mt_logo

కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన తెలంగాణ యువతేజం.. నిఖత్ జరీన్

తెలంగాణ పంచ్ పవర్ అయిన నిఖత్ జరీన్ కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణ పథకాన్ని గెలుచుకుంది. బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో నిఖత్ అలవోకగా అన్ని రౌండ్స్ లో అదరగొట్టి పసిడి పతకం సాధించింది. ఈ టోర్నీలో 48-50 కేజీల ఫ్లైవెయిట్ కేటగిరీలో పోటీ పడిన నిఖత్ జరీన్.. ఫైనల్‌లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన బాక్సర్ కార్లీ మెక్‌నాల్‌ను ఓడించి స్వర్ణం తన ఖాతాలో వేసుకుంది. ఫైనల్‌లో కార్లీపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన నిఖత్ 5-0 తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌ తప్ప మిగతా అన్ని మ్యాచుల్లోనూ నిఖత్ ఇదే స్కోరుతో గెలిచింది. ఆ ఒక్క మ్యాచ్‌ను అంపైర్ మరో రెండున్నర నిమిషాలు ఉండగా.. ఆపేసి నిఖత్‌ను విజేతగా ప్రకటించారు.

సీఎం కేసీఆర్ ప్రశంసలు :

కామన్వెల్త్‌ క్రీడల్లో గోల్డ్ మెడల్ పొందిన తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న పోటీల్లో నెగ్గిన వెంటనే.. నిఖత్‌తో ఫోన్‌లో మాట్లాడిన కేసీఆర్‌ దేశ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేశావని పేర్కొన్నారు. ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన నిఖత్‌.. తాజా క్రీడల్లో స్వర్ణంతో సత్తాచాటడం మరింత సంతోషాన్నిచ్చిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. జరీన్‌ ప్రదర్శనతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాప్తమైందని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉంటుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఈ ఏడాది రాష్ట్ర అవతరణ దినోత్సవం (జూన్‌ 2) రోజున.. ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌కు కేసీఆర్‌ రూ. 2 కోట్ల నగదు బహుమతి నజరానాతో పాటు కుటుంబంతో సహా జరీన్‌ను ఇంటికి పిలిచి కలసి భోజనం చేశారు. ఆ సమయంలో నిఖత్‌.. సీఎంతో మాట్లాడుతూ.. మీరిచ్చిన స్ఫూర్తితో బర్మింగ్‌హామ్‌లో స్వర్ణం సాధిస్తానని చెప్పింది. ఇప్పుడా మాటలు నిజం చేస్తూ జరీన్‌ ఇంగ్లిష్‌ గడ్డపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *