక్తిని చూపించుకున్నారు సదరు పార్టీ సభ్యులు. అంతటితో సంతృప్తి చెందక ఏకంగా తమ పార్టీ పత్రికలో కూడా ఆ పాటను అచ్చువేసుకుని తరించారు.
లోక్ సత్తా పార్టీలో వ్యక్తిపూజ కొత్తకాదు. నాగభైరవుని ఊకదంపుడు ఉపన్యాసాలు విని లోక్ సత్తా ఏదో ఊడబొడిచేస్తుందని ఆ పార్టీలో చేరిన అనేకమంది విద్యాధికులు అనతికాలంలోనే ఆ భజన పార్టీలో ఇమడలేక బయటికి వచ్చేస్తుంటారు.
బతుకమ్మ పండుగను కూడా తమ నాయకుడిని కీర్తించడానికే వాడుకోవడం లోక్ సత్తాలో వ్యక్తిపూజకు పరాకాష్ట.